Begin typing your search above and press return to search.

బీజేపీ తెల్లపత్రం...కాంగ్రెస్ నల్లపత్రం...దేశానికి చేసిందేంటి...!?

కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వం 2004 నుంచి 2014 దాకా రాజ్యం చేస్తే బీజేపీ నరేంద్ర మోడీ నాయకత్వంలో 2014 నుంచి 2024 దాకా దాకా పదేళ్ల పాలించింది.

By:  Tupaki Desk   |   12 Feb 2024 1:47 PM GMT
బీజేపీ తెల్లపత్రం...కాంగ్రెస్ నల్లపత్రం...దేశానికి చేసిందేంటి...!?
X

ఈ .దేశాన్ని కాంగ్రెస్ పదేళ్ల పాటు పాలించింది. బీజేపీ మరో పదేళ్ళు పాలించింది. అలా రెండు ప్రభుత్వాల మధ్య పోలిక తేల్చడానికి లెక్క కరెక్ట్ గా సరిపోయింది. కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వం 2004 నుంచి 2014 దాకా రాజ్యం చేస్తే బీజేపీ నరేంద్ర మోడీ నాయకత్వంలో 2014 నుంచి 2024 దాకా దాకా పదేళ్ల పాలించింది. ఇపుడు రెండు పార్టీలు ప్రజల ముందు కొత్త తీర్పు కోసం రాబోతున్నాయి.

యధాప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏమీ సాగలేదు అంటూ ఇటీవల బీజేపీ తెల్ల పత్రం అనబడే శ్వేతపత్రం రిలీజ్ చేసింది. మరో వైపు చూస్తే కాంగ్రెస్ చూస్తూ ఊరుకుంటుందా బీజేపీ పదేళ్ల పాలన అంతా దండుగ మారి అని ఏకేసింది. వినాశన కాల్ అని కాంగ్రెస్ పాలిత దశాబ్దానికి బీజేపీ పేరు పెడితే అన్యాయ కాల్ అంటూ కాంగ్రెస్ బీజేపీ పదేళ్ల పాలనను ఎత్తి పొడించింది.

ఇక కేవలం కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీయే పదేళ్ల పాలనలో ఆర్ధిక అంశాలనే శ్వేతపత్రంలో బీజేపీ ప్రస్తావిస్తే నాలుగాకులు ఎక్కువ చదివిన కాంగ్రెస్ దేశ ఆర్ధిక రాజకీయ సామాజిక అంశాలను కూడా పేర్కొంటూ మొత్తంగా అన్నింటా మోడీ విఫలం అని ఒక బ్లాక్ మార్క్ వేసేసింది.

యూపీఏ పాలన అంతా కుంభకోణాల మయం అని బొగ్గు స్కాం టెలికాం స్కాం లతో పాటు మొండి బకాయిల పెరుగుదల లోటు బడ్జెట్ ని అధిగమించలేకపోవడం, సకాలంలో సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం అని బీజేపీ విమర్శించింది.

కాంగ్రెస్ అయితే బీజేపీ పదేళ్ల పాలనలో దేశంలో భారీగా నిరుద్యోగం పెరిగిందని, జీఎస్టీని ఉన్నట్లుండి ఏ రకమైన ప్రణాళిక లేకుండా అమలు చేయడం వల్ల పెద్ద నోట్ల రద్దు వంటి వాటి వల్ల దేశంలో ఆర్ధిక సంక్షోభం పెరిగిందని పేర్కొంది. అంతే కాదు ధనిక పేదల మధ్య అంతరాలు బాగా పెరిగాయని కూడా ఘాటైన విమర్శలే చేసింది.

ఈ నేపధ్యంలో తటస్తులు కానీ ఆర్ధిక వేత్తలు కానీ ప్రపంచ బ్యాంక్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ఐఎంఎఫ్), మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్(ఎంఓఎస్‌పీఐ) గణాంకాల ప్రకారం చూస్తే కనుక రెండు ప్రభుత్వాల్లో కొన్ని కీలక అభివృద్ధి ఉంది. అలాగే మరి కొన్ని కీలక రంగాలలో వెనకబాటు ఉంది అని తేల్చారు. అంటే మిశ్రమ ఫలితాలు అన్న మాట.

రెండు పార్టీలు తప్పులు చేశాయి. అలాగే మంచి కూడా దేశానికి చేకూర్చే పనులు చేశాయి అని చెబుతూనే ఇంకా చాలా చేయాల్సి ఉందని మాత్రం స్పష్టం చేశాయి. అవేమిటో ఒక్కసారి చూస్తే కనుక అనేక రకాలైన ఆసక్తిని కలిగించే విషయాలు వెల్లడి అవుతాయి.

ఆర్థిక అభివృద్ధి :

యూపీఏ పాలనలో ఒక్క ఏడాది 2008 నుంచి 2009 మధ్యలో ప్రపంచ ఆర్ధిక సంక్షోభాన్ని మినహాయిస్తే ప్రతీ ఏటా జీడీపీ 8.1 శాతం తగ్గలేదు. అదే పదేళ్ల బీజేపీ ఏలుబడిలో జీడీపీ సగటు శాతం 7.1 గా ఉంది. అయితే ఈ మధ్యలో కరోనా విపత్తు ప్రపంచాన్ని కమ్మేసింది. ఇది ప్రపంచ ఆర్ధిక సంక్షోభం కంటే అనేక రెట్లు పెద్దది కాబట్టి కొంత బీజేపీ పాలనకు ఈ విషయంలో మినహాయింపు ఇవ్వాలని ఆర్ధిక వేత్తలు అంటున్నారు. అయితే బీజేపీ పాలనలో మౌలిక అంశాలకు పెద్ద పీట వేశారని, వేగవంతమైన అభివృద్ధికి పునాది పడిందని కూడా అంటున్నారు

ద్రవ్యోల్బణం విషయం :

ఇక ఏ ఆర్థిక వ్యవస్థ విషయంలో అయినా నికరంగా పరిస్థితి ఏంటి అన్నది చెప్పడానికి ద్రవ్యోల్బనం ఒక కొలమానంగా తీసుకుంటారు. అది బీజేపీ ఏలుబడిలో కట్టడి చేయబడింది అని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ బ్యాంకు, పీఐబీ లెక్కల ప్రకారం చూసుకుంటే కనుక కాంగ్రెస్ ఏలుబడిలో సగటు ద్రవ్యోల్బణం రేటు 7.9 కాగా, బీజేపీ పాలనలో సగటు ద్రవ్యోల్బణం రేటు 4.7 శాతంగా ఉంది. ఇక బీజేపీ ఏలుబడిలో చమురు ధరలు తక్కువ అని అదే కాంగ్రెస్ హయాంలో ఎక్కువ అని కూడా అంటున్నారు.

రహదార్ల నిర్మాణం ఇతర మౌలిక పెట్టుబడులు :

దేశంలో మౌలిక సదుపాయాల కల్పన చాలా ముఖ్యం. ముఖ్యంగా రోడ్ల నిర్మాణం వంటివి. ఈ విషయంలో బీజేపీ గత పదేళ్ళలో 54 వేల కిలోమీటర్ల జాతీయ రహదారులను నిర్మించింది. అదే కాంగ్రెస్ పదేళ్ల పాలనలో కేవలం 27 వేల కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణం జరిగింది అన్నది ఒక కచ్చితమైన లెక్కగా ఉంది.

తయారీ రంగం:

ఈ విషయంలో బీజేపీ ప్రభుత్వం వెనకబడిపోయింది. గత పదేళ్లలో చూసుకుంటే కనుక దేశ జీడీపీలో తయారీ రంగం వాటా తగ్గింది. మేక్ ఇన్ ఇండియా అని ఎంతలా ప్రచారం చేసినా కరోనా కాలం మినహాయించినా కూడా ప్రపంచ బ్యాంకు గణాంకాల ప్రకారం చూసుకుంటే కనుక దేశ జీడీపీలో తయారీ రంగం వాటా బీజేపీ పాలనలో 13 శాతంగా ఉంది. అదే పదేళ్ల కాంగ్రెస్ పాలనలో 15 నుంచి 17 శాతంగా ఉంది.

ఎగుమతుల అభివృద్ధి :

పీఐబీ బడ్జెట్ పత్రాల ప్రకారం చూస్తే కనుక ఎగుమతులలో దేశం వాటా బీజేపీ పాలనలో కేవలం ఒకటిన్నర రెట్లు మాత్రమే పెరిగింది. అంటే 300 బిలియన్ డాలర్ల కంటే 437 బిలియన్ డాలర్లకు చేరుకుంది అని చెబుతున్నారు. అదే కాంగ్రెస్ హయాంలో చూస్తే ఏకంగా మూడున్నర రెట్లు పెరిగింది. 2004 నాటికి ఉన్న 80 బిలియన్ డాలర్ల నుంచి 300 బిలియన్ డాలర్ల దాకా ఈ వాటా పెరిగింది. ఇది రికార్డుగా చెబుతున్నారు.

మానవాభివృద్ధి సూచీ :

ఇది చాలా ముఖ్యం. మానవ అభివృద్ధి సూచీని లెక్కించడానికి ఆరోగ్యం, అందరికీ విద్య వంటివి ప్రమాణంగా తీసుకుంటారు. ఈ విషయంలో బీజేపీ వెనకబడింది అని నివేదికలు వెల్లడిస్తున్నాయి.యూఎన్‌డీపీ గణాంకాల ప్రకారం చూసుకుంటే కనుక మానవాభివృద్ధి సూచీలో భారతదేశం పూర్తిగా వెనకబడింది. మొత్తం 191 దేశాల్లో భారత్ 131 స్థానంలో ఉండగా 2021ల నాటికి అది కాస్తా 132వ స్థానానికి తగ్గిపోయింది. ఇక్కడ కాంగ్రెస్ పాలన కంటే బీజేపీ ఏలుబడిలో చాలా వెనకబడి ఉంది అని అంటున్నారు. కాంగ్రెస్ పాలనలో 15 శాతం పైగా మానవాభివృద్ధి సూచీ మెరుగుపడింది అని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇక యూఎన్‌డీపీ తాజా డేటా ప్రకారం చూసుకుంటే 2014 నుంచి 2021 మధ్య మానవాభివృద్ధి సూచీలో కేవలం 2 శాతం మాత్రమే మెరుగుపడింది అంటే బీజేపీ హయాంలో ఇబ్బందికరమే అని అంటున్నారు. బీజేపీ పాలనలో మానవ మూలధనం పెంచడంలో నిర్లక్ష్యం కనిపిస్తోంది అని ఆర్ధిక నిపుణులు అంటున్నారు.

అయితే ఇది పూర్తి సమగ్రమైన అంచనా కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాల మీద కానే కాదు అని అంటున్నారు. పూర్తిగా విశ్లేషించాలంటే స్టాక్ మార్కెట్‌ రిటర్న్స్, సబ్సిడీల కోసం పెట్టిన ఖర్చు, కొత్త ఉద్యోగాల కల్పన, వినియోగం వంటి అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. కొన్ని రంగాలు కొంత వరకూ ప్రగతి సూచిక తీసుకుని మాత్రమే ఈ విశ్లేషణ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే ఆర్థిక ప్రగతి అన్నది నిరంతరమైన కార్యక్రమం. ఒక ప్రభుత్వం మంచి చేస్తే ఆ తరువాత వచ్చిన ప్రభుత్వం దాన్ని కొనసాగించినపుడు అంతిమ ప్రయోజనం దేశానికి దక్కుతుంది. అలాగే కొన్ని నిర్ధిష్టమైన రంగాలలో ప్రభుత్వాలు మారినా ఆలోచనలు ఒక్కటిగా ఉంటేనే దేశం ముందుకు సాగుతుంది అని ఆర్థిక నిపుణులు అంటున్నారు.