చిన్న పార్టీలే బీజేపీ టార్గెట్...వారితోనే మ్యాజిక్...?
బీజేపీ లో ఉన్న పార్టీల లో అత్యధికం చిన్న పార్టీలే. చాలా పార్టీలు ఒక్క సీటు రెండు సీట్ల లోనే గెలిచి ఉన్నాయి.
By: Tupaki Desk | 17 July 2023 11:49 AM GMTదేశం లో బీజేపీ కాంగ్రెస్ రెండూ పెద్ద పార్టీలు, జాతీయ పార్టీలు అధికారం లోకి వచ్చేందుకు నాయకత్వం వహించేందుకు అవకాశం ఉన్న పార్టీలు ఈ రెండే కనిపిస్తాయి. అయితే రెండు మార్లు ఫుల్ మెజారిటీ తో అధికారం లోకి వచ్చిన బీజేపీ కి ఈసారి సొంతంగా మెజారిటీ తో అధికారం లోకి రావడం అన్నది ఒక విధంగా కల అనే అంటున్నారు.
దాంతో తొమ్మిదేళ్ల పాటు ఏ ఊసూ లేకుండా వదిలేసిన ఎన్డీయేను బయట కు తీసింది. మీటింగ్ పెడుతోంది. అయితే ముప్పయి దాకా ఎన్డీయేలో పార్టీలు ఈ భేటీ లో పాలుపంచుకుంటాయన్నది ఎండీయే నేతల మాట. అయితే అందులో ఉన్న పార్టీలు ఏంటి, వాటికి ఉన్న బలం ఏంటి అన్నది చూస్తే చాలా చిత్రాలు కనిపిస్తాయి.
బీజేపీ లో ఉన్న పార్టీల లో అత్యధికం చిన్న పార్టీలే. చాలా పార్టీలు ఒక్క సీటు రెండు సీట్ల లోనే గెలిచి ఉన్నాయి. మరి కొన్ని పార్టీలు చూస్తే ఇంకా చట్ట సభల లో అడుగుపెట్టలేనివి. ఇక మహారాష్ట్ర వంటి పెద్ద రాష్ట్రంలో బీజేపీ రెండు పార్టీలను చీల్చి ఆ చీలిక వర్గాన్ని తెచ్చి కొత్త పార్టీలుగా నమోదు చేసుకుంటూ ఎన్డీయే భాగస్వామ్య పార్టీలు అంటోంది.
బీహార్ లో మాజీ సీఎం మాంజీ పార్టీ కూడా చిన్న పార్టీయే. లోక్ జనశక్తి పార్టీ కూడా మరో చిన్న పార్టీ. యూపీ లో ఆప్నాదళ్ కూడా చిన్న పార్టీయే. ఇలా ఒక్క ఎంపీ ఉన్న పార్టీలు అసలు లేని పార్టీలను కూడా కూడగట్టి ఎన్డీయే బలం అని బీజేపీ చెప్పుకుంటోంది అని అంటున్నారు. ఇక రెండు తెలుగు రాష్ట్రాల నుంచి చూస్తే ఒకే ఒక్క పార్టీగా జనసేనను ఎన్డీయే భేటీకి పిలిచారు. జనసేనకు టెక్నికల్ గా ఒక ఎమ్మెల్యే అసెంబ్లీలో ఉన్నా ప్రస్తుతం అతను కూడా లేడు అనే చెప్పాలి. రెండు చోట్ల పోటీ చేసినా ప్రెసిడెంట్ ఓడిపోయారు.
తెలుగు రాష్ట్రాల లో వైసీపీ టీడీపీ బీయారెస్ ఉన్నాయి. ఈ మూడు అధికారాన్ని అందుకున్నాయి. పెద్ద ప్రాంతీయ పార్టీలు. కానీ ఈ పార్టీల ను మాత్రం పిలవలేదు. ఇక శిరోమణీ అకాలీదళ్ పార్టీ వంటి ఒక మాదిరి పార్టీ తప్ప ఎన్డీయేలో పెద్ద పార్టీలు ఏవీ లేవు అనే అంటున్నారు.
అయితే బీజేపీకి కావాల్సిందే అది అని అంటున్నారు. పెద్ద పార్టీలు పలుకుబడి కలిగిన పార్టీలు వచ్చినా వాటితో పోరు పడలేమనో హ్యాండిల్ చేయలేమనో లేక తమ మాట వినవనో ఏదో కారణంతోనే చిన్న పార్టీలనే ముందు పెట్టుకుని బీజేపీ ఎన్డీయే కూటమి పేరిట వస్తోంది అని అంటున్నారు. చిత్రమెంటి అంటే ఇన్ని చిన్న పార్టీలతో ఉన్న ఎన్డీయేకు ఇవన్నీ కలసినా గట్టిగా ఒక యాభై ఎంపీ సీట్లు అయినా తెచ్చి ఎన్డీయే అధికారంలోకి రావడానికి ఉపకరిస్తాయా అన్నది చూడాలి.
ఎందుకంటే శివసేన చీలిక వర్గం, అజిత్ పవార్ వర్గానికి మహారాష్ట్రలో ఎంతటి ఆదరణ ఉందో ఎన్నికల వేళ కానీ తెలియదు. మరో వైపు చూస్తే శిరోమణీ అకాళీదళ్ గత ఏడాది జరిగిన పంజాబ్ ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయింది. మళ్ళీ కోలుకోవడానికి ఆస్కారం కనిపించడంలేదు. ఇక తమిళనాడు లో అన్నా డీఎంకే కూడా నాయకత్వ లేమితో సతమతం అవుతోంది. అక్కడ స్టార్ హీరో విజయ్ కొత్త పార్టీ పెడితే డీఎంకే యాంటీ ఓటింగ్ అంతా ఆ వైపే ట్రావెల్ అయినా అవుతుంది అని అంటున్నారు.
ఇక ఏపీలో చూస్తే జనసేన గ్రాఫ్ పెరిగింది అని ఎంత అనుకున్నా గెలుపు సాధించడానికి ఆ బలం ఎంతవరకూ సరిపోతుంది అన్నది ఆలోచించాలి. మొత్తానికి చూస్తే మోడీ అమిత్ షా నాయకత్వాన ఎన్డీయే కూటమి లో ఉన్న చిన్న పార్టీలు నామ్ కే వాస్తేగా ఉన్నాయా అన్న చర్చ మొదలవుతోంది.
గతంలో వాజ్ పేయ్ హయాం లో ఏర్పడిన ఎన్డీయేలో బలమైన పార్టీలు ఎన్నో వచ్చి చేరాయి. అప్పట్లో టీడీపీ, తృణమూల్ కాంగ్రెస్, జేడీయూ, అవిభక్త శివసేన వంటి పార్టీలు ఉండేవి. వాటికి సమానమైన హోదా గౌరవం కూడా వాజ్ పేయి ఇచ్చి ఆదరించారు.
ఇపుడు ఎన్డీయే సారధులు మాత్రం పెద్దన్నగా తాము ఉంటూ చిన్న పార్టీలను అదుపులో ఉంచుకుని రాజకీయం చేయలని చూస్తున్నారు అని విమర్శలు ఉన్నాయి. దాంతో ఎన్డీయే నిజంగా బలంగా ఉందా అన్నదే డౌట్ గా ముందుకు వస్తోంది.