Begin typing your search above and press return to search.

కేసీఆర్ ది 30 శాతం కమీషన్ సర్కార్.. బీజేపీ ప్రచార వ్యూహమిదే

సీఎం కేసీఆర్ కల్వకుంట్ల కుటుంబం దోపిడీకి పర్యాయపదంగా మారిందని.. ప్రతి పనిలో వాటాలు తీసుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు

By:  Tupaki Desk   |   16 Aug 2023 6:23 AM GMT
కేసీఆర్ ది 30 శాతం కమీషన్ సర్కార్.. బీజేపీ ప్రచార వ్యూహమిదే
X

గతేడాది కర్ణాటకలో పెద్ద కలకలం.. ఓ ప్రముఖ చెల్లింపుల యాప్ ను పోలిన పేరుతో "పే సీఎం" అంటూ ప్రచారం.. ఏ పనిలో అయినా ప్రభుత్వానికి 40 శాతం కమీషన్లు అంటూ ఆరోపణలు.. ఆ రాష్ట్రవ్యాప్తంగా విచ్చలవిడిగా పోస్టర్లు.. ఇదే సమయంలో బెంగళూరులో బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు భారీగా అవినీతికి పాల్పడుతూ దొరికిపోయాడు. ఇంకేం ఆ ప్రచారానికి బలం చేకూరింది. ఆరోపణలు ఇంకా త్రీవమై.. ప్రభుత్వ వైఫల్యాలు తోడై ఏకంగా బీజేపీ సర్కారు కూలిపోయింది. పే సీఎం ప్రచారంతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.

త్వరలో ఎన్నికలు జరుగనున్న మధ్యప్రదేశ్ లోనూ ప్రభుత్వానికి, అధికార పార్టీ నేతలకు 50 పర్సెంట్ కమీషన్లు కచ్చితంగా ఇవ్వాలంటూ ఆరోపణలు వస్తున్నాయి. దీనిని అక్కడి ప్రతిపక్ష కాంగ్రెస్ ఎన్నికల ముంగిట బాగా వాడుకుంటోంది. అసలే అనేక ఆరోపణలు, వివాదాస్పద ఘటనలతో మధ్యప్రదేశ్ బీజేపీ ప్రభుత్వం అప్రతిష్ఠ పాలైంది. అలాంటి సమయంలో అవినీతి ఆరోపణలు చేస్తూ కాంగ్రెస్ మరింతగా ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

పే సీఎం తరహా ఆరోపణలతో కర్ణాటకలో దెబ్బతిని, మధ్యప్రదేశ్ లోనూ బోల్తా కొట్టే సూచనలు కనిపిస్తున్న బీజేపీ.. తెలంగాణలో మాత్రం ముందే మేల్కొనట్లుంది. ప్రతిపక్షంలోనే ఉంది కాబట్టి అధికార బీఆర్ఎస్ పై ఆరోపణలు ఎక్కుపెట్టే అవకాశం చిక్కింది. ఈ క్రమంలోనే పొరుగు రాష్ట్రాల్లో తాము ఏ నినాదంతో అయితే నష్టపోయామో దానిని తెలంగాణలో వాడుకోవాలని చూస్తోంది.

కమీషన్లు "మామూలే"

బీజేపీ అనే కాదు.. ఏ పార్టీ ప్రభుత్వం వచ్చినా వివిధ పనుల్లో కమీషన్లు మామూలే. అయితే, అది కర్ణాటకలో మరింత శ్రుతిమించినట్లుంది. అందుకనే కాంట్రాక్టర్లే ఏకంగా బయటకు వచ్చి ఆరోపణలకు దిగారు. దీంతో ప్రభుత్వం బజారున పడినట్లైంది. కాగా, ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ సర్కారుపై బీజేపీ కమీషన్ అస్త్రాన్నే ప్రయోగించే యోచనలో ఉన్నట్లుంది. సీఎం కేసీఆర్ కల్వకుంట్ల కుటుంబం దోపిడీకి పర్యాయపదంగా మారిందని.. ప్రతి పనిలో వాటాలు తీసుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు. ఇలా ప్రతి పనికి 30 శాతం కమీషన్ పొందుతున్నారని.. తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ కుటుంబం చేతులోల బందీ అయిందని వ్యాఖ్యానించారు. ధరణి పోర్టల్ తెచ్చి రైతుల పొట్టగొడుతున్నారని పేర్కొన్నారు. అయితే, ఆయన ఆరోపణల ముఖ్య ఉద్దేశం బీఆర్ఎస్ సర్కారు 30 శాతం కమీషన్ల ప్రభుత్వం అని చాటడమేనని స్పష్టమవుతోంది.

కాళేశ్వరం ఇతర ప్రాజెక్టులను కూడానా?

తెలంగాణలో సీఎం కేసీఆర్ తొమ్మిదిన్నరేళ్లుగా ఏకఛత్రాధిపత్యంగా పాలిస్తున్నారు. ఈ వ్యవధిలో కాళేశ్వరం వంటి భారీ ప్రాజెక్టును నిర్మించారు. అయితే, దీనిపై ఎన్నో ఆరోపణలున్నాయి. ప్రాజెక్టు అంచనాలు భారీగా పెంచేశారని.. డిజైన్ లో లోపాలున్నాయని ఇలా పలు విధాలుగా ప్రతిపక్షాలు ఆరోపణలకు దిగుతున్నాయి. వీటికి ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ మంత్రులు దీటుగా సమాధానం ఇస్తున్నారు. ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో బీజేపీ.. కమీషన్ అస్త్రాన్ని గట్టిగానే పట్టుకునే అవకాశం ఉంది. చూద్దాం.. కర్ణాటకలో తమను దెబ్బకొట్టిన అస్త్రాన్ని పట్టుకుని ఆ పార్టీ ఎంత ముందుకెళ్తుందో?