Begin typing your search above and press return to search.

నమో అంటున్న బీజేపీ : ముచ్చటగా మూడవసారి ఆయనే...!

న్యూ ఢిల్లీలో తాజాగా శని ఆది వారాలలో రెండు రోజుల పాటు జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలలో ఈసారి ఆసక్తికరమైనవి పెద్దగా లేవు అనే చెప్పాలి.

By:  Tupaki Desk   |   19 Feb 2024 3:51 AM GMT
నమో అంటున్న బీజేపీ : ముచ్చటగా మూడవసారి ఆయనే...!
X

బీజేపీ అమ్ముల పొదిలో రెండు అస్త్రాలు ఉన్నాయి. ఒకటి జై శ్రీరాం, రెండవది నమో. ఈ రెండింటినీ మిక్స్ చేసి కొడితే హ్యాట్రిక్ విజయం వచ్చి తమ ఖాతాలో పడి తీరుతుంది అన్నది బీజేపీ వ్యూహకర్తల బలమైన నమ్మకం. అందుకే శ్రీరామమందిరంతో శుభారంభం పలికిన బీజేపీ ఇపుడు నమో అంటోంది. న్యూ ఢిల్లీలో తాజాగా శని ఆది వారాలలో రెండు రోజుల పాటు జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలలో ఈసారి ఆసక్తికరమైనవి పెద్దగా లేవు అనే చెప్పాలి.

ఎందుకంటే బీజేపీ మరోసారి ప్రధాని అభ్యర్ధిగా నరేంద్ర మోడీనే ఎంచుకుంది. ఈ మేరకు జాతీయ కార్యవర్గ సమావేశంలో ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే శంఖంలో పోస్తే తప్ప తీర్ధం కాదు అన్న చందాన బీజేపీ జాతీయ సమావేశాలలో తీర్మానించారు అని అంటున్నారు.

బీజేపీ 2013 ప్రాంతంలో నిర్వహించిన జాతీయ కార్యవర్గ సమావేశాలలో తొలిసారి నరేంద్ర మోడీ పేరుని ప్రతిపాదించింది. ఆనాడు బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్ నాధ్ సింగ్ మోడీ పేరుని ప్రతిపాదించారు. దానికి అద్వానీ అలిగి ఆగ్రహం వ్యక్తం చేయడం ఆ తరువాత ఎన్డీయే కూటమి నుంచి అప్పటి బీహార్ సీఎం జేడీయూ అధినేత నితీష్ కుమార్ తప్పుకోవడం ఇలా చాలా జరిగాయి.

ఇంకా చెప్పాలంటే అప్పటికి మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. జాతీయ రాజకీయాల వైపు ఆయన రాలేదు. ఎంపీగా కూడా పార్లమెంట్ లో అడుగుపెట్టలేదు. అలాంటిది మోడీని ప్రకటించడం ఏమిటని సీనియర్లు తలోరకంగా స్పందిస్తే బయట ఎన్డీయే మిత్రులు కూడా నొసలు చిట్లించారు.

కానీ నరేంద్ర మోడీ ప్రభంజనం 2014 ఎన్నికల్లో ఎలా వీచిందో అందరికీ తెలుసు. ఆ మీదట 2019లో జాతీయ కార్యవర్గ సమావేశాలు రెండవ మాట లేకుండా రెండవ మారు మోడీ పేరునే ప్రధాని పదవికి ప్రతిపాదించేశాయి. ఇక ముచ్చటగా మూడవసారి తాజాగా ఢిల్లీలో జరిగిన సమావేశాలలో మళ్లీ ఆయనే అని జాతీయ కార్యవర్గం బల్ల గుద్ది మరీ చెబుతోంది.

దీంతో బీజేపీలో ఉన్న ప్రధాని పదవికి ఆశావహులకు నో చాన్స్ అన్నట్లు అయింది, రాజ్ నాధ్ సింగ్, నితిన్ గడ్కరీ, అమిత్ షా వంటి వారు ప్రధాని పదవికి రేసులో ఉన్నారని అంటారు. అలాగే మరికొందరు సీనియర్ నేతల పేర్లు కూడా వినిపిస్తుంటాయి. అయితే మోడీ ఇమేజ్ చరిష్మా ఇవన్నీ బీజేపీని మళ్ళీ గట్టెక్కిస్తాయని భావించే ఆ పార్టీ ఏకగ్రీవంగా తీర్మానం చేసిందని అంటున్నారు

ఈసారి బీజేపీ సొంతంగా 370 సీట్లు, ఎన్డీయే 400 సీట్లు గెలుచుకోవాలని టార్గెట్ పెట్టుకున్నారు. ఈసారి బీజేపీ విజయం మీద అంచనాలు ఉన్నాయి. మూడవసారి మోడీ ప్రధాని అయితే అయిదేళ్ళూ కొనసాగితే మాత్రం ఆయన నెహ్రూ గాంధీ కుటుంబాల తరువాత వారితో దాదాపుగా సరిసమానంగా దేశాన్ని ఏలిన ఘనతను సొంతం చేసుకున్న వారు అవుతారు. ఆ రికార్డుని బద్ధలు కొట్టాలన్నదే బీజేపీ ఆకాంక్ష కూడా.