Begin typing your search above and press return to search.

రద్దు పద్దులో బీజేపీ జాతీయ నేతల తెలంగాణ టూర్

పరిస్థితులు చూస్తుంటే తెలంగాణలో బీజేపీ రనౌట్ అయినట్లే ఉంది

By:  Tupaki Desk   |   29 July 2023 9:12 AM GMT
రద్దు పద్దులో బీజేపీ జాతీయ నేతల తెలంగాణ టూర్
X

పరిస్థితులు చూస్తుంటే తెలంగాణలో బీజేపీ రనౌట్ అయినట్లే ఉంది. ఎప్పుడైతే మునుగోడు ఉప ఎన్నిక ముంగిట ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు ఆరోపణలు బయటకు వచ్చాయో అప్పటినుంచే ఆ పార్టీ డౌన్ ఫాల్ మొదలైంది. అసలు కాంగ్రెస్ నుంచి రాజగోపాల్ రెడ్డిని చేర్చుకోవడంలో జరిగిన కహానీయే తెలంగాణ బీజేపీని వెనక్కులాగింది. ఇక అప్పటినుంచి ముందంజ వేసింది లేదు.

బండి మార్పుతో ఇంజన్ ఫెయిల్

తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ ని తప్పించడం బీజేపీ అధిష్ఠానం చేసిన అతిపెద్ద తప్పు. బండి హయాంలో పార్టీ పుంజుకున్నదీ లేనిదీ పక్కనపెడితే ఎన్నికలకు నాలుగైదు నెలల ముంగిట రాష్ట్ర అధ్యక్షుడిని తప్పించడం సరికాదనేది రాజకీయ విశ్లేషకుల మాట. అందులోనూ కేసీఆర్ సర్కారుతో ఢీ అంటే ఢీ అంటూ ఢీకొడుతూ వస్తున్న బండి సంజయ్ ను.. ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీఎం కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవిత ప్రమేయం ఉందన్న ఆరోపణలు వస్తున్న సమయంలో మార్చడం బీఆర్ఎస్-బీజేపీ కుమ్మక్కయ్యాయన్న ఆరోపణలకు బలం చేకూర్చింది. కాగా, బండి స్థానంలో దూకుడుగా కాకుండా సావధానంగా ముందుకెళ్లే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని నియమించడంతోనే బీజేపీ హిట్ వికెట్ అని స్పష్టమైపోయింది.

కాలం కలిసిరాక టూర్ క్యాన్సిల్..

నాలుగైదు నెలల కిందటి వరకు తెలంగాణను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బీజేపీ జాతీయ నేతలు తరచూ పర్యటనలకు వచ్చేవారు. దీంతోపాటు పార్టీ రాష్ట్ర నాయకత్వం కూడా ఊపుమీద ఉండడంతో ఓ స్థాయిలో హల్ చల్ సాగింది. కానీ, మునుగోడు ఓటమి, పార్టీలో వర్గ విభేదాలు, ఫాం హౌస్ వ్యవహారం బయటపడ్డాక అంతా చల్లబడింది. ఇదే సమయంలో పైకి లేచే ప్రయత్నాలకు కాలం కూడా కలిసిరావడం లేదు. ఆ పార్టీ జాతీయ నేతలు తెలంగాణ టూర్ ఎప్పుడు పెట్టుకున్నా క్యాన్సిల్ తప్ప మరో మార్గం ఉండడం లేదు..

ఖమ్మంలో అలా.. వరంగల్ ఇలా..

బీజేపీని కాదని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి క్రిష్ణారావు కాంగ్రెస్ లో చేరడమే ఆ పార్టీకి పెద్ద దెబ్బ. దీనిని కవర్ చేసేందుకు బీజేపీ నేతలు ఖమ్మంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సభ ఏర్పాటు చేసినా రద్దయింది. ప్రధాని మోదీ వరంగల్ టూర్ కు ముందు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పు ఖాయమైంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పర్యటన సైతం ఒకసారి రద్దయింది. ఓసారి అమిత్ షా తెలంగాణ టూర్ పెట్టుకున్న సమయంలో మణిపూర్ ఉదంతం వెలుగులోకి వచ్చింది.

అయితే, అదే సమయంలో బిపోర్ జాయ్ తుఫాను గుజరాత్ ను కకావికలం చేస్తోందని అందుకే షా టూర్ రద్దయిందని చెప్పుకొచ్చారు. తాజాగా వరంగల్ పర్యటన పెట్టుకోగా ఊహించని వర్షాలు దెబ్బకొట్టాయి. ఇలా మోదీ మినహా మిగతా ఇద్దరు జాతీయ నేతల తెలంగాణ టూర్లు రద్దయి ఆ పార్టీ శ్రేణుల్లో నిరుత్సాహం నింపాయి.