Begin typing your search above and press return to search.

ఏపీలో బీజేపీ రెండు నాల్క‌ల ధోర‌ణి.. ఎందుకు ఓటేయాలి?

టీడీపీ, జ‌న‌సేన‌లు పాకులాడి మ‌రీ.. పొర్లు దండాలు పెట్టి మ‌రీ బీజేపీని క‌లుపుకొన్నారు.

By:  Tupaki Desk   |   7 May 2024 4:30 PM GMT
ఏపీలో బీజేపీ రెండు నాల్క‌ల ధోర‌ణి.. ఎందుకు ఓటేయాలి?
X

ఏపీ ప్ర‌జ‌ల‌ను మోసం చేసేందుకు.. గుండుగుత్త‌గా వారిని ముంచేసేందుకు.. బీజేపీ మ‌రోసారి న‌డుం బిగించిందా? అడ్డంగా ప్ర‌జ‌ల‌ను మోసం చేసేందుకు.. ప్ర‌య‌త్నిస్తోందా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. కూట‌మి పార్టీలతో పొత్తు నుంచి ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ప్ర‌చారం వ‌ర‌కు కూడా.. అన్ని రూపాల్లోనూ.. బీజేపీ ఏపీని మోసం చేస్తోంద‌న్న వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. అంశాల వారీగా తీసుకున్నా.. పొత్తును ప్ర‌స్తావించినా.. బీజేపీ చేస్తున్న దారుణ మోసం క‌ళ్ల‌కు క‌డుతోంది. దీనిని దాచేయాల‌ని ప్ర‌య‌త్నిస్తే దాగేది కాదు. ప్ర‌జ‌లు ఇప్పుడు ఈ దిశ‌గానే ఆలోచ‌న చేస్తున్నారు.

పొత్తుల విష‌యం:

టీడీపీ, జ‌న‌సేన‌లు పాకులాడి మ‌రీ.. పొర్లు దండాలు పెట్టి మ‌రీ బీజేపీని క‌లుపుకొన్నారు. ఇది వాస్త‌వం. చంద్ర‌బాబు నాలుగు రోజులు ఢిల్లీలో ఉండి.. అప్పాయింట్‌మెంట్ కోసం వేచి చూసి.. మ‌రీ పొత్తుకు రెడీ అయ్యారు. బీజేపీ వ‌ద్ద‌న్నా.. తిట్టినా.. తాను పొత్తుకు ప్ర‌య‌త్నించి.. సాధ్యం కాద‌న్న‌దానిని సాధ్యం చేశాన‌ని ప‌వ‌నే చెప్పారు. స‌రే పొత్తు పెట్టుకున్నారు. టీడీపీ ప్ర‌క‌టించిన స్థానాల్లోనూ త‌ర్వాత అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించారు. ఇదేం పొత్తు ధ‌ర్మ‌మో వారికే తెలియాలి. ఇక‌, వారికి బ‌లం లేద‌ని తెలిసి కూడా.. ఆరు పార్ల‌మెంటు స్థానాలు తీసుకున్నారు. దీనికి మొండిగా చంద్ర‌బాబు త‌లూపారు.

ఇంకోవైపు.. మైనారిటీ ముస్లిం రిజ‌ర్వేష‌న్ల‌ను ర‌ద్దు చేస్తామ‌ని.. బీజేపీ త‌న మేనిపెస్టోలోనే పెట్టింది. ఈ విష‌యంపైనా చంద్ర‌బాబు రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను తొండి చేస్తున్నారు. తాను రిజ‌ర్వేష‌న్ల‌ను కాపాడ‌తాన‌ని అంటున్నారు. కానీ, బీజేపీ మాత్రం రిజ‌ర్వేష‌న్లు ఇచ్చేది లేద‌ని చెబుతోంది. ఈ విష‌యంలో ప‌వ‌న్ ప్ర‌శ్నించ‌కుండా.. ఈయ‌న కూడా.. ముస్లిం మైనారిటీలు ఉన్న నియోజ‌వ‌ర్గాల‌కు కూడా వెళ్ల‌డం మానేశారు. వారి మాటే ఎత్త‌డం లేదు. ఎలా చూసుకున్నా.. పొత్తు, సీట్ల స‌ర్దుబాటు వంటివి బీజేపీ, టీడీపీ , జ‌న‌సేన ఉమ్మ‌డి గా ఏపీ ప్ర‌జ‌ల క‌ళ్ల‌కు గంత‌లు క‌ట్టాయి.

ఇక‌, ఉమ్మ‌డి మేనిఫెస్టో మ‌రో కీల‌క అంశం.

ఉమ్మ‌డి మేనిఫెస్టో విడుద‌ల చేసిన రోజు.. బీజేపీ వ్య‌వ‌హ‌రించిన తీరు మ‌రింత దుర్మార్గం. క‌లిసి ఉన్నామని అంటారు. ఉమ్మ‌డి మేనిపెస్టోను క‌నీసం ప‌ట్టుకునేందుకు కూడా అంగీక‌రించ‌రు. ఇదేం పొత్తు.. ఇదేం పొత్తు ధ‌ర్మం? పైగా.. మేనిఫెస్టోపై బీజేపీ ముద్ర లేకుండానే చేశారు. మ‌రి ఇంత ఘోరంగా అవ‌మానిస్తున్నా.. మీరే కావాలి.. అంటూ. చంద్ర‌బాబు వారి చంక‌నెక్క‌డం ఎందుకంటే.. కేవ‌లం అధికారం కోసం.. రేపు త‌న త‌న‌యుడిని ముఖ్య‌మంత్రిని చేసుకోవ‌డం కోసం.. పార్టీని కాపాడుకోవ‌డం కోసం.. అంటే కాద‌నే ధైర్యం ఆయ‌న‌కు ఉందా? ఇంత జ‌రుగుతున్నా.. ప‌వ‌న్ కూడా.. సిగ్గులేకుండా.. ఆ పార్టీకి మొగ్గు చూపుతున్నార‌న్న వైసీపీ నేత‌ల విమ‌ర్శ‌ల‌కు కౌంట‌ర్ ఇవ్వ‌కుండా.. కుటుంబాల‌ను రోడ్డుకు లాగి.. చీప్ పాలిట్రిక్స్ చేస్తున్నార‌నేది వాస్త‌వం.

పొత్తు పార్టీలు ఎక్క‌డైనా ఉమ్మ‌డి మేనిఫెస్టో విడుద‌ల చేసిన‌ప్పుడు.. ఆ పార్టీల‌న్నీ.. దానికి బ‌ద్ధులై ఉంటా యి. కానీ, ఏపీలో మాత్రం బీజేపీ ఈవిష‌యంలో ప‌క్కా మోసం చేస్తోంది. పొత్తు ఉంది.. కానీ.. మేనిఫెస్టో మాత్రం మాది కాదు. అది వారిద్ద‌రూ(టీడీపీ+జ‌న‌సేన‌) ఇచ్చుకున్నార‌న్న ప్ర‌చారం చేస్తే.. రేపు ఒక్క రూపాయి కూడా నిధులు ఇవ్వ‌క‌పోతే.. ఈ పొత్తు ఎన్నాళ్లు కొన‌సాగుతుంది? పొత్తు పేరు చెప్పి ఓట్లు దండుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్న టీడీపీ, జ‌న‌సేన‌లు ఏపీ ప్ర‌జ‌ల‌ను నిండా ముంచ‌డం కాదా?

పోల‌వ‌రం..

ఈ విష‌యంపై బీజేపీ నాలుగు నాల్క‌ల ధోర‌ణి ప్ర‌ద‌ర్శిస్తోంది. రెండేళ్ల‌లో దీనిని పూర్తిచేస్తామ‌ని.. బీజేపీ అగ్ర‌నేత‌.. అమిత్ షా చెబుతుంటే.. పోల‌వ‌రం ఎప్పుడు పూర్తి చేస్తామ‌నేది ప్ర‌ధాని మోడీ నోటి వెంట మ‌చ్చుకైనా రాలేదు. పైగా.. 2019 ఎన్నిక‌ల్లో దీనిలో అవినీతి జ‌రిగింద‌న్న ఆయ‌నే.. టీడీపీ అధినేత చంద్ర‌బాబు, ఆయ‌న కుమారుడు.. నారా లోకేష్‌కు ఇది ఏటీఎంగా మారిపోయింద‌ని గుండెలు బాదుకున్న మోడీనే.. ఇప్పుడు వైసీపీని అంటున్నారు.

ఈ మాటల్లో ఏమైనా చిత్త శుద్ధి ఉందా? అస‌లు విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం.. ఇది ఎవ‌రుపూర్తి చేయాల్సిన ప్రాజెక్టు..? కేంద్రం కాదా? ఇదేదో తాము ఉద్ధ‌రిస్తున్నామ‌ని.. రాష్ట్ర పార్టీలు నాశ‌నం చేస్తున్నాయ‌ని చెప్పి.. పూర్తిగా నిర్మాణం కాకుండా.. అడ్డుకున్న‌ది.. కుంటున్న‌ది ఎవ‌రు? మోడీ అండ్ బీజేపీ కాదా? పున‌రావాస ప్యాకేజీ(55 వేల కోట్లు) మాకు సంబంధం లేద‌ని పార్ల‌మెంటులో చెప్పింది.. నిర్మ‌లా సీతారామ‌న్ కాదా? ఆమెది ఏ పార్టీ? పోల‌వ‌రం పూర్తి చేస్తామ‌ని 2014కు ముందు చెప్పి.. త‌ర్వాత‌.. దీనిపై శీత‌క‌న్నేసింది.. ఏ పార్టీ. బీజేపీ కాదా? త‌ర్వాత‌.. అవినీతి జ‌రిగింద‌ని అంటున్న పెద్ద‌లు.. కేంద్ర నిధుల‌తో సంబంధంలేని.. ఢిల్లీ మ‌ద్యం కుంభ‌కోణంపై అహోరాత్రులు శ్ర‌మిస్తూ.. సీఎం వంటివారిని జైలుకు పంపించారే.. మ‌రి పోల‌వ‌రంలో నిజంగా అవినీతి జ‌రిగి ఉంటే.. మీరిచ్చిన నిధులు దుర్వినియోగం.. అవినీతి చేసి ఉంటే.. వాటిని ఎందుకు వెలికి తీయ‌లేదు? ఎందుకు ప్ర‌శ్నించ‌లేదు? ఎందుకు.. నిజానిజాలు చెప్ప‌డం లేదు? వీటికి స‌మాధానం లేక‌పోగా.. త‌గుదునమ్మా.. అంటూ.. ఇప్పుడు పోల‌వ‌రాన్ని మ‌రో రెండు సంవ‌త్స‌రాల్లో పూర్తిచేస్తామ‌ని చెప్ప‌డం.. మోసం కాదా?

ఇప్ప‌టి వ‌ర‌కు.. గ‌డిచిన ప‌దేళ్ల కాలంలో మీరే ఊడ‌బొడిచారంటే.. స‌మాధానం ఏది? అనుకున్న అయోధ్య అయిపోయింది.. అనుకున్న సముద్ర సొరంగం ప్రాజెక్టు అయిపోయింది.. అనుకోలేదు.. మ‌న కెందుకులే.. తెలుగు వారు మ‌న‌కు ఓటేయ‌రులే.. అని అనుకోబ‌ట్టే.. పోల‌వ‌రం ప్రాజెక్టు నిలిచిపోయింది. వాటితో పోల్చుకుంటే.. ఇది చాలా చిన్న‌ది కాదా? అనేది ప్ర‌శ్న‌. ఇవ‌న్నీ ఏమార్చి.. బీజేపీ మ‌రోసారి తెలుగు ప్ర‌జ‌ల పీక‌లు కోసేందుకు ఓటు బ్యాంకును రాబ‌ట్టుకునేందుకు చేస్తున్న చిల్ల‌ర రాజ‌కీయాన్ని ప్ర‌శ్నించ‌డం మానేసిన‌... చంద్ర‌బాబు, ప‌వ‌న్‌లు.. ఆ పార్టీకి వీర భ‌జ‌న చేస్తున్నారు. ఇదే వైసీపీ క‌నుక‌.. బీజేపీతో పొత్తు పెట్టుకుని ఉంటే.. అప్పుడు ఏకేసేవారు కాదా.. అప్పుడు విభ‌జ‌న హామీలు, పోల‌వ‌రం, ప్ర‌త్యేక హోదాపై.. ఊరూ వాడా ప్ర‌చారం చేసేవారు కాదా.. ఏది నీతి.. ఏది నేతి? అన్న‌ట్టు అధికారం కోసం.. దొడ్డిదారులు.. దొంగ దారులు తొక్కుతున్నారు.

ఎందుకు బీజేపీకి ఓటేయాలి?

ప్ర‌ధాని మోడీ.. బీజేపీ అగ్ర‌నేత‌.. అమిత్‌షాలు కూట‌మికి ఓటేయాల‌ని కోరుతున్నారు. కానీ, ఎందుకు వేయాలి? పోల‌వ‌రం క‌ట్టినందుకా? ప్ర‌త్యేక హోదా ఇచ్చినందుకా..? పోనీ.. పొత్తు ధ‌ర్మం పాటిస్తున్నందు కా? అస‌లు రేపు కూట‌మి అధికారంలోకి వ‌స్తే.. (జ‌నాలు చేసుకున్న పాపం మేర‌కు) ఈ మేనిఫెస్టో ఏమేర‌కు అమ‌ల‌వుతుంది? జ‌గ‌న్ ఇస్తే.. శ్రీలంక అవుతుంద‌న్న చంద్ర‌బాబు.. తాను ఇస్తే.. సింగ‌పూర్ అవుతుందా? మిడిమేళ‌పు మాట‌లు.. మోస‌పు మాట‌ల‌తో చంద్ర‌బాబు చేస్తున్న ద‌గుల్బాజీ రాజ‌కీయం ఇంకానా? ప్ర‌శ్నిస్తాన‌న్న‌.. ప‌వ‌న్‌.. రాష్ట్రం అప్పుల్లో ఉంద‌ని తెలిసి.. కూడా.. గొర్రె మాదిరిగా..త‌లూప‌డం వెనుక‌.. రీజ‌నేంటి? ప్యాకేజీ బాగా అందుతుంద‌నేనా? వీటికి స‌మాధానం చెప్ప‌డం మానేసి.. అమాయ‌క జ‌నాల‌ను.. ఏమార్చిఓటు కొల్ల‌గొట్టే ప్ర‌య‌త్నం చేస్తున్న‌వారికి ఎందుకు ఓటేయాలి? ప్ర‌స్తుతం యాగీ చేస్తున్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌..ను రేపు అమ‌లు చేయ‌కుండా ఉంటారా?(ఇది అమ‌లు చేస్తే త‌ప్ప‌.. వ‌చ్చే ఐదేళ్ల‌లో అప్పులు కూడా పుట్టే ప‌రిస్థితి లేకుండా.. కేంద్రం అన్ని వైపులా దారులు మూసేసిన విష‌యం చంద్ర‌బాబుకు తెలియ‌ద‌ని అనుకోవాలా) ఎలా చూసుకున్నా.. ఇప్పుడు చేస్తున్న‌ది జ‌రుగుతున్న‌ది కేవ‌లం అధికారం కోసం.. చేస్తున్న కూట‌మి కుయుక్తి.. స‌ర్క‌ర్‌!! తేల్చుకోవాల్సింది.. విజ్ఞులైన ప్ర‌జానీకం.. ప‌రిగెట్టి పాలు తాగుతామంటారో(కూట‌మి మేనిఫెస్టో).. నిల‌బ‌డి నీళ్ల యినా(వైసీపీ మేనిఫెస్టో).. చాల‌ని అనుకుంటారో.. తేల్చుకోవాలి. ఒక విజ్ఞ‌త‌.. ఐదేళ్లు శాసిస్తుంద‌నే విష‌యాన్ని గుర్తించాలి.