Begin typing your search above and press return to search.

సీఐ ఛాంబర్ లో బీజేపీ ఎమ్మెల్యే కాల్పులు.. ఎక్కడంటే?

తన కొడుకును వేధింపులకు గురి చేస్తున్నారంటూ బీజేపీ ఎమ్మెల్యే ఒకరు పోలీస్ స్టేషన్ లోని సీఐ ఛాంబర్ లో శివసేన నేత పై కాల్పులు జరిపిన ఉదంతం షాక్ కు గురి చేసింది.

By:  Tupaki Desk   |   4 Feb 2024 5:37 AM GMT
సీఐ ఛాంబర్ లో బీజేపీ ఎమ్మెల్యే కాల్పులు.. ఎక్కడంటే?
X

మహారాష్ట్రలోని ఒక పోలీస్ స్టేషన్ లో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. సినిమాల్లో మాత్రమే కనిపించే ఈ తరహా ఘటన ఇప్పుడు షాకింగ్ గా మారింది. తన కొడుకును వేధింపులకు గురి చేస్తున్నారంటూ బీజేపీ ఎమ్మెల్యే ఒకరు పోలీస్ స్టేషన్ లోని సీఐ ఛాంబర్ లో శివసేన నేత పై కాల్పులు జరిపిన ఉదంతం షాక్ కు గురి చేసింది. తాను చేసిన పనికి అస్సలు బాధ పడటం లేదని సదరు బీజేపీ ఎమ్మెల్యే ఓపెన్ గా చెబుతున్నారు. రాజకీయ సంచలనంగా మారిన ఈ ఉదంతంలోకి వెళితే..

శుక్రవారం అర్థరాత్రి వేళ చోటు చేసుకున్న ఈ ఉదంతం కాస్త ఆలస్యంగా వెలుగు చూసింది. థానే జిల్లా ఉల్హాస్ నగర్ హిల్ లైన్ పోలీస్ స్టేషన్ లో ఈ అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. శివసేన నేత మహేశ్ గైక్వాడ్ పై బీజేపీ ఎమ్మెల్యే గణ్ పత్ గైక్వాడ్ కాల్పుల వర్షం కురిపించారు. బుల్లెట్ల గాయాలతో రక్తమోడుతున్న సదరు శివసేన నేత పరిస్థితి సీరియస్ గా ఉందని.. ఆయన ప్రాణాలకు ముప్పు ఉందని చెబుతున్నారు. పదేళ్ల క్రితం ఎమ్మెల్యే కొన్న భూమిని శివసేన నేత మహేశ్ కబ్జా చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. దీనిపై కంప్లైంట్ చేసేందుకు తన కొడుకుతో కలిసి పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు బీజేపీ ఎమ్మెల్యే.

అక్కడ తన కొడుకును తన కళ్ల ఎదుటే మహేశ్ మనుషులు దారుణంగా ప్రవర్తించారని.. కొడుతున్నారని.. దాన్ని చూసి తట్టుకోలేక తాను గొడవ పడినట్లు ఎమ్మెల్యే చెబుతున్నాడు. కాల్పులు జరిపినందుకు తాను బాధ పడటం లేదని ఎమ్మెల్యే పేర్కొన్నారు. "పోలీస్ స్టేషన్ లో నా ముందే నా కొడుకును అన్యాయంగా చితకబాదుతుంటే చూస్తూ ఊరుకోవాలా?" అంటూ ప్రశ్నిస్తున్నారు.

తాను ఐదు రౌండ్లు కాల్పులు జరిపానని.. శివసేనను చీల్చి బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఏక్ నాథ్ షిండే మహారాష్ట్రలో నేర సామ్రాజ్యాన్ని క్రియేట్ చేశారంటూ సదరు బీజేపీ ఎమ్మెల్యే మండిపడ్డారు. శివసేన నేతతో పాటు.. రాహుల్ పాటిల్ అనే వ్యక్తికి గాయాలయ్యాయి. బీజేపీ ఎమ్మెల్యేతో పాటు మరొకరిని అరెస్టు చేశారు. పోలీస్ స్టేషన్ లోనే కాల్పులు జరిపిన ఎమ్మెల్యే వీడియో వైరల్ గా మారింది. ఈ మొత్తం వివాదంపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశిస్తున్నట్లుగా ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వెల్లడించారు. బీజేపీ ఎమ్మెల్యేది తప్పు ఉంటే ఆయనపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకోకూడదని వ్యాఖ్యానించారు.