Begin typing your search above and press return to search.

బాబు అరెస్టు ఓ సాహసం... బీజేపీఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు!

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్ కావడం రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టించిందనే చెప్పాలి.

By:  Tupaki Desk   |   10 Sep 2023 8:36 AM GMT
బాబు అరెస్టు ఓ సాహసం... బీజేపీఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు!
X

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్ కావడం రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టించిందనే చెప్పాలి. స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ లో వందల కోట్ల రూపాయల మేర ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని ఏపీ సీఐడీ అభియోగాలు మోపింది. నేపథ్యంలోనే చంద్రబాబును శనివారం ఉదయం పోలీసులు అరెస్ట్ చేశారు.

అయితే ఇక్కడ అవినీతి జరిగిందా లేదా అనే విషయాన్ని పక్కకు పెట్టిన కొంతమంది నేతలు... ఏపీ ప్రభుత్వంపై అవాకులూ చెవాకులూ పేలుతున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో ఈ ఘటనపై టీడీపీ నేతలకంటే ఎక్కువగా జనసేన, బీజేపీ నేతలే రియాక్ట్ అవుతున్నారు అనే మాటలూ వినబడుతున్నాయి.

ఈ క్రమంలో ఇప్పటికే పురందేశ్వరి.. చంద్రబాబు అరెస్ట్ పై బీజేపీ ఖండిస్తుందని చెప్పగా... సంపూర్ణంగా ఖండిస్తున్నట్లు జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. ఈ సమయంలో తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే ర‌ఘునంద‌న్ తాజాగా ఈ విషయంపై స్పందించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు పురందేశ్వరికి షాక్ ఇచ్చేలా ఉన్నాయ‌నే అభిప్రాయం వ్యక్తమ‌వుతోంది.

ఇందులో భాగంగా భారత్ ఓ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని, గతంలో ఎంతోమంది అరెస్ట్ అయ్యారని గుర్తు చేసిన రఘునందన రావు... అనేకమంది ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రుల కుటుంబ సభ్యులు అరెస్టులు అయ్యారని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ లో ఏం జ‌రిగిందో తనకింకా పూర్తిగా తెలియక పోయినా... ఇది మాత్రం ఏపీ ప్రభుత్వ సాహసంగా ఆయన అభివర్ణించారు.

అవును... మరో రెండు మూడు నెలల్లో ఎన్నిక‌ల‌కు సంబంధించి నోటిఫికేష‌న్ రానున్న నేపథ్యంలో ప్రతిప‌క్ష నాయ‌కుడిని అరెస్ట్ చేసే సాహ‌సం పాల‌క ప‌క్షం చేసిందంటే... సాక్ష్యాలు, ఆధారాలు వుంటేనే చేస్తారని అన్నారు. అలాకాకుండా... ఎన్నిక‌ల ముందు ఆ రాష్ట్ర ప్రతిప‌క్ష నాయకుడిని అరెస్ట్ చేసి, వారికి సానుభూతి వ‌చ్చేలా అరెస్ట్ చేస్తార‌ని తాను భావించడం లేదని అన్నారు.

దీంతో ఇవి పురందేశ్వరికి షాకిచ్చే వ్యాఖ్యలే అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో అవినీతికి సంబంధించి ఆధారాలు, సాక్ష్యాలు ప‌క‌డ్బందీగా పెట్టుకోని పక్షంలో ఇంత సాహసం చేయరనే అభిప్రాయాన్ని క‌లిగించేలా ర‌ఘునంద‌న్ కామెంట్స్ వున్నాయని అంటున్నారు.

దీంతో... ఇవి అదేపార్టీకి చెందిన రాష్ట్ర అధ్యక్షురాలి వ్యాఖ్యలకు పూర్తి భిన్నంగా ఉన్నాయని అంటున్నారు పరిశీలకులు. ఫలితంగా తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రఘునందనరావు వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశం అవుతున్నాయి!