Begin typing your search above and press return to search.

తెలంగాణలో బీజేపీకి అంత సీనుందా ?

పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో దక్షిణాది నుండి అత్యధిక స్థానాలు గెలుచుకోవాలని బీజేపీ అధిష్టానం భావిస్తున్నది

By:  Tupaki Desk   |   20 April 2024 5:30 PM GMT
తెలంగాణలో బీజేపీకి అంత సీనుందా ?
X

పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో దక్షిణాది నుండి అత్యధిక స్థానాలు గెలుచుకోవాలని బీజేపీ అధిష్టానం భావిస్తున్నది. ముఖ్యంగా కర్ణాటక, తెలంగాణ మీద ఎక్కువ ఆశలు పెట్టుకున్నది. తెలంగాణలో మొత్తం 17 లోక్ సభ స్థానాలు ఉన్నాయి. అందులో 12 స్థానాలలో గెలుపు సాధిస్తామని బీజేపీ నేతలు చెబుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితులు కనిపించడం లేదు.

గతంలో ముషీరాబాద్ ఎమ్మెల్యేగా ఓడిపోయి ఓబీసీ కోటాలో రాజ్యసభ సభ్యత్వం దక్కించుకున్న లక్ష్మణ్ మాట్లాడుతూ ‘‘సొంత ఎమ్మెల్యేల మీద నమ్మకం లేని రేవంత్ రెడ్డికి అంత అభద్రతా భావం ఎందుకని, వంద రోజుల పాలన రెఫరెండంగా భావించి 14 లోక్ సభ స్థానాలు గెలుస్తామన్న రేవంత్ ఇప్పుడు ఎందుకు మొసలి కన్నీరు కారుస్తున్నారని’’ ప్రశ్నించారు. కేసీఆర్ బస్సు యాత్ర చేసినా, మోకాళ్ల యాత్ర చేసినా తెలంగాణ ప్రజలు అసలు నమ్మరని విమర్శించారు. లోక్ సభ ఎన్నికలలో కాంగ్రెస్, బీఆర్ఎస్ చీకటి ఒప్పందంతో పనిచేస్తున్నాయని విమర్శించారు.

ఇది ఇలా ఉంటే తెలంగాణలో గత శాసనసభ ఎన్నికలలో బీజేపీ 8 స్థానాలలో మాత్రమే విజయం సాధించింది. మిగిలిన స్థానాలలో కనీసం లోకల్ క్యాడర్ కూడా బీజేపీకి అందుబాటులో లేదు. హైదరాబాద్ వంటి కీలకస్థానంలో ఉన్న ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా ఇప్పటి వరకు పార్టీ అభ్యర్థి మాధవీలతకు సహకరించడం లేదని పార్టీ అధిష్టానం గుర్రుగా ఉంది. ఇక హైదరాబాద్ స్థానంలో నిలపడానికి బీజేపీ మొగోడు దొరకలేదా ? అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఈ నేపథ్యంలో ఇక్కడి నుండి 12 స్థానాలు గెలుస్తామని బీజేపీ ఆశించడం పార్టీ వర్గాలలో చర్చకు తెరలేపింది. గతంలో గెలిచిన నాలుగు స్థానాలు గెలవడమే కష్టమని, ఇప్పటికే బండి సంజయ్, ధర్మపురి అరవింద్ శాసనసభ ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయారని, ఇప్పటికైనా పార్టీ వాస్తవ పరిస్థితులు గుర్తెరిగి గతంలో ఉన్న స్థానాలను గెలుచుకునేలా వ్యూహారచన చేయాలని పార్టీ వర్గాలు కోరుతున్నాయి.