Begin typing your search above and press return to search.

పార్టీ మార్పు వార్తలపై స్పందించిన బీజేపీ కీలక నేత!

తాను రాష్ట్రం వెలుపల ఉన్నప్పుడే తనపై పార్టీ మారుతున్నానంటూ వార్తలు ప్రచారం చేస్తున్నారని వివేక్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

By:  Tupaki Desk   |   30 Aug 2023 3:54 PM IST
పార్టీ మార్పు వార్తలపై స్పందించిన బీజేపీ కీలక నేత!
X

తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్‌ పార్టీ ఉరకలేస్తోంది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్‌ నేతలంతా సమరోత్సాహంతో ముందుకు కదులుతున్నారు. మరోవైపు పెద్ద ఎత్తున బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీల నుంచి కాంగ్రెస్‌ లోకి వలసలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు కూడా కాంగ్రెస్ లో చేరతారని వార్తలు వచ్చాయి.

ఈ క్రమంలో బీజేపీ నుంచి వికారాబాద్‌ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి చంద్రశేఖర్‌ ఇప్పటికే కాంగ్రెస్‌ లో చేరిపోయారు. అలాగే మాజీ ఎంపీ, వీ6, వెలుగు మీడియా సంస్థల అధినేత వివేక్‌ కూడా కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకుంటారని కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. గతంలో పెద్దపల్లి లోక్‌ సభా స్థానం ఎంపీగా గెలుపొందిన వివేక్‌ ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. కాంగ్రెస్‌ నుంచి బీఆర్‌ఎస్‌ లో చేరిన ఆయన అక్కడ ఇమడలేక బీజేపీలోకి వెళ్లిపోయారు. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్‌ లోకి వస్తారని టాక్‌ నడుస్తోంది.

ఈ నేపథ్యంలో వివేక్‌ స్పందించారు. తాను పార్టీ మారడం లేదని స్పష్టం చేశారు. సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని తెలిపారు.

ఈ మేరకు మంగళవారం వివేక్‌ ఓ ప్రకటన జారీ చేశారు. తాను కాంగ్రెస్‌ లో చేరుతానంటూ కొన్ని వార్త పత్రికలు, సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందని వివేక్‌ మండిపడ్డారు. అదంతా అబద్ధమేనని చెప్పారు. తాను కాంగ్రెస్‌ నేతలతో సంప్రదింపులు జరపడం లేదని వెల్లడించారు.

తాను రాష్ట్రం వెలుపల ఉన్నప్పుడే తనపై పార్టీ మారుతున్నానంటూ వార్తలు ప్రచారం చేస్తున్నారని వివేక్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను గతంలో అమెరికాలో ఉన్నప్పుడు కూడా ఇలా ప్రచారం చేశారని గుర్తు చేశారు. తాను గత రెండు రోజులుగా పూణేలో ఉన్నట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలను ఆయన ఖండించారు.

ప్రస్తుతం బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఉన్న వివేక్‌ పార్టీ మారడం లేదని బీజేపీ నేతలు కూడా చెబుతున్నారు. అలాగే ఆయన సోదరుడు, మాజీ మంత్రి వినోద్‌ ప్రస్తుతం కాంగ్రెస్‌ లో ఉన్నారని.. ఆయన కూడా బీజేపీలోకి వచ్చే వీలుందని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కావాలనే సోదరులిద్దరిపై ఉద్దేశపూర్వకంగా పార్టీ మారుతున్నారంటూ దుష్ప్రచారం చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.

2009లో పెద్దపల్లి ఎంపీగా కాంగ్రెస్‌ తరఫున గెలుపొందిన వివేక్‌ 2014లో కాంగ్రెస్‌ తరఫునే పోటీ చేసి ఓటమి పాలయ్యారు. వచ్చే ఎన్నికల్లో పెద్దపల్లి నుంచి బీజేపీ తరఫున వివేక్‌ పోటీ చేసే చాన్సు ఉంది.