Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ లక్ష్యంగా తెలంగాణలో బీజేపీ-జనసేన పొత్తు.. బీఆర్ఎస్ కు మేలు

అభిమానమే తప్ప అసలు బలమే లేని జనసేనతో పొత్తుకు వెంపర్లాడింది తెలంగాణ బీజేపీ

By:  Tupaki Desk   |   6 Nov 2023 7:00 AM IST
కాంగ్రెస్ లక్ష్యంగా తెలంగాణలో బీజేపీ-జనసేన పొత్తు.. బీఆర్ఎస్ కు మేలు
X

అభిమానమే తప్ప అసలు బలమే లేని జనసేనతో పొత్తుకు వెంపర్లాడింది తెలంగాణ బీజేపీ.. మేం పోటీ చేయం బాబూ అంటున్న ఆ పార్టీని ఒప్పించి మరీ ఎన్నికల బరిలోకి దింపింది. ఏపీ రాజకీయాలతో బిజీగా ఉన్న జనసేన అధినేతను మొహమాట పెట్టి మరీ ఎన్నికల గోదాలోకి దించింది. ప్రధాని మోదీపై ఉన్న సదభిప్రాయమో? ఎన్డీఏలో ఉన్నామన్న మొహమాటమో కానీ.. ఆయన తెలంగాణలో జనసేన పోటీకి పచ్చజెండా ఊపారు. కానీ, లోతుగా ఆలోచిస్తే ఇందులో బీజేపీ పన్నిన వ్యూహం ఏమైనా ఉందా? అనిపిస్తోంది.

ఎందుకంత పట్టుదల?

తెలంగాణలో ఇప్పటివరకు ఎన్నికల్లో పోటీ చేయని జనసేనను.. ఈ ఎన్నికల్లో ముగ్గులోకి దించింది బీజేపీ. వాస్తవానికి ఏపీలో కీలకంగా ఉన్న జనసేన.. టీడీపీతో కలిసి వెళ్లే ఉద్దేశంలో బీజేపీనీ మోస్తోంది. అయితే, ఏపీలో బీజేపీకి కనీస మాత్రమైనా బలంలేదు. తెలంగాణలో జనసేన పరిస్థితి కూడా ఇదే. కానీ, ఆ పార్టీని, దాని అధినేత పవన్ కల్యాణ్ ను పట్టుబట్టి మరీ తెలంగాణలో పోటీ చేయిస్తోంది బీజేపీ అనే విమర్శలు వస్తున్నాయి. అయితే, పొత్తులో భాగంగా బీజేపీ తెలంగాణలో జనసేనకు 9 సీట్లు ఇచ్చింది. ఇందులో చూస్తే ఎక్కువ శాతం కాంగ్రెస్ కు పట్టున్న లేదా విజయావకాశాలు ఉన్న నియోజకవర్గాలే ఎక్కువగా ఉండడం గమనార్హం.

ఈ పోటీ ఎవరికి మేలు?

కూకట్ పల్లి, కోదాడ, ఖమ్మం, కొత్తగూడెం, వైరా, అశ్వారావుపేట, నాగర్ కర్నూల్.. ఇవీ జనసేన పోటీ చేయనున్న కొన్ని నియోజకవర్గాలు. ఇవన్నీ కాంగ్రెస్ కు బలం ఉన్నవే. ఉదాహరణకు కోదాడ పూర్తిగా ఆంధ్రా సరిహద్దులో ఉంటుంది. అక్కడినుంచి టీపీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య పద్మావతి పోటీ చేస్తున్నారు. అలాంటిచోట జనసేన పోటీకి దిగి పవన్ కల్యాణ్ ప్రచారానికి వెళ్తే కొన్ని ఓట్లయినా చీలడం ఖాయం. ఇక ఉమ్మడి ఖమ్మంలో పవన్ కల్యాణ్ కు విపరీతంగా అభిమానులున్నారు. అలాంటి జిల్లాలో ఖమ్మం, కొత్తగూడెం, వైరా తదితర నియోజకవర్గాల్లో జనసేన పోటీ కచ్చితంగా కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపుపై ప్రభావం చూపేదే. గ్రేటర్ హైదరాబాద్ లోని మల్కాజ్ గిరి వంటి చోట్ల జనసేనకు ఓట్లు చెప్పుకోదగ్గ స్థాయిలో పోలవుతాయని చెప్పొచ్చు.

ఓట్లు చీలి బీఆర్ఎస్ కు మేలు..

పొత్తు పెట్టుకుని జనసేనను బరిలో దింపుతున్న బీజేపీ.. తెలంగాణలో పరోక్షంగా బీఆర్ఎస్ కు మేలు చేస్తోందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే బీజేపీ-బీఆర్ఎస్ మధ్య లోపాయికారీ ఉందనే ప్రచారం జరుగుతోంది. దీనికి మరింత బలం చేకూర్చేలా జనసేనను బీజేపీ పావులా వాడుకుంటోందనే భావన వస్తోంది. అయితే, దీనిని జనసేన నాయకత్వం గమనించలేకపోయిందా? బీజేపీ పన్నిన వలలో చిక్కుకుందా? అనిపిస్తోంది. ముందుముందు ఏం జరుగుతుందో చూద్దాం..