Begin typing your search above and press return to search.

ఈటల చెప్పినట్లే.. రెండు చోట్ల నుంచి పోటీకి బీజేపీ ఓకే!

ఈ రోజు బీజేపీ తొలి జాబితా విడుదల కానున్న నేపథ్యంలో.. ఈటలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని.. మొదటి జాబితాలోనే ఆయన పోటీ చేసే రెండు నియోజకవర్గాల్ని పేర్కొంటారని చెబుతున్నారు.

By:  Tupaki Desk   |   21 Oct 2023 5:09 AM GMT
ఈటల చెప్పినట్లే.. రెండు చోట్ల నుంచి పోటీకి బీజేపీ ఓకే!
X

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడి నుంచి పోటీ చేసినా.. తాను ఆయనపై పోటీ చేస్తానని చెబుతూ వచ్చిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ అనుకున్నట్లే.. సీఎంపై పోటీ చేయనున్నారు. ఈటల మాటలకు బీజేపీ అధినాయకత్వం కూడా ఓకే చెప్పటమే కాదు.. ఆయన కోరుకున్నట్లే టికెట్ కేటాయించినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు బీజేపీ తొలి జాబితా విడుదల కానున్న నేపథ్యంలో.. ఈటలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని.. మొదటి జాబితాలోనే ఆయన పోటీ చేసే రెండు నియోజకవర్గాల్ని పేర్కొంటారని చెబుతున్నారు.

ఇంతకాలం ఈటల చెబుతున్న మాటలపై.. బీజేపీకి చెందిన మరే నేతా స్పందించింది లేదు. అయితే.. తాజాగా విడుదలయ్యే జాబితాలో మాత్రం ఈటల పోటీ చేసే రెండు స్థానాల్ని ఖరారు చేయనున్నారు. మొత్తం 55 మందితో కూడిన తొలి జాబితా విడుదల అవుతుందని.. దీనికి ఇప్పటికే ఆమోద ముద్ర పడినట్లుగా చెబుతున్నారు. ప్రధాని మోడీ అధ్యక్షతన ఢిల్లీలోని పార్టీ జాతీయ కార్యాలయంలో శుక్రవారం రాత్రి కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశమైంది.

ఈ సమావేశానికి హోం మంత్రి అమిత్ షా.. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ తో పాటు.. కమిటీ సభ్యులుగా ఉన్న కిషన్ రెడ్డి.. డాక్టర్ లక్ష్మణ్ (ఓబీసీ మోర్చాజాతీయ అధ్యక్షుడు).. పార్టీ రాష్ట్ర ఇంఛార్జులు తరుణ్ ఛుగ్.. సునీల్ బన్సల్.. ఈటల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. తొలి జాబితాకు కేంద్ర ఎన్నికల కమిటీ ఓకే చెప్పినట్లుగా చెబుతున్నారు.

ఈటల మొదట్నించి చెబుతున్నట్లే గజ్వేల్ నుంచి పోటీ చేయనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పైన ఆయన పోటీ పడనున్నారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంతో పాటు గజ్వేల్ నుంచి కూడా ఈటల పోటీ చేయనున్నారు. ఇక.. ఎంపీలుగా వ్యవహరిస్తున్న బండి సంజయ్.. సోయం బాపూరావు.. ధర్మపురి అర్వింద్ లను కూడా పోటీలోకి దింపుతున్నారు.

బండి సంజయ్ కరీంనగర్ అసెంబ్లీ నుంచి.. సోయం బాపురావును బోథ్ నుంచి ధర్మపురి అర్వింద్ ను కోరుట్లు (కరీంనగర్ జిల్లా) నుంచి పోటీకి నిలుపుతారని చెబుతున్నారు. కేంద్ర మంత్రిగా వ్యవహరిస్తున్న కిషన్ రెడ్డి.. రాజ్యసభ సభ్యులుగా వ్యవహరిస్తున్న లక్ష్మణ్ లను మాత్రం పోటీ నుంచి మినహాయించినట్లుగా చెబుతున్నారు. పార్టీ ఎన్నికల ప్రచారంలో వారు బిజీగా ఉన్న వేళ.. వారు పోటీ చేస్తే ఇబ్బంది అవుతుందన్న ఆలోచనతో వారిని పోటీ చేయొద్దని చెప్పినట్లుగా చెబుతున్నారు. మాజీ ఎంపీ వివేక్ చెన్నూరు నుంచి.. డీకే అరుణ గద్వాల నుంచి పోటీ చేయనున్నట్లు చెబుతున్నారు. ఎమ్మెల్యే రఘనందన్ రావు మరోసారి దుబ్బాక నుంచి బరిలోకి దిగనున్నారు. రాజాసింగ్ మీద విధించిన సస్పెన్షన్ ఎత్తివేతపై చర్చ జరిగినా.. ఎలాంటి నిర్ణయం తీసుకున్నారన్న దానిపై స్పష్టత రావట్లేదు.