Begin typing your search above and press return to search.

ఆదిలాబాద్ లో బీజేపీ సత్తా చాటడానికి కారణాలేంటి?

తెలంగాణలో ఇటీవల విడుదలైన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చాయి. రాష్ర్టమంతా కాంగ్రెస్ గాలి వీస్తోంటే ఆదిలాబాద్ లో మాత్రం పరిస్థితి భిన్నంగా కనిపించింది.

By:  Tupaki Desk   |   8 Dec 2023 11:30 AM GMT
ఆదిలాబాద్ లో బీజేపీ సత్తా చాటడానికి కారణాలేంటి?
X

తెలంగాణలో ఇటీవల విడుదలైన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చాయి. రాష్ర్టమంతా కాంగ్రెస్ గాలి వీస్తోంటే ఆదిలాబాద్ లో మాత్రం పరిస్థితి భిన్నంగా కనిపించింది. బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు కొనసాగింది. రెండు పార్టీల మధ్యే రసవత్తర పోరాటం సాగింది. ఆదిలాబాద్ లో ఏకంగా బీజేపీ నాలుగు చోట్ల విజయం సాధించడం గమనార్హం. బీజేపీ పని అయిపోయిందనుకున్న వారికి సరికొత్త సవాలు విసిరింది.

ఆదిలాబాద్ లో పాయల్ శంకర్, నిర్మల్ లో ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ముథోల్ లో రామారావు పటేల్ సత్తా చాటారు. సిర్పూర్ లో పాల్వాయి హరీష్ బాబు విజయం సాధించారు. దీంతో ఆదిలాబాద్ లో మోడీ చరిష్మా పనిచేసిందని అంటున్నారు. మరోవైపు భైంసాలో జరిగిన సంఘటనలు వారిలో ఐక్యతను పెంచుతున్నాయని సర్వేలు వెల్లడిస్తున్నాయి. వారి ఉన్మాదమే వీరికి బలం పెంచేందుకు కారణమవుతుందని పలువురు పేర్కొంటున్నారు.

గతంలో జరిగిన ఉపఎన్నికలు, హైదరాబాద్ కార్పొరేరష్ ఎన్నికలు బీజేపీకి అనుకూలంగా వచ్చాయి. అప్పుడు పుట్టిన ఉత్తేజం అలాగే కొనసాగింది. దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో కూడా బీజేపీ తన సత్తా చాటింది. ఒక దశలో బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీ అనే వాదన కూడా వచ్చింది. కానీ పార్టీ మంచి ఊపులో ఉన్న సందర్భంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను తప్పించడంతో పార్టీ ప్రభావం ఒక్కసారిగా తగ్గిపోయింది.

కాంగ్రెస్ కూడా బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం ఒకటే అని చేసిన విమర్శలు బాగా ప్రజల్లోకి వెళ్లాయి. దీంతో బీజేపీకి రావాల్సిన అధికారం కాంగ్రెస్ చేజిక్కించుకుంది. కాంగ్రెస్ చేసిన ఆరోపణలను ప్రజలు నమ్మినందునే దానికి ఓటు వేసి అధికారం కట్టబెట్టినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈనేపథ్యంలో బీజేపీ ఊపును తగ్గించడంలో కాంగ్రెస్ సఫలం కావడం గమనార్హం.

ప్రస్తుతం దేశంలో బీజేపీ గాలి బలంగానే వీస్తోంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ గడ్ రాష్ర్టాల్లో బీజేపీ విజయ దుందుబి మోగించింది. మోడీ చరిష్మా ఇంకా తగ్గలేదని నిరూపించింది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఇది బీజేపీకి ప్లస్ కానుంది. ఇలా రాష్ట్రంలో భిన్నమైన ఫలితాలు వచ్చినా ఆదిలాబాద్ లో మాత్రం నాలుగు స్థానాలు గెలుచుకుని బీఆర్ఎస్, కాంగ్రెస్ లకు తక్కువ కాదని నిరూపించింది.