Begin typing your search above and press return to search.

నెహ్రూ ఇందిరాగాంధీ మాటలు ఇపుడెందుకు బీజేపీ...!?

ఎందుకంటే వారి పాలించిన కాలంలో పుట్టని వారు ఈ రోజు ఉన్నారు. వారే ఓటర్లుగా ఉంటున్నారు. వారే రేపటి పాలకులను నిర్ణయిస్తారు

By:  Tupaki Desk   |   3 April 2024 11:30 PM GMT
నెహ్రూ ఇందిరాగాంధీ మాటలు ఇపుడెందుకు బీజేపీ...!?
X

ఎక్కడి నెహ్రూ ఎక్కడి ఇందిరాగాంధీ వారి పేరు చెప్పుకుని కాంగ్రెస్ పార్టీయే రాజకీయం చేయడం లేదు అలాంటిది దశాబ్దాల వెనక జరిగిన వాటిని ఇపుడు చెబుతూ బీజేపీ నెహ్రూ గాంధీ వంశీకుల మీద నిప్పులు చెరగడం పట్ల విమర్శలు వస్తున్నాయి.

నెహ్రూ మరణించి అక్షరాల ఆరు దశాబ్దాలు దాటింది. ఇందిరాగాంధీ మరణించి నాలుగు దశాబ్దాలు దాటింది. రాజీవ్ గాంధీ చనిపోయిన మూడున్నర దశాబ్దాలు దాటింది. వారి మీద వారి పాలన మీద ఇపుడు విమర్శలు చేయడం తగునా అన్నది మేధావుల నుంచి సగటు జనాల నుంచి వస్తున్న ప్రశ్న.

ఎందుకంటే వారి పాలించిన కాలంలో పుట్టని వారు ఈ రోజు ఉన్నారు. వారే ఓటర్లుగా ఉంటున్నారు. వారే రేపటి పాలకులను నిర్ణయిస్తారు. ఇక చరిత్ర పుస్తకాలు తిరగేసేందుకు బోర్ కొట్టే యువతరం నేడు ఉంది. సరే చరిత్రలో మంచి ఉంది చెడ్డ ఉంది. పొరపాట్లు జరగకుండా ఎక్కడా ఉండదు, కానీ ఆనాటి తప్పులనే పదే పదే చెబుతూ పబ్బం గడుపుకోవడం బీజేపీకి తగునా అని అంటున్నారు నెటిజన్లు. వారు సోషల్ మీడియాలో బీజేపీ ని ఈ విధంగా ఏకేస్తున్నారు.

దానికి కారణం బీజేపీ ఎంతసేపూ నెహ్రూ ఆ తప్పులు చేశారు ఇందిరాగాంధీ ఈ తప్పులు చేశారు అని ఎత్తి చూపుతుండడం. తాజగా కేంద్ర విదేశాంగ మంత్రి జై శంకర్ గుజరాత్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ సదస్సులో మాట్లాడుతూ దేశ తొలి ప్రధాని నెహ్రూ విదేశాంగ విధానంలో చేసిన తప్పులను వరసగా ఏకరువు పెట్టారు.

ఆనాడు ఐక్య రాజ్య సమితి భారతి కి శాశ్వత సభ్యత్వం ఇస్తాను అంటే ముందు చైనా అని నెహ్రూ ఆ దేశం పేరుని ప్రతిపాదించారని, అదే బీజేపీ అయితే భారత్ కే మొదటి ప్రాధాన్యత కోరేదని ఆయన అన్నారు. అంతే కాదు చైనా వల్ల భారత్ కి సరిహద్దు సమస్యలు ఇబ్బందులు వస్తాయని నాటి హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ చెప్పినా నెహ్రూ వినకుండా చైనాతో దోస్తీ చేసారని దాని ఫలితంగా సరిహద్దులలో సమస్యలు ఇపుడు వస్తున్నాయని ఆయన అంటున్నారు.

అంతే కాదు కాశ్మీర్ సమస్య ఆ విధంగా పుట్టిందే అని అంటున్నారు. నెహ్రూ చాలా విషయాల్లో వేసిన తప్పులను ఈనాడు దేశం అనుభవిస్తోందని ఆయన విమర్శించారు. అసలు కాశ్మీర్ అంశాన్ని ఐక్యరాజ్య సమితి ముందుకు నెహ్రూ తీసుకుని వెళ్లడమే తప్పు అని జై శంకర్ అన్నారు. నెహ్రూ విధానాల వల్లనే ఇపుడు చైనా సరిహద్దులలో రెచ్చిపోతోందని ఆయన అంటూ గత పదేళ్ల బీజేపీ ఏలుబడిలో ఇవన్నీ వారసత్వంగా వచ్చిన సమస్యలుగా చెప్పారు.

సరే ఈ సమస్యలకు బీజేపీ ఏమి పరిష్కారం చూపించింది అన్నది ఆయన చెప్పకుండా నెహ్రూని ఆయన విధానాలను ఇపుడు తప్పు పట్టడం వల్ల ఉపయోగం ఏంటి అనంది సోషల్ మీడియాలో చర్చగా సాగుతోంది. మాట్లాడితే కాంగ్రెస్ ని గత చరిత్రను చెప్పవద్దు నెహ్రూ పేరు ఇందిరాగాంధీ పేరు చెప్పవద్దు అంటూ సుద్దులు చెప్పే బీజేపీ తాను మాత్రం వారిని విమర్శించడానికి అవే పేర్లను ప్రస్తావించవచ్చా అని నెటిజన్లు అంటున్నారు.

బీజేపీకి యాంటీ నెహ్రూ యాంటీ ఇందిరా పాలసీ అయితే అయి ఉండవచ్చు. కానీ ఈ జనరేషన్ కి వారు ఏమి చేశారు అన్న దాని కంటే బీజేపీ పదేళ్లలో ఏమి చేసింది అన్నదే ప్రధానం అంటున్నారు. ఆ సంగతిని పక్కన పెట్టి కాంగ్రెస్ పెద్దలను విమర్శిస్తూ బీజేపీ మీద సానుభూతి పుడుతుందా అని ప్రశ్నిస్తున్నారు.

ఈనాటి తరం చాలా చురుకుగా ఆలోచిస్తుంది అన్నది బీజేపీ పెద్దలు కానీ కేంద్ర మంత్రులు కానీ మరచిపోతే ఎలా అని అంటున్నారు. బీజేపీ పదేళ్ల పాలనలో చైనా మీద ఏ రకంగా వత్తిడి పెంచి సరిహద్దులను కాపాడారు అన్నది విడమరచి చెప్పాలని అంటున్నారు. అలాగే ఫ్యూచర్ లో భారత్ ఇబ్బందులు పడకుండా ఏ విధానం అనుసరించ బోతున్నారు అన్నది చెప్పాలని అంటున్నారు.

బీజేపీ ఎంతసేపూ గాంధీ నెహ్రూలను విమర్శిస్తూ గతాన్ని తవ్వి తీస్తూ పబ్బం గడుపు కోవాలంటే కుదురుతుందా అని సూటిగానే ప్రశ్నిస్తున్నారు. మరి ఈ విషయంలో బీజేపీ తన తీరుని మార్చుకోవాలనే అంతా అంటున్నారు. లేని పక్షంలో ఎంతసేపూ ఫ్లాష్ బ్యాక్ కధలు చెబుతూ బీజేపీ కూడా గతంలోనే ఉండిపోయే ప్రమాదం పొంచి ఉందని కూడా హెచ్చరిస్తున్నారు.