Begin typing your search above and press return to search.

బీజేపీ ప్రభుత్వానికి వైఎస్సార్ పేరు అంటే ఎందుకు అంత కోపం....?

కేంద్రంలో బీజేపీకి వైఎస్సార్ అంటే కోపంగా ఉందా. ఆయన పేరు చూస్తే గుస్సా అవుతున్నారా. ఈ చర్చ ఇపుడు అంతటా సాగుతోంది

By:  Tupaki Desk   |   7 Nov 2023 4:38 PM GMT
బీజేపీ ప్రభుత్వానికి వైఎస్సార్ పేరు అంటే ఎందుకు అంత కోపం....?
X

కేంద్రంలో బీజేపీకి వైఎస్సార్ అంటే కోపంగా ఉందా. ఆయన పేరు చూస్తే గుస్సా అవుతున్నారా. ఈ చర్చ ఇపుడు అంతటా సాగుతోంది. ఎవరు అవునన్నా కాదన్నా ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో తెలుగు వారికి ప్రజా నాయకుడిగా వైఎస్సార్ అంటే అభిమానం గుండెల్లో ఉంది.

అది చరిత్రలో కూడా శాశ్వతంగా ఉంటుంది. మూడక్షరాల ఆ పేరు వైఎస్సార్ ని తప్పించవచ్చు కానీ ఆయన మీద బడుగులకు ఉన్న ప్రేమను ఎవరూ దూరం చేయలేరు అని అంటున్నారు. విషయానికి వస్తే కేంద్ర ప్రభుత్వ పధకాల మీద వైఎస్సార్ పేరు ఏంటి అని కేంద్రం భావిస్తోందా అన్న చర్చ సాగుతోంది

వైఎస్సార్ పేరుని కేంద్ర పధకం మీద చేర్చినందుకు ఏకంగా అయిదు వేల అక్షరాలా మూడు వందల కోట్ల రూపాయల కేంద్ర నిధులను నిలిపివేసింది. కేంద్ర ప్రభుత్వ పధకాలకు ఎక్కడా రాష్ట్ర ప్రభుత్వం అనుకున్న పేరు పెట్టకూడదని ఆంక్షలు ఉన్నాయా అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం పేరు చివరన వైఎస్సార్ పేరు చేర్చడంతో కేంద్రం పెద్ద మొత్తంలో నిధుల విడుదలను ఆపేసింది.

నిజానికి చూస్తే కేంద్ర పధకాలు అంటే వాటిలో కేంద్ర రాష్ట్ర వాటాలు అరవై నలభై నిష్పత్తిలో ఉంటారు. అంటే దాదాపుగా రెండు ప్రభుత్వాలు ఖర్చు భరిస్తేనే ఒక పధకం జనంలోకి వస్తుంది. ఇక కేంద్రం ఇళ్ళు ఇస్తోందని బీజేపీ నేతలు తరచూ చెబుతూ ఉంటారు.

మరి వారు ఇచ్చే నిధులు ఒక్కో లబ్దిదారునికీ అక్షరాలా లక్షా ముప్పై వేల రూపాయలు మాత్రమే. ఈ రోజులలో ఈ నిధులతో ఇళ్ళు ఎక్కడైన నిర్మాణం అవుతాయా అన్నది కూడా చూడాలి. మరి ఆ ఇళ్లకు మరింతగా రాష్ట్ర ప్రభుత్వం కూడా నిధులు ఇవ్వాల్సి ఉంటుంది. అంతే కాదు ఆకాశం మీద ఇళ్ళు కట్టరు కదా. నేల మీదనే కడతారు. మరి దానికి కావాల్సిన భూమి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. నీరు విద్యుతు రోడ్లు వంటి మౌలిక సదుపాయాలు అన్నీ రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది.

మరి అలా కేంద్ర ప్రభుత్వం ఇళ్ళు అని మొత్తం క్రెడిట్ వారికి ఇచ్చేయవచ్చా అన్నది సగటు జనం వేసే కీలకమైన ప్రశ్న. ఇదే విధంగా అనేక కేంద్ర ప్రభుత్వ పధకాలు వివిధ రాష్ట్రాలలో అమలు అవుతున్నాయి. ఆ మాటకు వస్తే గతంలో కూడా కేంద్ర ప్రభుత్వ పధకాలు అనేక రాష్ట్రాలలో అమలు చేసినా ఎక్కడా ఇది మా పధకం అని కేంద్ర పెద్దలు చెప్పుకోలేదు.

బీజేపీ ఏలుబడిలో అది కూడా నరేంద్ర మోడీ ప్రధాని అయ్యాకనే ఇది మాది అంటూ స్టాంప్ వేసుకోవడం మొదలైంది. మరి కేంద్రం నిధులు అంటున్నారు. కేంద్రానికి ఆ నిధులు ఎక్కడ నుంచి వస్తున్నాయి అన్నది కూడా ఆలోచిస్తే రాష్ట్రాల నుంచే. గతంలో అన్న గారు కేంద్రం మిధ్య అన్నారు. నిజమే కేంద్రం మిధ్యనే. రాష్ట్రాలే నిజం.

అన్ని రాష్ట్రాల సమాహారమే కేంద్రం. రాష్ట్రాలు ఇచ్చే నిధులతోనే కేంద్రం పాలన చేస్తుంది. ఓవరాల్ గా చూసుకున్నపుడు కేంద్రం వద్దకు చేరే ప్రతీ పైసా ప్రజలదే. మరి ప్రజల సొమ్ముని తిరిగి వారికి ఖర్చు చేస్తున్నపుడు ఇది మా నిధులు మా సొమ్ము అనే హక్కు పాలకులకు ఉంటుందా అనేది చూడాల్సి ఉంది.

ఇదంతా చిల్లర రాజకీయంగా కూడా అనిపిస్తుంది. నిజానికి కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నా చేసేది రాజకీయమే. వారికి అధికారంలోకి రావాలని ఉంటుంది. అయితే అధికారంలోకి వచ్చే దగ్గర దారి మాత్రం ఇది కాదని అంటున్నారు. ప్రజల మనసులను గెలుచుకునేందుకు డైరెక్ట్ గా నూరు శాతం కేంద్ర ప్రభుత్వం అమలు చేసే కార్యక్రమాలు మంజూరు చేసే అంశాలు చాలా ఉన్నాయి.

వాటిని జనంలో చర్చకు పెట్టి మద్దతు పొందాలి. ఇక వైఎస్సార్ పేరు ఏపీ ప్రభుత్వం ఎందుకు పెట్టుకోకూడదు అన్నది చర్చగా ఉంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద కేంద్రం ఒక్కో ఇంటికి లక్షా ముప్పయి దాకా మొత్తాన్ని ఇస్తూ ఉంటే మిగిలిన డెబ్బై వేలను రాష్ట్రం ఇస్తోంది. అలా నలభై శాతం నిధులను రాష్ట్రం ఇస్తున్నపుడు తమకు నచ్చిన పేరు పెట్టుకునే హక్కు ఉంది కదా అన్నది రాష్ట్ర అధికారుల వాదన.

అదే సమయంలో ప్రధానమంత్రి అని కూడా పేరు పెడుతున్నారు. ఇద్దరు భాగస్వామ్యం ఉన్నపుడు కేవలం మా పేరే ఉండాలనుకోవడం స్వార్ధ రాజకీయమే అని అంటున్న వారూ ఉన్నారు. అసలు ఈ వివాదం ఎక్కడ పుట్టింది అంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం చివరన వైఎస్సార్ పేరు పెట్టుకుంటామని పేర్కొంటూ గతంలో ఏపీ అధికారులు కేంద్రానికి లేఖ రాసింది. దానికి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ నో చెప్పేసింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని కూడా సూచించింది.

ఇలా వైఎస్సార్ పేరుని ఏపీ బ్రాండ్ ని తొలగించాల్సిందే అంటూ కేంద్రం స్పష్టం చేయడంతో వైసీపీ ప్రభుత్వం ఎట్టకేలకు అంగీకరించింది. లేకపోతే గత ఏడాది 1300 కోట్లు ఈ ఏడాది నాలుగు వేల కోట్ల రూపాయల నిధులు పూర్తిగా కేంద్రం ఇవ్వకుండా ఆపేసింది. అలా కేంద్రం చేయడం మీద విమర్శలు వస్తున్నాయి. వైఎస్సార్ పేరు అంటే ఎందుకు అంతా కోపం అన్న ప్రశ్నలు వస్తున్నాయి.