Begin typing your search above and press return to search.

అబ్బా.. ఆ హామీ బీజేపీ పాలిట చావు దెబ్బ..

రాజకీయాల్లో కొన్ని హామీలుంటాయి. అందులోనూ ఎన్నికల సందర్భంగా ఇచ్చే హామీలు మహా ఆసక్తికరంగా ఉంటాయి

By:  Tupaki Desk   |   5 Oct 2023 6:56 AM GMT
అబ్బా.. ఆ హామీ బీజేపీ పాలిట చావు దెబ్బ..
X

రాజకీయాల్లో కొన్ని హామీలుంటాయి. అందులోనూ ఎన్నికల సందర్భంగా ఇచ్చే హామీలు మహా ఆసక్తికరంగా ఉంటాయి. కొన్నిసార్లు ఆ హామీ ఇచ్చిన ముహూర్త బలమో ఏమో కాని.. ఎన్నికల ఫలితాన్నే మార్చేస్తాయి. రాజకీయాల స్వరూపాన్నే మార్చేస్తాయి. ఉదాహరణకు ఇలాంటివి కొన్ని చెప్పుకొంటే.. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కీలక మలుపుగా నిలిచేది వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు. 1999 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగానే వైఎస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఈ హామీ ఇచ్చినా నాడు ఎవరూ పెద్దగా నమ్మలేదు. 2004 ఎన్నికలకు వచ్చేసరికి మాత్రం ప్రధాన హామీగా మారిపోయింది. అంతేకాదు.. 20 ఏళ్లుగా తెలుగు రాష్ట్రాల్లో రైతులకు ఉచిత విద్యుత్తు అందుతోంది. వైఎస్ హయాంలో మ్యానిఫెస్టోలో లేని ఫీజు రీ ఎంబర్స్ మెంట్, 108 తదితర పథకాలు కార్యక్రమాలను అమలు చేసినట్లుగా చెప్పుకొనేవారు. ఇవి కూడా దాదాపు 16 ఏళ్లుగా కొనసాగుతూ వస్తున్నాయి.

ఈసారి రాజకీయం బండ చుట్టూ..

దాదాపు 25 ఏళ్ల అనంతరం దేశంలో ధరల పెరుగుదల ఎన్నికల అంశం అయ్యే అవకాశం కనిపిస్తోంది. దీనికి కారణం.. ఇటీవలి కాలంలో ఎన్నడూ లేనంతగా కొన్ని నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం. ఇది అన్ని పార్టీల ప్రభుత్వాల పాలనలోనూ ఉన్నప్పటికీ కేంద్రంలో మోదీ సర్కారు వచ్చాక ధరలు అమాంతం పెరిగాయన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

9 ఏళ్లలో గ్యాస్ రేటు మూడింతలు

2014 మార్చి 1న వంట గ్యాస్ బండ ధర రూ.410. మరిప్పుడు రూ.950. నెలన్నర కిందటి వరకు రూ.1150. అంటే తొమ్మిదేళ్లలో గ్యాస్ బండ రేటు రెండింతలు అయింది. ఇది సాధారణ ప్రజలకు మోయలేని భారమే. ఆ మాటకొస్తే మధ్యతరగతి వారికీ కష్టమే. కాగా, ఇదే పాయింట్ ను పట్టుకున్న ప్రతిపక్షాలు మోదీ సర్కారును నిలదీయడం మొదలుపెట్టాయి. తెలంగాణలో మంత్రి కేటీఆర్ సైతం నూటిగా గ్యాస్ బండ రేటును ప్రశ్నించారు. కాగా, ఎవరికి వచ్చిందో ఆలోచన కాని.. కాంగ్రెస్ పార్టీ బీజేపీని గ్యాస్ బండతో పెద్ద దెబ్బనే కొట్టింది.

కర్ణాటకలో మట్టికరిపించి..

కర్ణాటకలో కాంగ్రెస్ ఐదు ఇచ్చిన గ్యారెంటీల్లో రూ.500 కే గ్యాస్ సిలిండర్ ఒకటి. అక్కడి ప్రభుత్వంపై వ్యతిరేకతకు తోడు ఇది బాగా వర్కవుట్ అయి కాంగ్రెస్ ను గెలిపించింది. దీంతో ఇదే హామీని తెలంగాణలో ఇచ్చేసింది.

బీజేపీకి దిమ్మతిరిగి..

దక్షిణాదిలో తమకు ఎంట్రీ పాయింట్ గా చెప్పుకొంటున్న కర్ణాటకలో ఓటమితో బీజేపీకి దిమ్మతిరిగింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ హామీ మిగతా రాష్ట్రాల్లోనూ ఇస్తే తమకు ఓటమి తప్పదని భావించినట్లుంది. ఇటీవల వంట గ్యాస్ పై అమాంతం రూ.200 తగ్గించింది. ఇప్పుడు ఉజ్వల గ్యాస్ సిలిండర్ ధరను రూ.200 రాయితీపై ఇస్తుండగా.. మరో రూ.100 పెంచింది. ఏడాదికి 12 సిలిండర్ల వరకు ఇది వర్తిస్తుంది. కాగా, ఉజ్వల పథకం కింద దాదాపు 10 కోట్ల మంది లబ్ధిదారులున్నారు. ఎన్నికల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

మరి పెట్రోల్ రేటు సంగతో?

మోదీ హయాంలో పెట్రోల్ ధరలు విపరీతంగా పెరిగిన సంగతి తెలిసిందే. ఓ దశలో దీనిపై తీవ్ర ప్రజాగ్రహం వ్యక్తమైంది. దీంతో ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ తగ్గించింది. ఇప్పుడు సాధారణ ఎన్నికల ముంగిట పెట్రోల్ రేట్లపైనా ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లుగా సమాచారం.