Begin typing your search above and press return to search.

మోడీకి రాజకీయ వారసుడు రెడీ...?

నరేంద్ర మోడీ. ఇప్పటికి రెండున్నర దశాబ్దాలుగా ముఖ్యమంత్రిగా ప్రధానిగా పాలన చేస్తూ వస్తున్న నేత

By:  Tupaki Desk   |   25 Aug 2023 7:51 AM GMT
మోడీకి రాజకీయ వారసుడు రెడీ...?
X

నరేంద్ర మోడీ. ఇప్పటికి రెండున్నర దశాబ్దాలుగా ముఖ్యమంత్రిగా ప్రధానిగా పాలన చేస్తూ వస్తున్న నేత. అలుపెరగని నాయకుడిగా పేరు. ఆయన ఈ రోజుకీ సెలవు అన్న మాట ఎత్తకుండా నిరంతరం పనిలోనే ధ్యాస పెడుతున్న లీడర్. నరేంద్ర మోడీ వయసు అక్షరాలా డెబ్బై మూడేళ్ళు. బీజేపీ పార్టీ పెట్టుకున్న నిబంధనల ప్రకారం చూస్తే మరో రెండేళ్లలో ఆయన ప్రధాని పదవి నుంచి దిగిపోవాల్సిందే.

ఏడున్నర పదుల వయసు దాటితే ఎవరైనా కీలక పదవుల నుంచి దూరం కావాలని నరేంద్ర మోడీ వచ్చాక బీజేపీ పెట్టిన ఒక కఠిన నిబంధన. దాని పుణ్యాన ఎల్కే అద్వానీ, మురళీమనోహర్ జోషీ వంటి పెద్దలు అంతా తెర మరుగు అయ్యారు. ఇక మోడీ విషయానికి వస్తే ఆయన పుట్టిన రోజు సెప్టెంబర్ 17. ఆనాటికి ఆయన 73 ఏళ్ళు పూర్తి చేసుకుని 74వ ఏట అడుగు పెడతారు.

ఇక దేశంలో ఎన్నికలు 2024 మేలో జరుగుతాయి. ఇపుడున్న పరిస్థితులు సర్వేలు అన్నీ చూస్తే మోడీయె మరోసారి ప్రధాని అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలా హ్యాట్రిక్ పీఎం గా మోడీ రికార్డు క్రియేట్ చేయనున్నారు.

అయితే 2025 సెప్టెంబర్ 17 నాటికి ఏడున్నర పదుల వయసు నిండనున్న మోడీ ఆనాటికి తన పదవిని త్యాగం చేస్తారా అన్నది కొత్త చర్చ.

మోడీ వచ్చాక బీజేపీలో వ్యక్తి పూజ అధికం అయింది. మోడీతోనే విజయాలు పరాజయాలు అన్నట్లుగా పరిస్థితి ఉంది. మోడీయే బీజేపీ అన్నట్లుగా కూడా పార్టీ ఉందని అంటారు. అటువంటి మోడీ కనుక పదవులు వద్దు అనుకుంటే ఆయన రాజకీయ వారసులు ఎవరు అన్న చర్చ అయితే ఉంది. అప్పట్లో బీజేపీని వాజ్ పేయ్ అద్వానీ కలసి నిర్మించారు. ఈ ఇద్దరూ కలసి బీజేపీని పటిష్టం చేశారు.

వాజ్ పేయ్ వారసుడిగా అద్వానీ పేరు మారుమోగింది. కానీ ప్రజలు మాత్రం నరేంద్ర మోడీని ఎన్నుకున్నారు. అలా వాజ్ పేయ్ వారసుడు మోడీ అయ్యారు. ఇపుడు కూడా ప్రజలు ఎవరిని మోడీ వారసుడుగా ఎవరిని గుర్తిస్తున్నారు అంటే చాలా పేర్లు ఉన్నాయి. ఈ రోజుకు అయితే కేంద్ర హో మంత్రి అమిత్ షాకే ఎక్కువ మంది ఓటు చేశారు. ఆయన పట్ల 29 శాతం జనాలు మొగ్గు చూపారు.

మోడీ ప్రధాని పదవి వద్దు అనుకుంటే అమిత్ షాయే వారసుడు అని తేల్చారు. ఆ తరువాత ప్లేస్ లో అంటే 26 శాతం ఓటింగుతో యూపీ సీఎం ఆదిత్యానాధ్ యోగీజీ ఉన్నారు. ఇక మూడవ ప్లేస్ లో నితిన్ గడ్కరీ ఉన్నారు. ఆయనకు 15 శాతం ప్రజలు ఓటు చేశారు. అంటే ప్రధాని పదవికి వీరిలో ఒకరు కచ్చితంగా అర్హులు అవుతారు అని ప్రజలు అభిప్రాయపడ్డారన్న మాట. మూడ్ ఆఫ్ ది నేషన్ పేరిట ఇండియా టు డే సీ ఓటర్ చేసిన సర్వేలో ఈ విషయాలు వెల్లడి అయ్యాయి.

ఇక ఆరెస్సెస్ బీజేపీలోని చాలా మంది భావన బట్టి చూస్తే మోడీ వారసుడిగా యోగీకే ఎక్కువ మార్కులు వస్తాయని చెబుతారు. ఎందుకంటే ఆయన రెండు సార్లు వరసగా యూపీ సీఎం గా ఉన్నారు. అంతే కాదు ప్రజాదరణలో తిరుగులేదు, హిందూత్వ భావజాలానికి ఊపిరిగా ఉన్నారు. యూపీలో మొత్తం 80 ఎంపీ సీట్లు ఉన్నాయి. అంతటి పెద్ద రాష్ట్రానికి చెందిన వారే ప్రధాని రేసులో అగ్ర భాగాన ఉంటారు.

అంటే నిజంగా 2024లో బీజేపీ గెలిచి మోడీ ప్రధాని అయి 2025 సెప్టెంబర్ తరువాత ఆయన పదవీ విరమణ చేయాల్సి వస్తే మాత్రం యోగీకే ఎక్కువ చాన్సులు అన్నది ఒక నిజమైన విశ్లేషణగా ఉంది. ఇక అమిత్ షా గుజరాత్ రాష్ట్రానికి చెందిన వారు. ఆయన వ్యూహలలో దిట్ట. కానీ ప్రజాదరణ విషయంలో వెనకబడి ఉంటారని అంటారు.

అలాగే నితిన్ గడ్కరీని తీసుకుంటే మహారాష్ట్రకు చెందిన వారు. అక్కడ బీజేపీకి పూర్తి బలం లేదు. పైగా నితిన్ గడ్కరీ మంచి పాలనాదక్షుడు తప్ప జనాదరణలో ముందు వరసలో ఉండరని అంటున్నారు. ఎలా చూసుకున్నా బీజేపీలో మోడీ హవా 2029 దాకా కొనసాగడం ఖాయం. ఆ తరువాతనే వారసుల కధ ముందుకు వస్తుంది. అపుడు కచ్చితంగా యోగీజీయే ప్రధాని రేసులో వారసుడిగా ముందుంటారు అని అంటున్నారు.