Begin typing your search above and press return to search.

బీజేపీ ఫైర్ బ్రాండ్.. అలక 'రాజా'!

ఇప్పటికే ఫైర్ బ్రాండ్ నాయకుడిగా పేరున్న ఆయన వివాదాస్పద వ్యాఖ్యలకు గాను ఓసారి సస్పెన్షన్ వేటునూ ఎదుర్కొన్నారు.

By:  Tupaki Desk   |   21 Dec 2023 5:30 PM GMT
బీజేపీ ఫైర్ బ్రాండ్.. అలక రాజా!
X

తెలంగాణ బీజేపీలో మళ్లీ ముసలం మొదలైంది. మొన్నటిదాక అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ ను దింపేవరకు ఓ వర్గం ఊరుకోలేదు. ఆయనను పక్కనపెట్టాక.. ఎన్నికల్లో పరాజయం పాలైనా పద్ధతి మారలేదు. తాజాగా పార్టీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యే అలక బూనారట. ఇప్పటికే ఫైర్ బ్రాండ్ నాయకుడిగా పేరున్న ఆయన వివాదాస్పద వ్యాఖ్యలకు గాను ఓసారి సస్పెన్షన్ వేటునూ ఎదుర్కొన్నారు. సీనియర్ నాయకులంతా ఓటమిపాలైన సందర్భంలో ఇప్పుడు ఆయనే సీనియర్ గా మిగిలారు. అయినా తనకు కీలకమైన పదవి దక్కకపోవడంతో ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం.

ఇక్కడా రెండుగా చీలింది..

క్రమశిక్షణ గల పార్టీగా చెప్పుకొనే బీజేపీలో వర్గాలకు కొదవ లేదు. తెలంగాణలో ఇలానే తలో వైపు లాగి వెనుకబడిపోయారు. అయితే, అభ్యర్థుల మంచి పేరుతో ఇటీవల ఎన్నికల్లో 8 సీట్లు నెగ్గింది. అనూహ్యంగా సీనియర్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, దుబ్బాకలో రఘునందన్ ఓటమిపాలయ్యారు. కరీంనగర్, నిజామాబాద్ ఎంపీలుగా ఉన్న బండి సంజయ్, ధర్మపురి అర్వింద్ సైతం పరాజయం ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో పార్టీ శాసన సభా పక్ష నేతగా ఎవరిని ఎంపిక చేయాలనే విషయంలో రాష్ట్ర అగ్ర నాయకులు రెండుగా విడిపోయినట్లు తెలుస్తోంది.

రాజాసింగ్ కు దక్కనట్టేనా?

ఈసారి 8 మంది ఎమ్మెల్యేలు గెలిచిన నేపథ్యంలో బీజేపీ ఫ్లోర్ లీడర్ పదవి అత్యంత కీలకం. ఏకైక ఎమ్మెల్యే కావడంతో 2018లో గోషా మహల్ నుంచి గెలిచిన రాజాసింగ్ కు ఆ బాధ్యతలు దక్కాయి. కానీ, ఈసారి ఆయనతో పాటు మరో ఏడుగురు నెగ్గారు. వీరిలో నిర్మల్ నుంచి మహేశ్వర్ రెడ్డి ఒకరు. గతంలోనూ ఓసారి ఈయన ఎమ్మెల్యేగా పనిచేశారు. రాజాసింగ్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే. కాగా, మహేశ్వర్ రెడ్డి కోసం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పట్టుబడుతుండగా, రాజాసింగ్ ను శాసన సభా పక్ష నేత చేయాలంటూ బండి సంజయ్ కోరుతున్నట్లు తెలుస్తోంది.

రాజాకు పదవిస్తే తనకు దెబ్బ..

రాజాసింగ్ ను అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ చేస్తే తనకు దెబ్బ అని.. ముఖ్యంగా హైదరాబాద్ నగరంపై పట్టు పోతుందని ఓ సీనియర్ నేత భావిస్తున్నారట. అందుకే ఆయన వేరే నాయకత్వం వైపు మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. ఈయనను సిటీలో అడ్డుకునేందుకే రాజాసింగ్ కు మరో నేత మద్దతు తెలుపుతున్నారని తెలుస్తోంది. కాగా, ఈ పదవిపై శాసన సభ సమావేశాలు మొదలైన దగ్గరనుంచే బీజేపీలో సంవాదం సాగుతోంది. ఈ పరిణామాల మధ్య రాజాసింగ్ అలకబూనినట్లుగా తెలుస్తోంది.

సమావేశాలు ముగిశాక ఎల్పీ లీడర్ ఎంపిక..

బీజేపీకి శాసనసభా పక్ష నేత లేకుండానే కొత్త ప్రభుత్వంలో తెలంగాణ అసెంబ్లీ తొలి సమావేశాలు ముగిశాయి. సమావేశాల సెషన్ గురువారంతో పూర్తయింది. దీంతో ఆ పార్టీ కొత్త శాసనసభా పక్ష నేత ఎంపిక ఎప్పుడనే ప్రశ్న వస్తోంది. దీనికి సమాధానంగా శుక్రవారం (ఈ నెల 22) బీజేపీ తెలంగాణ శాసన సభా పక్ష నేతను ఎంపిక చేయనున్నట్లు సమాచారం. అంటే అసెంబ్లీ ముగిశాక అసెంబ్లీ పక్ష నేత ఎంపిక అన్నమాట.

కొసమెరుపు: అసెంబ్లీ జరుగుతున్నప్పటికీ బీజేపీ శాసన సభా పక్ష ఎవరో తేలడం లేదని ‘‘తుపాకీ’’ గత వారమే పేర్కొంది. మరోవైపు బుధవారం మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ను ఆ పార్టీ శాసన సభా పక్ష నేతగా స్పీకర్ గుర్తించారు. సీపీఐ తరఫున నెగ్గింది ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని మాత్రమే కావడంతో ఆయనకే ఎల్పీ లీడర్ పదవి దక్కింది. దీనినీ స్పీకర్ గుర్తించారు. కానీ, బీజేపీ నేత ఎవరనేది ఇంకా తేలలేదు.