Begin typing your search above and press return to search.

బీజేపీలోనూ కుటుంబ పోరు.. టికెట్లు ఎవరికి?

టికెట్ల కోసం కుటుంబంలో ఒకరి కంటే ఎక్కువ మంది పోటీపడుతున్నట్లే కనిపిస్తున్నారు. ఆయా కుటుంబాలు తమకు రెండు టికెట్లు కావాలని హైకమాండ్ ను కోరుతున్నాయని తెలిసింది.

By:  Tupaki Desk   |   19 Oct 2023 1:30 AM GMT
బీజేపీలోనూ కుటుంబ పోరు.. టికెట్లు ఎవరికి?
X

కుటుంబ రాజకీయాలకు తాము దూరమని.. కాంగ్రెస్, బీఆర్ఎస్ కుటుంబ పార్టీలని విమర్శిస్తున్న బీజేపీలోనూ కుటుంబ పోరు తప్పదా? అంటే రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో టికెట్ల వేటలో పోటీపడుతున్న నాయకుల్లో కుటుంబం నుంచి ఇద్దరు కూడా ఉండటమే ఇందుకు కారణమని చెప్పాలి. టికెట్ కోసం దంపతులు, తండ్రీ కొడుకులు వేచి చూస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

ఒక కుటుంబంలో ఒకరికే టికెట్ అని ఉదయ్ పూర్ డిక్లరేషన్ లో కాంగ్రెస్ పేర్కొంది. కానీ తెలంగాణ ఎన్నికల విషయానికి వచ్చే సరికి కొంతమందికి మినహాయింపునిచ్చింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులకు, మైనంపల్లి హన్మంతరావుతో పాటు ఆయన తనయుడికి తొలి జాబితాలో కాంగ్రెస్ అవకాశం కల్పించింది. ఇప్పుడు బీజేపీ విషయానికి వస్తే అక్కడ కూడా టికెట్ల కోసం కుటుంబంలో ఒకరి కంటే ఎక్కువ మంది పోటీపడుతున్నట్లే కనిపిస్తున్నారు. ఆయా కుటుంబాలు తమకు రెండు టికెట్లు కావాలని హైకమాండ్ ను కోరుతున్నాయని తెలిసింది.

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయమే. అయితే ఆయన భార్య కావ్యారెడ్డి కూడా టికెట్ కోసం ఎదురు చూస్తున్నట్లు సమాచారం. అలాగే ఈటల రాజేందర్ తో పాటు ఆయన భార్య జమున కూడా ఎన్నికల బరిలో దిగాలనుకుంటున్నట్లు తెలిసింది. ఇక కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి దంపతులు కూడా టికెట్లు ఆశిస్తున్నట్లు టాక్. మరోవైపు వారసుల విషయానికి వస్తే డీకే అరుణ తనకు టికెట్ తో పాటు తన కుమార్తెకు కూడా టికెట్ ఇవ్వాలని అడుగుతున్నారంటా. మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కూడా తనకు, తన తనయుడు మిథున్ రెడ్డికి టికెట్లు ఇవ్వాలని కోరుతున్నట్లు టాక్. మరి వీళ్ల విషయంలో బీజేపీ హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.