Begin typing your search above and press return to search.

2019లో 119 మంది.. ఈసారి 103 మందికి హ్యాండిచ్చిన బీజేపీ

మిగిలిన అంశాల్ని పక్కన పెట్టేసి.. విజయమే లక్ష్యంగా సార్వత్రిక ఎన్నికల బరిలోకి దిగుతోంది బీజేపీ.

By:  Tupaki Desk   |   27 March 2024 6:30 AM GMT
2019లో 119 మంది.. ఈసారి 103 మందికి హ్యాండిచ్చిన బీజేపీ
X

మిగిలిన అంశాల్ని పక్కన పెట్టేసి.. విజయమే లక్ష్యంగా సార్వత్రిక ఎన్నికల బరిలోకి దిగుతోంది బీజేపీ. దశాబ్దాల క్రితం కాంగ్రెస్ సొంతం చేసుకున్న మేజిక్ విజయాన్ని ఈసారి ఎలాగైనా సొంతం చేసుకోవాలన్న తపనతో ఉన్నారు నరేంద్ర మోడీ. సొంతంగా 370స్థానాలు.. మిత్రులతో కలిసి 400 ప్లస్ స్థానాల్లో విజయాన్ని సొంతం చేసుకోవాలని.. తిరుగులేని రీతిలో అధికారం తమ వశం కావాలన్న పట్టుదలతో ఉన్న మోడీ.. అందుకు తగ్గట్లే బీజేపీ అభ్యర్థుల ఎంపికలో కఠినంగా వ్యవహరిస్తున్నారు. గెలుపు ధీమా లేని అభ్యర్థులను బరిలో నుంచి తప్పిస్తున్నారు. మొత్తం సిట్టింగుల్లో దాదాపు మూడో వంతు అభ్యర్థులకు టికెట్ కేటాయించకకుండా షాకిచ్చారు.

ఎంతటి సీనియర్లు అయినా.. మరెంతటి విధేయులైనా విజయం మాత్రమే ముఖ్యమన్నట్లుగా వ్యవహరిస్తూ అభ్యర్థుల ఎంపికలో పలు జాగ్రత్తల్ని తీసుకొంటోంది. మొత్తం 290 మంది సిట్టింగ్ ఎంపీల్లో 103 మందికి టికెట్ ను నిరాకరించింది. ఇప్పటివరకు ఆరు విడతల్లో 405 లోక్ సభా స్థానాలకు తమ అభ్యర్థుల్ని ప్రకటించింది. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ వెలువడకముందే 195 స్థానాలకు తన తొలి అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన బీజేపీ.. తన ప్రత్యర్థి కూటమి కంటే తాను చాలా మెరుగైన స్థితిలో ఉందన్న విషయాన్ని చేతల్లో చెప్పేసింది.

అంతేకాదు.. ఇండియా కూటమి పొత్తుల లెక్కల్లో మునిగిపోయి.. ఒక కొలిక్కి రాక ముందే తన మిత్రుల ఎంపికలోనూ బీజేపీ దూకుడు ప్రదర్శించింది. మిగిలిన పార్టీలు సీట్ల సర్దుబాటులో కిందా మీదా పడుతున్న వేళలో.. బీజేపీ మాత్రం తన నిర్ణయాన్ని కఠినంగా అమలు చేయటం షురూ చేసింది. తొలి జాబితాలో 33 మంది సిట్టింగులకు టికెట్ షాకిచ్చిన కమలం పార్టీ రెండో జాబితాలో 30 మందికి టికెట్ నో చెప్పింది. మూడో జాబితాలో తొమ్మిది మందికి.. నాలుగో జాబితాలో 15 మందికి టికెట్ షాకచ్చిన ఆ పార్టీ ఐదో జాబితాలో ఏకంగా 37 మంది సిట్టింగులకు టికెట్ ఇచ్చేందుకు నో చెప్పేసి.. కొత్త ముఖాల్ని బరిలోకి దించింది.

మంగళవారం ప్రకటించిన మూడు స్థానాల్లో సిట్టింగులను పక్కన పెట్టిన వారిలో కేంద్ర మంత్రి రాజ్ కుమార్ రంజన్ సింగ్ కూడా ఒకరు కావటం చూస్తే.. అభ్యర్థుల ఎంపికలో బీజేపీ ఎంత కచ్ఛితంగా ఉందన్న విషయం అర్థమవుతుంది. ఇప్పటివరకు ప్రకటించిన స్థానాల్లో 34 శాతం మంది బీజేపీ సిట్టింగులకు టికెట్లు దక్కలేదు. ఇంకా ప్రకటించాల్సిన అభ్యర్తుల్లోనూ పలువురికి షాక్ తప్పదంటున్నారు.

2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లోనూ 119 మంది సిట్టింగ్ లకు టికెట్ ఇవ్వలేదు. అప్పట్లో 282 మంది సిట్టింగులు ఉంటే.. అందులో 42 శాతం మంది సిట్టింగులకు టికెట్ ఇవ్వకుండా వారిస్థానంలో కొత్త వారిని బరిలోకి దింపింది. ప్రభుత్వ వ్యతిరేకతను కొత్త ముఖాలతో భర్తీ చేసే ప్రయత్నం చేసింది. తాజా ఎన్నికల్లోనూ అదే వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లుగా చెబుతున్నారు. మరి.. కమలనాథుల వ్యూహం ఎంతమేర వర్కువుట్ అవుతుందో చూడాలి.