Begin typing your search above and press return to search.

ఏపీ బీజేపీలో ఆ ప్రధాన సామాజికవర్గానికి టికెట్లు గుండు సున్నా

మోదీ ప్రభుత్వం గనుక కేంద్రంలో లేకుంటే బీజేపీని మరీ ముఖ్యంగా టీడీపీ దగ్గరకు తీసేదే కాదు అనడంలో సందేహం లేదు.

By:  Tupaki Desk   |   12 April 2024 2:30 PM GMT
ఏపీ బీజేపీలో ఆ ప్రధాన సామాజికవర్గానికి టికెట్లు గుండు సున్నా
X

వచ్చే ఎన్నికల్లో దేశవ్యాప్తంగా చర్చనీయాంశం కానున్న ఫలితం ఆంధ్రప్రదేశ్ దే అనడంలో సందేహం లేదు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. ఏపీ ప్రతిపక్ష పార్టీలు టీడీపీ, జనసేనతో పొత్తు కుదుర్చుకుని బరిలో దిగుంతుండడమే దీనికి కారణం. వాస్తవానికి ఏపీలో బీజేపీకి గత ఎన్నికల్లో అర శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. ఏ విధంగా చూసినా ఇవి ఫలితాలను ప్రభావితం చేసేంత కావు. అయినప్పటికీ ఈ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ, జనసేన వంటి పార్టీలతో కలిసి బరిలో దిగిందంటే దానికి ప్రధాన కారణం కేంద్రంలో అధికారంలో ఉండడమేనని చెప్పాల్సిన పనిలేదు. మోదీ ప్రభుత్వం గనుక కేంద్రంలో లేకుంటే బీజేపీని మరీ ముఖ్యంగా టీడీపీ దగ్గరకు తీసేదే కాదు అనడంలో సందేహం లేదు.

పొత్తులో సీట్ల లబ్ధి.. మరి కేటాయింపు మాటేమిటి?

ఓట్లు లేకున్నప్పటికీ ఏపీలో టీడీపీ-జనసేనతో పొత్తులో భారీగా లబ్ధి పొందిన పార్టీ బీజేపీ అనే చెప్పాలి. మరీ విచిత్రంగా బీజేపీ కోసం జన సేనాని పవన్ కల్యాణ్ తన సీట్లను కుదించుకున్నారు. టీడీపీ నుంచి తొలుత 24 సీట్లు పొందిన పవన్ అందులో మూడు తగ్గించుకున్నారు. ఒక ఎంపీ సీటునూ వదులుకుని రెండుకు పరిమితం అయ్యారు. దీంతో బీజేపీకి ఏకంగా 10 అసెంబ్లీ, ఆరు ఎంపీ స్థానాలు దక్కాయి. ఫైనల్ గా టీడీపీ 144, జనసేన 21, బీజేపీ 10 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. లోక్‌సభ స్థానాల్లో టీడీపీ 17, బీజేపీ 6, జనసేన 2 చోట్ల బరిలో దిగుతున్నాయి.

పొత్తు కుదిర్చినదే పవన్

బీజేపీతో టీడీపీ పొత్తును స్వయంగా దగ్గరుండి కుదిర్చింది జన సేనాని పవన్ కల్యాణ్. కానీ, ఆయన సొంత సామాజిక వర్గం కాపులకు ఏపీలో బీజేపీ ఒక్క సీటూ ఇవ్వలేదు. బీజేపీకి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన సోము వీర్రాజుకూ టికెట్ దక్కకపోవడం గమనార్హం. ఏపీలో అత్యంత పెద్ద సామాజిక వర్గం అయిన కాపులకు బీజేపీ ఇలా చెవిలో పువ్వు పెట్టడం వెనుక పార్టీ రాష్ట్ర నాయకత్వం ఉందనే విమర్శలు వస్తున్నాయి. ఇక ఆరు ఎంపీ సీట్లలో నాలుగు కమ్మ, రెడ్డి, వెలమ, క్షత్రియ సామాజికవర్గాలకు సీట్లు దక్కాయి. మిగిలిన రెండు రిజర్వుడ్ సీట్లు కావడం గమనార్హం.

10 అసెంబ్లీ సీట్లలోనూ కమ్మ కులానికి చెందిన సుజనా చౌదరి, కామినేని శ్రీనివాసరావు, క్షత్రియులైన విష్ణుకుమార్ రాజు, శివక్రిష్ణం రాజులకు టికెట్లు ఇచ్చారు. కానీ, కాపుల నుంచి ఒక్కరికీ టికెట్ లేదు. ఈ నేపథ్యంలోనే కమలంలో కాపులకు టికెట్లేవి? అనే ప్రశ్న వస్తోంది.