Begin typing your search above and press return to search.

బీజేపీకి మరో సీటు... జనసేన నుంచేనా...!?

మరి ఇలా బీజేపీ తన నంబర్ పెంచుకుంటూ పోతే ఆ మేరకు టీడీపీకి ఏమి నష్టం లేదు కానీ జనసేన సీట్లలో కోత పడుతోంది అని అంటున్నారు.

By:  Tupaki Desk   |   27 March 2024 5:30 PM GMT
బీజేపీకి మరో సీటు... జనసేన నుంచేనా...!?
X

బీజేపీ కోరికలు అలా పెరిగి పోతున్నాయి. మూడు ఎంపీ సీట్ల నుంచి ఆరు ఎంపీ సీట్ల దాకా ఆ పార్టీ ఎగబాకింది. అదే విధంగా ఆరు అసెంబ్లీ సీట్లతో టీడీపీ బీజేపీకి సర్ది చెబుతుంది అని అంతా అనుకున్నారు. కానీ పది అసెంబ్లీ సీట్లు ఇచ్చేశారు. ఇపుడు ఇవి చాలవు మరొకటి ఇవ్వండి అని కోరుతున్నారని సమాచారం.

ఆ సీటులో బీజేపీ సీనియర్ నేత మాజీ ప్రెసిడెంట్ సోము వీర్రాజుని పోటీ చేయిస్తారు అని అంటున్నారు. ఆ సీటు కూడా చాలా కీలకమైంది. రాజమండ్రి రూరల్ కానీ రాజమండ్రి అర్బన్ కానీ బీజేపీ కోరుతోందిట. రాజమండ్రి రూరల్ అర్బన్ ఈ రెండూ కూడా టీడీపీ చేతిలో ఉన్నాయి.

రాజమండ్రి రూరల్ సీటు విషయంలో ఎంత రచ్చ సాగిందో అందరికీ తెలిసిందే. ఆ సీటు జనసేన బలంగా కోరుకుంది. అయితే అక్కడ నుంచి కందుల దుర్గేష్ ని నిడదవోలుకు పంపించారు. రార్జమండ్రి రూరల్ నుంచి మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్యచౌదరి పోటీ చేస్తున్నారు. ఇక అర్బన్ సీటు తీసుకుంటే ఆదిరెడ్డి వాసు పోటీ చేస్తున్నారు.

ఈ సీటులో కూడా మార్పు ఉండకపోవచ్చు అని అంటున్నారు. అయితే తూర్పు గోదావరి జిల్లాలో సోము వీర్రాజు రాజమండ్రి ఎంపీ సీటు కోరుకున్నారు. ఆ సీటుని బీజేపీ ప్రెసిడెంట్ దగ్గుబాటి పురంధేశ్వరికి ఇచ్చేశారు. దాంతో సోము అలిగి బీజేపీ పదాధికారుల సమావేశానికి డుమ్మా కొట్టినట్లుగా వార్తలు వచ్చాయి.

అయితే ఆయనకు జ్వరంగా ఉందని అందుకే హాజరు కాలేదని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే సీట్ల పితలాటం వల్లనే సోము బీజేపీకి దూరంగా ఉండిపోతున్నారు అని అంటున్నారు. ఇక అనపర్తి సీటుని బీజేపీకి ఇస్తామని టీడీపీ ప్రతిపాదిస్తోంది. అయితే అక్కడికి వెళ్లడానికి సోము సుముఖంగా లేరు అని అంటున్నారు. ఆ సీటులో బలం ఏ మాత్రం లేదు. దాంతో ఎందుకొచ్చిన పోటీ అని ఆయన ఆలోచిస్తున్నారు అని అంటున్నారు.

తనకు ఎంతో కొంత పట్టు ఉన్న రాజమండ్రి అర్బన్ రూరల్ సీట్లలో ఏదో ఒకటి ఇవ్వాలని ఆయన కోరుతున్నారుట. దీని మీద బీజేపీ హై కమాండ్ టీడీపీ మీద తీవ్ర వత్తిడి పెడుతోంది. అయితే టీడీపీ అధినాయకత్వం ఈ విషయంలో ప్లాన్ బీని అమలు చేస్తోంది అని అంటున్నారు.

అదేంటి అంటే రాజమండ్రి రూరల్ అర్బన్ సీట్లు ఎటూ ఇవ్వడం కుదరదు కాబట్టి వాటికి ఆల్టరేషన్ గా రాయలసీమలో మరో సీటు ఇవ్వడానికి చూస్తోంది అని అంటున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె, ఉమ్మడి కడప జిల్లా రాజంపేటలలో ఒకటి ఇవ్వడానికి చూస్తోందిట. రాజంపెట సీటు అయితే జనసేనకు కేటాయించారు.

దాంతో జనసేన సీటు నుంచే బీజేపీకి అదనపు సీటు ఇచ్చి త్యాగం ఏదో జనసేన చేతనే చేయించాలని చూస్తున్నారు అని అంటున్నారు. ఇక ఈ రెండు సీట్లలో ఒకదానిని అయినా ఇవ్వమని సీమకు చెందిన బీజేపీ నేతలు కోరుతున్నారుట. వారు ఏపీ బీజేపీకి సంబంధించి ఏపీకి ఎన్నికల ఇన్ ఛార్జిగా నియమితులైన బీజేపీ సీనియర్ నేత అరుణ్ సింగ్ ద్వారా వత్తిడి పెడుతున్నారు అని అంటున్నారు.

మరో వైపు చూస్తే ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి సీనియర్ నేత పీవీఎన్ మాధవ్ కి సీటు కోసం కూడా బీజేపీ టీడీపీని కోరుతోంది అని అంటున్నారు. మరి ఇలా బీజేపీ తన నంబర్ పెంచుకుంటూ పోతే ఆ మేరకు టీడీపీకి ఏమి నష్టం లేదు కానీ జనసేన సీట్లలో కోత పడుతోంది అని అంటున్నారు.

మరి రాజంపేట సీటు బీజేపీకి ఇస్తున్నారా అన్నది ఇపుడు చర్చగా ఉంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.