Begin typing your search above and press return to search.

తెలంగాణాలో బీజేపీ బీసీ సీఎం...ఏపీలో పవన్ కోసమేనా...?

ఏపీలో చూస్తే జనసేన బీజేపీ పొత్తులో ఉన్నాయి. అలాగే జనసేన టీడీపీ పొత్తులో ఉన్నాయి. ఇక ఈ మూడు పార్టీలు కలసినా కూడా పెద్ద పార్టీగా కూటమిలో టీడీపీ ఉంటుంది.

By:  Tupaki Desk   |   13 Nov 2023 3:30 AM GMT
తెలంగాణాలో బీజేపీ బీసీ సీఎం...ఏపీలో పవన్ కోసమేనా...?
X

బీజేపీ తెలుగు రాష్ట్రాలలో రాజకీయ సామాజిక సమీకరణలను బేరీజు వేసుకుంటూ దూకుడుగా ముందుకు సాగుతోంది. ట్రెడిషనల్ గా కొన్ని సామాజిక వర్గాలకు మాత్రమే పరిమితం అయిన సీఎం కుర్చీ మిగిలిన వర్గాలకు కూడా దక్కాలన్నది బీజేపీ వ్యూహం. ఇది సామాజిక ఎత్తుగడ కూడా. తెలంగాణాలో బీసీలు అధికంగా ఉన్నారు.

దాంతో బీజేపీ బీసీ సీఎం నినాదం అందుకుంది. ఇక మరో నాలుగైదు నెలలలో ఏపీలోనూ ఎన్నికలు ముంచుకు వస్తున్నాయి. ఏపీలో బీజేపీ సామాజిక నినాదం ఏంటి అన్నది చర్చకు వస్తోంది. ఏపీలో రాజ్యాధికారానికి దూరంగా కాపులు, బీసీలు ఉన్నారు. ఇప్పటిదాకా ఈ సామాజిక వర్గాలు మంత్రులుగా ఉప ముఖ్యమంత్రులుగా పనిచేశారు కానీ సీఎం పోస్టు మాత్రం చేపట్టలేదు

దాంతో ఈసారి వారికి చాన్స్ ఇవ్వాలన్నది బీజేపీ స్లోగన్ గా ఉండబోతోంది అని అంటున్నారు. తెలంగాణాలో బీజేపీ జనసేన మాత్రమే పొత్తూలలో ఉన్నాయి. కాబట్టి బీసీ సీఎం అని 111 చోట్ల తన అభ్యర్ధులను నిలబెట్టిన బీజేపీ సోలోగా ప్రకటించగలిగింది. అదే ఏపీలో అలా ఉంటుందా అన్నది చూదాల్సి ఉంది.

ఏపీలో చూస్తే జనసేన బీజేపీ పొత్తులో ఉన్నాయి. అలాగే జనసేన టీడీపీ పొత్తులో ఉన్నాయి. ఇక ఈ మూడు పార్టీలు కలసినా కూడా పెద్ద పార్టీగా కూటమిలో టీడీపీ ఉంటుంది. దాంతో ఈ కూటమి గెలిస్తే చంద్రబాబు సీఎం అవుతారు. ఇది సత్యం కూడా. అయితే ఇక్కడే బిగ్ ట్విస్ట్ ఉంది అని అంటున్నారు.

ఏపీలో బీజేపీ కనుక ఈ కూటమిలోకి వస్తే కనుక కచ్చితంగా సీట్ల షేర్ తో పాటు ఆధికార వాటాలో ఒప్పందాలు కూడా మారిపోతాయని అంటున్నారు. బీజేపీ జనసేన కలసి కనీసంగా అరవై సీట్లు అయినా డిమాండ్ చేస్తయని తెలుస్తోంది. అలాగే అధికారంలో వాటాగా పవన్ కి కొన్నాళ్ళ పాటు అయినా సీఎం పదవి ఇవ్వాలని కోరుతాయని అంటున్నారు.

అంటే అయిదేళ్ల అధికారంలో టీడీపీ మూడేళ్ళు ఉన్నా రెండేళ్ళ పాటు పవన్ సీఎం గా ఉండాలని షరతు ఉంటుంది అన్న మాట. అలా ఉంటేనే పొత్తులు అన్నట్లుగా కూడా కధ నడిపిస్తుంది అని అంటున్నారు. ఇక పవన్ తో బీజేపీ తెలంగాణాలో పొత్తు పెట్టుకోవడం, ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీ తన పక్కన కూర్చోబెట్టుకుని ఎల్బీ స్టేడియం సభలో వేదిక మీదనే ముచ్చట్లు పెట్టడం ద్వారా పవన్ని తమ వాడుగానే బీజేపీ ఎస్టాబ్లిష్ చేస్తోంది అంటున్నారు.

అదే విధంగా పవన్ సైతం బీజేపీ తోడు అవసరం బీజేపీ ఉంటేనే ఏపీలో వైసీపీని ఓడించగలమని నమ్ముతున్నారు. ఇక టీడీపీలోని కొందరు బీజేపీ వద్దు అంటున్నట్లుగా ప్రచారంలో ఉన్నా అంతిమంగా చంద్రబాబు ఏమి తేల్చుతారు అన్నదే చూడాల్సి ఉంది అని అంటున్నారు. ఏది ఏమైనా పవన్ తోనే బీజేపీ టీడీపీ పొత్తుకు వస్తుందని అయితే కండిషన్లు అప్లై అవుతాయని అవి పవన్ కే మేలు చేసేలా ఉంటాయని అంతిమంగా ఏపీ రాజకీయాల్లో బీజేపీ బలపడే విధంగా కూడా ఈ రాజకీయం సాగుతుంది అని అంచనా కడుతున్నారు.