Begin typing your search above and press return to search.

బీజేపీ వైసీపీ కలిసే సీన్ ఉంటుందా ?

రాజకీయాలు అంటే అనూహ్యమైనవి జరుగుతాయి. అయితే రాజకీయాలను నిజంగా చూసి అలా చేసిన వారు మాత్రమే మలుపులు తిప్పగలరు, ఎప్పటికి అపుడు పరిస్థితులకు తగినట్లుగా నిర్ణయం తీసుకోగలరు.

By:  Satya P   |   14 Dec 2025 6:00 AM IST
బీజేపీ వైసీపీ కలిసే సీన్ ఉంటుందా ?
X

రాజకీయాలు అంటే అనూహ్యమైనవి జరుగుతాయి. అయితే రాజకీయాలను నిజంగా చూసి అలా చేసిన వారు మాత్రమే మలుపులు తిప్పగలరు, ఎప్పటికి అపుడు పరిస్థితులకు తగినట్లుగా నిర్ణయం తీసుకోగలరు. కానీ రాజకీయాలు అన్నవి ఒక ఆటగా చూడాలి. అక్కడ గెలుపు కోసం ముందుకు సాగాలి. రూల్స్ చాలా సార్లు బ్రేక్ చేయాల్సి ఉంటుంది. అయితే వైసీపీ అధినాయకత్వం మాత్రం మొదటి నుంచి ఒకే ఫిలాసఫీని అనుసరిస్తూ ముందుకు పోతోంది. అందువల్ల వైసీపీ ఏ పార్టీతోనూ పొత్తులు అయితే పెట్టుకోదని అంటారు.

సింగిల్ గానే అంటూ :

వైసీపీ ఈ దేశ రాజకీయాల్లో ప్రత్యేకమైనదిగా అంతా చూస్తారు. ఈ దేశంలో ఎన్నో పార్టీలు ఉన్నాయి. ఆయా పార్టీలు ఏదో సందర్భంలో పొత్తులు పెట్టుకున్నాయి. అలాగే ముందుకు సాగాయి. అది తప్పేమీ కాదు, రాజకీయాల్లో అవసరం కూడా. బలం ఇద్దరికీ ఉన్నపుడు సర్దుకుని పోతూ అధికారం అందుకోవడం ఒక విధమైన స్ట్రాటజీగానే చూస్తారు. వైసీపీ అయితే సింగిల్ గానే వెళ్తామని అనేక సార్లు చెప్పింది. ఈ రోజుకీ చెబుతోంది. ఆ పార్టీ ఒక్కటే పొత్తులు లేకుండా పోటీ చేస్తున్న పార్టీగా దేశంలో రికార్డుని కూడా సృష్టిస్తోంది.

ఈసారి తప్పదా :

అయితే గతానికి పోలిస్తే ఏపీ రాజకీయం బాగా మారింది. ఏపీలో బలమైన కూటమి అధికారంలో ఉంది. 2029 నాటికి ఏపీలో మూడు పార్టీలు కూడా మరోసారి పోటీకి సిద్ధమవుతున్నాయి. అదే సమయంలో వైసీపీ ఒంటరిగానే బరిలోకి దిగాల్సి ఉంటుంది. ఆ పార్టీయే పొత్తులు కాదు అనుకుంటుంది కాబట్టి చాయిస్ అయితే లేదు అని అంటున్నారు. వాస్తవంగా చూస్తే వామపక్షాలు కాంగ్రెస్ ఆప్ వంటి పార్టీలను కలుపుకుని ఏపీలో వైసీపీ ప్రతిపక్ష కూటమిని ఏర్పాటు చేయవచ్చు. కానీ ఎందుకో వైసీపీ దానికి సుముఖంగా లేదని అంటున్నారు.

వైసీపీలో మధనం :

ఇక చూస్తే 2029 లో కూడా కూటమిగా పార్టీలు అన్నీ కలసి వస్తే కనుక గెలుపునకు ఏ విధంగా అవకాశాలు ఉంటాయి అన్నది వైసీపీలో ఒక రకమైన చర్చ సాగుతోంది. చాలా కాలం క్రితమే నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి బీజేపీతో పొత్తు పెట్టుకుని ఉండాల్సింది అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన అన్నారని కాదు కానీ చాలా మందిలో ఆ రకమైన అభిప్రాయం అయితే ఉంది అని అంటున్నారు. ఎందుకంటే బీజేపీ ఎన్నడూ లేని విధంగా కేంద్రంలో బలంగా ఉంది ఆ పార్టీ అండ ఉంటే ఏపీలో గెలుపు సులువు అని కూడా అంటున్నారు.

అసాధ్యమేనా :

కానీ బీజేపీ తో వైసీపీ పొత్తు అన్నది వైసీపీ హైకమాండ్ కే ఇష్టం ఉండదని అంటున్నారు దానికి కారణం ఒక సెక్షన్ ఆఫ్ ఓటు బ్యాంకు పోతుంది అన్న భయమే కారణం అని అంటారు. మరో వైపు చూస్తే బీజేపీ కూడా వైసీపీతో పొత్తుకు సుముఖత వ్యక్తం చేయదని చెబుతున్నారు. ఎందుకు అంటే చంద్రబాబుని తమతో ఉంచుకోవాలని ఆ పార్టీ కోరుకుంటుంది అని చెబుతారు. జాతీయ స్థాయిలో రాజకీయాలను కూడా మలుపు తిప్పగల సత్తా బాబుకు ఉంది అందువల్ల ఆయనతో దోస్తీయే తమకు ప్రధానం అని బీజేపీ కచ్చితంగా భావిస్తుంది అని అంటున్నారు అందువల్ల 2024 ముందు పరిస్థితి ఎలా ఉన్నా ఇప్పుడు అయితే వైసీపీ నుంచి కానీ బీజేపీ నుంచి కానీ పొత్తులు అయితే కుదరడం అసాధ్యమే అని అంటున్నారు. చూడాలి మరి ముందు ముందు ఏమి జరుగుతుందో.