Begin typing your search above and press return to search.

2029లోనే మహిళా రిజర్వేషన్ -బీజేపీ తగ్గేదేలే !

భారతీయ జనతా పార్టీ మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో పట్టుదలగా ఉన్నట్లుగా కనిపిస్తోంది. నిజానికి ఈ బిల్లు కోసమే రాజ్యాంగంలోని 131 సవరణను చేయాలని లోక్ సభలో బిల్లు పెడితే అది వీగిపోయింది.

By:  Satya P   |   24 April 2026 7:00 AM IST
2029లోనే మహిళా రిజర్వేషన్ -బీజేపీ తగ్గేదేలే !
X

భారతీయ జనతా పార్టీ మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో పట్టుదలగా ఉన్నట్లుగా కనిపిస్తోంది. నిజానికి ఈ బిల్లు కోసమే రాజ్యాంగంలోని 131 సవరణను చేయాలని లోక్ సభలో బిల్లు పెడితే అది వీగిపోయింది. అయితే దాని మీద బీజేపీ నేతలు ఎన్డీయే నేతలు అంతా మండిపడుతున్నారు. విపక్ష నేతలు మరీ ముఖ్యంగా కాంగ్రెస్ ఈ విషయంలో పోషించిన ప్రతికూలమైన పాత్ర కారణంగానే మహిళలకు 2029 ఎన్నికల్లో రిజర్వేషన్లు దక్కే అవకాశాలు లేకుండా పోయాయని అంటున్నారు. 2034 ఎన్నికల దాకా ఆగాలన్నది వారి ఉద్దేశ్యంగా ఉందని అయితే తాము 2029 లో మహిళా రిజర్వేషన్లు అమలు అయ్యేలా చూస్తామని పూర్తి కాన్ఫిడెన్స్ తో చెబుతున్నారు.

వారికి చులకన భావం :

నిజానికి మహిళలు అంటేనే ప్రతిపక్షాలకు చులకన భావమని కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ అంటున్నారు. కాంగ్రెస్ కి మహిళలు అంటే మరీ చులకన అని ఆయన ఫైర్ అయ్యారు. మూడు దశాబ్దాలుగా మహిళలకి ప్రాధాన్యత ఇస్తామంటూ రిజర్వేషన్లు కల్పిస్తామంటూ చేస్తున్న ప్రకంటనలు అన్నీ కూడా పూర్తిగా ఎన్నికల హామీల వరకే పరిమితం అయిపోయాయని ఆయన విమర్శించారు. దానికి కారణం 2014 కి ముందు ఉన్న ప్రభుత్వాలు అని కాంగ్రెస్ నిందించారు. అయితే ప్రధానమంత్రి 2014 లో మోదీ బాధ్యతలు స్వీకరించాక నారీ శక్తీ వందనంని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని గుర్తు చేశారు.

గట్టి సంకల్పంతో :

ఇక మహిళలకి చట్టసభల్లో ప్రాతినిద్యం కల్పించాలనే సంకల్పం మోదీ ప్రభుత్వం తీసుకుందని భూపతిరాజు చెప్పారు. అందుకే మోదీ ప్రభుత్వంలో అందరితో చర్చించిన అనంతరం మెజారిటీ ఆధారంగా 2023లో మహిళా బిల్లుని ప్రవేశపెట్టారని చెప్పారు. అలా 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలనే నిర్ణయాన్ని వెంటనే ఆచరణలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉందని అన్నారు. అయితే కాంగ్రెస్ దాని మిత్ర పక్ష పార్టీలు మహిళా రిజర్వేషన్ బిల్లుని రకరకాల సాకులతో ఓటమి పాలయ్యేలా చూశారని వర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టసభలలో మహిళలకి ప్రాధాన్యత ఇచ్చే బిల్లుని ప్రతిపక్షం తీవ్రంగా వ్యతిరేకించిందని అన్నారు. నిజానికి దేశవ్యాప్తంగా ఉండే మహిళలు ఎంతో ఆశతో ఈ బిల్లు కోసం ఎదురు చూశారని ఆయన చెప్పారు. కానీ 54 ఓట్ల తేడాతో కాంగ్రెస్ పార్టీ బిల్లుని ఓడించిందని కేంద్ర మంత్రి మండిపడ్డారు.

అన్యాయం తప్పు :

ఈ బిల్లు నెగ్గితే దక్షిణాది రాష్ట్రాలకి అన్యాయం జరుగుతుందని ఇలా ఏదొక సాకులు చెప్పి తాత్కాలికంగా ఓడించారు కానీ మోదీ నాయకత్వంలో కచ్చితంగా ఈ బిల్లుని ముందుకి తీసుకెళ్తామని ఆయన చెప్పడం విశేషం. 2034 ఎన్నికల వరకు కాకుండానే 2029 ఎన్నికల్లోపే ఈ బిల్లుని అమలు చేసే ఉద్దేశంతో డిలిమిటేషన్ తో మహిళలకి చట్ట సభల్లో న్యాయం చేయాలనీ ఉద్దేశం మోదీ ప్రభుత్వానికి బలంగా ఉందని ఆయన చెప్పారు. బీజేపీకి ఉత్తరాది ప్రాంతంలో బలం ఉందని ఉత్తరాది రాష్ట్రాలలో ఎంపీ సీట్లు పెంచుతారని దక్షిణాది రాష్ట్రంలో సీట్లు రావని విపక్షాలు అబద్దపు ప్రచారాలు చేశారని ఆయన అన్నరు. దేశంలో ఉండే అన్ని రాష్ట్రాలకి న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో డిలీమిటేషన్ పాలసీని, అలాగే మహిళా బిల్లుని మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిందని శ్రీనివాస వర్మ చెప్పారు.

డిలిమిటేషన్ ఎందుకంటే

ఈ దేశంలో డీలిమిటేషన్ ఎందుకు అని ప్రతిపక్ష పార్టీలు అంటున్నాయని కేంద్ర మంత్రి విమర్శించారు. దేశంలో కొన్ని పార్లమెంట్ల సీట్లలో 30 లక్షలు మరి కొన్ని చోట్ల 25 లక్షలు ఇంకొన్ని చోట్ల 7 లక్షల ఓటర్లు ఇలా ఒక విధానంగా కాకుండా అన్ని చోట్లా ఒకే విధంగా ఎంపీ సీట్ల విభజన జరగాలని పాలన సాగాలనంది బీజేపీ విధానంగా ఆయన చెప్పారు. ఇలా ఎక్కువ మంది ఓటర్లు ఉండే ప్రాంతాలలో డివైడ్ చేసి అన్ని సమానంగా ఉంచే ఒక సిస్టమాటిక్ కార్యక్రమంగా డీలిమిటేషన్ ప్రక్రియ ఉంటుందని అన్నారు. ఇలా చేయటం ద్వారా మహిళలకి సైతం చక్కటి అవకాశాలు లభిస్తాయని ఆయన చెప్పారు.

కచ్చితంగా అమలు :

అందుకే మహిళలు మోదీకి అందిస్తున్న అండతోనే 2029 ఎన్నికల లోపుగా మహిళా రిజర్వేషన్లు అమలు చేసే దిశగా ముందుకి వెళ్తామని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి చెప్పిన దానిని బట్టి చూస్తే మహిళా బిల్లు కోసం మరోసారి లోక్ సభ ముందు కేంద్రం కొత్త ప్రతిపాదనలతో వస్తుందా లేదా ఉన్న బిల్లుకు ఏమైనా మార్పులు చేర్పులు చేసి సభ ఆమోదం కోసం ప్రయత్నం చేస్తుందా అన్నది చూడాల్సి ఉంది. ఏది ఏమైనా 2029లోనే మహిళా బిల్లు డీలిమిటేషన్ జరిగిపోవాలని బీజేపీ పట్టుదలతో ఉందని అర్ధం అవుతోంది. మరి విపక్షాలు ఏ మేరకు సహకరిస్తాయన్నది చూడాలి. ఎందుకంటే ఇది రాజ్యాంగ సవరణ చేస్తేనే తప్ప కుదిరే వ్యవహారం కాదు.