కుల గణన చేసింది ఎంఐఎం కోసమే: కిషన్ రెడ్డి
బీసీ సామాజిక వర్గానికి అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీనేనని బీజేపీ కీలక నాయకుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు.
By: Tupaki Desk | 25 July 2025 10:00 PM ISTబీసీ సామాజిక వర్గానికి అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీనేనని బీజేపీ కీలక నాయకుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీసీలకు రిజర్వేషన్ కల్పించేందు కు తెలంగాణ ప్రభుత్వం మొసలి కన్నీరు కారుస్తోందన్నారు. అసలు కుల గణన చేసింది.. బీసీల కోసం కాదని.. ఎంఐఎం కోసమేనని వ్యాఖ్యానించారు. ఎంఐఎంకు మేలు చేసేందుకు.. ముస్లిం సామాజిక వర్గం ఎంతుందో తేల్చుకునేందుకు కాంగ్రెస్ నాటకం ఆడుతోందన్నారు.
బీసీలపై ప్రేమ ఉంటే.. బీసీలకు చెందిన నాయకుడిని ఎందుకు ముఖ్యమంత్రిని చేయలేదన్నారు. ఏ రాష్ట్రంలో అయినా.. బీసీలకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చారా? అని ప్రశ్నించారు. 42 శాతం బీసీలకు రిజ ర్వేషన్లు కల్పిస్తున్నామని చెబుతున్న రేవంత్ రెడ్డి.. ఏ ప్రాతిపదికన ఈ నిర్ణయం తీసుకున్నారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. అలివికాని హామీలతో అధికారంలోకి వచ్చి.. ఇప్పుడు అలివికాని.. రాజ్యాంగ విరుద్ధమైన.. రిజర్వేషన్లు కల్పిస్తామని చెబుతున్నారని.. దీనికి ఎలా మద్దతు ఇస్తామని ప్రశ్నించారు.
బీసీలపై చిత్తశుద్ధి ఉన్న ఏకైక పార్టీ బీజేపీ నేనని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. అందుకే.. వాజపేయి తర్వాత.. బీసీ అయిన.. మోడీకి వరుసగా మూడోసారి కూడా ప్రధాని అయ్యే అవకాశం కల్పించామని చెప్పారు. కానీ.. కాంగ్రెస్ ఇలా చేయగలదా? అని ప్రశ్నించారు. చిత్తశుద్ధి లేని శివపూజ మాదిరిగా బీసీలపై కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారని.. అదేమంటే.. తప్పు బీజేపీదేనని చెబుతున్నారని వ్యాఖ్యానించారు. ముస్లింలకు 4 నుంచి 10 శాతం రిజర్వేషన్ ఎందుకు కల్పించారని ప్రశ్నించారు.
కోర్టు మొట్టికాయలు వేసినా బుద్ధి లేకుండా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తోందన్నారు. అందుకే.. ఈ విషయం లో బీజేపీ మద్దతు ఇవ్వడం లేదన్నారు. ముందు ముస్లింలకు ఇచ్చిన రిజర్వేషన్లను రద్దు చేయాలని.. తద్వారా బీసీలకు ఆ రిజర్వేషన్ ఇవ్వాలని .. అప్పుడు బీజేపీ మద్దతు ఇస్తుందన్నారు. అంతేకానీ.. ఎంఐ ఎం కోసం.. చేసిన కులగణను అడ్డు పెట్టుకుని బీసీలకు రిజర్వేషన్ కోసం కొట్లాడుతున్నామంటే.. తెలం గాణ సమాజం క్షమించదని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
