నితిన్ నబీన్ ప్రచారం చేసినా....కమలదళంలో అంతర్మధనం
తెలంగాణా మీద బీజేపీ ఎన్నో ఆశలు పెట్టుకుంది. 2028 న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తాము గెలిచి తీరుతామని అధికారంలోకి వస్తామని ఆ పార్టీ ఎంతో విశ్వాసంగా ఉంది.
By: Satya P | 13 Feb 2026 8:43 PM ISTతెలంగాణా మీద బీజేపీ ఎన్నో ఆశలు పెట్టుకుంది. 2028 న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తాము గెలిచి తీరుతామని అధికారంలోకి వస్తామని ఆ పార్టీ ఎంతో విశ్వాసంగా ఉంది. అయితే ఆ ధీమాను సడలించే విధంగా స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు షాక్ ఇస్తున్నాయి. మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికలలో బీజేపీ ఆశించిన స్థాయిలో ఫలితాలను రాబట్టుకోలేదు. అయితే పట్టణాల తమకు అంతా అనుకూలంగా ఉంటుంది అని మునిసిపల్ ఎన్నికలను నమ్ముకుంది. అయితే తాజాగా జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో సైతం ప్రజలు బీజేపీకి పెద్దగా సానుకూల ఫలితాలు ఇవ్వలేదు, అధికార కాంగ్రెస్ కి ఏకపక్షంగా ఓటెత్తారు. అదే సమయంలో ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ నే వారు ఎంచుకుంటున్నారు. బీజేపీకి మూడవ ప్లేస్ ని ఇస్తున్నారు. దాంతో పాటుగా గతంలో పట్టణాల్లో బీజేపీకి ఉన్న బలం కాస్తా ఈసారి బాగా తగ్గిందా అన్నట్లుగా తాజా ఫలితాలను చూస్తే ఒక విశ్లేషణ జరుగుతోంది.
నితిన్ నబీన్ వచ్చినా :
బీజేపీకి కొత్త ప్రెసిడెంట్ గా గత నెలలో బాధ్యతలు స్వీకరించిన నితిన్ నబిన్ తెలంగాణాలో తొలి పర్యటన చేశారు. ఆయన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో రెండు భారీ సభలలో పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారం చేశారు. అయితే ఆ ప్రభావం పెద్దగా కనిపించడం లేదని రిజల్ట్స్ చూపిస్తున్నాయి. ఇక్కడ బీజేపీకి పెద్దగా కలసి వచ్చింది ఏమీ లేదు అని అంటున్నారు. అదే సమయంలో బీజేపీ ఆశలు పెట్టుకున్న చోట్ల సైతం ఓటమి సంభవించింది. వార్డులు కూడా బాగా తగ్గిపోయాయి. దాంతో కమలంలో అంతర్మధనం మొదలైంది అని అంటున్నారు.
పట్టణాలలో ఎందుకిలా :
మొత్తం 120 దాకా ఉన్న మునిసిపాలిటీలలో బీజేపీకి షాకింగ్ రిజల్ట్స్ వచ్చాయి. దాంతో రేపటి రోజున తామే అంతా అని భావిస్తున్న బీజేపీకి ఈ పరిణామాలు మింగుడు పడడం లేదు అని అంటున్నారు. మరో వైపు పట్టణ ఓటర్లు కూడా అయితే కాంగ్రెస్ లేకపోతే బీఆర్ఎస్ అని విడిపోయారా అన్న చర్చ సాగుతోంది. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నపుడు కాంగ్రెస్ లో అనైక్యత కారణంగా చాలా చోట్ల బీజేపీ మెరిసింది. ఇపుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది. బీఆర్ఎస్ తన బలాన్ని చూపిస్తూ ముందుకు సాగుతోంది. దాంతోనే ఈ తరహా ఫలితాలు వస్తున్నాయా అన్న చర్చ కూడా ఉంది.
బడా నేతలున్న చోట:
బీజేపీకి బిగ్ షాట్స్ అనదగిన నేతలు ఉన్న చోట్ల కూడా ఫలితాలు నిరాశాజనకంగా ఉన్నాయి. బీజేపీ ఎంపీ డీకే అరుణ సొంత ప్రాంతం గద్వాలలో ఏకంగా ఆరు వార్డులే బీజేపీ గెలుచుకోవడం పట్ల చర్చ సాగుతోంది. అలాగే కేంద్ర మంత్రి కరీం నగర్ కి చెందిన బండి సంజయ్ ప్రభావంతో అక్కడ ఒక్క మునిసిపాలిటీని గెలుచుకోలేకపోవడం మీద కూడా విశ్లేషణ సాగుతోంది. ఇవనే కాదు ఎనిమిది మంది ఎంపీలు ఇద్దరు కేంద్ర మంత్రులు రాజ్యసభ సభ్యులు, పార్టీలో అంకితభావంతో పనిచేసే ఎంతో మంది నాయకులు ఉన్నా కూడా మునిసిపాలిటీలలో బీజేపీ అనుకున్న స్థాయిలో తన ప్రభావం చూపించలేకపోవడం మీద తీవ్ర స్థాయిలో పార్టీలో మధనం సాగుతోంది అని అంటున్నారు.
