Begin typing your search above and press return to search.

రామచంద్రుడికే రాముడి పార్టీ పగ్గాలు!

వర్గాలు ఉండడం సామాజిక బలం ఉండడం ఎంత బలహీనమో ఒక్కోసారి రాజకీయంగా తెలిసి వస్తుంది.

By:  Tupaki Desk   |   1 July 2025 12:15 AM IST
రామచంద్రుడికే రాముడి పార్టీ పగ్గాలు!
X

వర్గాలు ఉండడం సామాజిక బలం ఉండడం ఎంత బలహీనమో ఒక్కోసారి రాజకీయంగా తెలిసి వస్తుంది. బలం ఉండడం బలహీనత ఏమిటి అనుకుంటే పొరపాటే. రాజకీయ గణితం లెక్కలు వేరు. అక్కడ ప్లస్ అంటే మైనస్ అవుతుంది. అందుకే తెలంగాణా బీజేపీ పగ్గాలు ఎంచక్కా ఏ వర్గమూ లేని రామచంద్రరావుకు దక్కాయి.

అయితే ఆయనకూ ఒక వర్గం ఉంది. అది బీజేపీకి ఆత్మ లాంటి ఆర్ఎస్ఎస్ వర్గం. అందుకే ఆయనకు అంత సులువుగా బీజేపీ అధ్యక్ష బాధ్యతలు లభించాయని అంటారు. ఇక తెలంగాణాలో చూస్తే బీజేపీ పార్టీ అధ్యక్ష పదవికి రేసులో ఉన్న వారు సామాన్యులా అంటే కానే కాదు. దిగ్గజ నేతలు. వెనకాల బలమైన వర్గాలు ఉన్నాయి

ఇక అనేక ఏళ్ళ పాటు మంత్రిగా పనిచేసి బీఆర్ ఎస్ లో నంబర్ టూ అనిపించుకుని బీజేపీలోకి వచ్చి మరీ ఉప ఎన్నికల్లో తొడగొట్టి గెలిచిన ఈటెల రాజేందర్ ఉన్నారు. ఆయన తాజాగా ఎంపీగా కూడా నెగ్గారు. బలమైన సామాజిక వర్గం అండ ఆయనకు ఉంది. ఆయన కన్ను బీజేపీ పీఠం మీద చాలాకాలంగా ఉంది.

అయితే అది ఎప్పటికీ ఆయనకు అందని పండుగానే మారింది అని తాజా ఎంపిక నిరూపించింది. ఇక నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా ఈ పదవి మీద టార్గెట్ చేశారు. ఆయనకూ చుక్కెదురు అయింది. కాంగ్రెస్ లో మంత్రిగా పనిచేసి బీజేపీలో తన రాజకీయాన్ని కొనసాగిస్తున్న డీకే అరుణ సైతం ప్రెసిడెంట్ కావాలని అనుకున్నారు.

ఇంకా రఘునందన్ రావు సాహా అనేక మంది నేతలు పోటీ పడ్డారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా ఈ పదవి కావాలని పట్టుబట్టారు. అయితే చిత్రంగా ఆ వర్గం ఈ వర్గం కొట్టుకుని ఆర్ఎస్ఎస్ వర్గం రామచంద్రరావుకు రాముడి పార్టీ పగ్గాలు అప్ప్గించారు అన్న చర్చ నడుస్తోంది. ఇక ఏ వర్గంలోనూ ఆయన లేకపోవడం ఒక ప్లస్ పాయింట్ అయితే ఏ వర్గం కట్టేంత బలం లేకపోవడం మరో ప్లస్ పాయింట్. చివరికి అదే రామచంద్రరావుకు బలంగా మారింది అని అంటున్నారు.

అందుకే బీసీ ఎంపీలు ముగ్గురునీ కాదని సామాజికవర్గం ప్రకారం చూసినా అందరినీ కాదని మరీ బ్రాహ్మణ నేతకు బీజేపీ పెద్దలు పట్టం కట్టారని అంటున్నారు. ఇక ఈ నియామకం వెనక బీజేపీ పెద్దల ఆలోచనలు ఏమిటి అన్న చర్చ కూడా నడుస్తోంది.

ఆయన వివాదరహితుడు కావడం ఆది నుంచి పార్టీ మనిషిగా ఉండడంతో పాటు అందరినీ కలుపుకుని పోయే సామర్థ్యం ఉన్న వారు అని అధినాయకత్వం భావించడం వల్లనే ఈ ఎంపిక జరిగింది అని అంటున్నారు. ఇక ఆయనకు క్షేత్ర స్థాయిలో అందరితోనూ మంచి పరిచయాలు ఉన్నాయని చెబుతారు. పార్టీ బలోపేతానికి ఆయన కట్టుబడి ఉన్నారని అంటారు.

ఇక చూస్తే బీసీ నేతగా ఉంటూ బీజేపీని అభివృద్ధి చేసిన బండి సంజయ్ నుంచి పార్టీ పగ్గాలు కిషన్ రెడ్డికి వెళ్లాయి. మళ్లీ బీసీకే వస్తాయని అంతా అనుకున్నారు. కానీ ఎవరూ ఊహించని విధంగా ఓసీ బ్రాహ్మణ అయిన రామచంద్రరావుకే దక్కడం విశేషం అని అంటున్నారు. ఇక్కడ బీజేపీ లెక్క పక్కాగా ఉందని విధేయతకే పెద్ద పీట అని అంటున్నారు.

పార్టీకి దూకుడుగా వ్యవహరించే నేతల వల్ల ప్రయోజనం ఉన్నా కూడా అది దీర్ఘకాలంగా కొంచెం ఇబ్బందిగా మారిందని అంటున్నారు. అందుకే ఈసారి ఏ వివాదాలకు తావు లేకుండా పార్టీని సాఫీగా నడిపిస్తారు అనే రామచంద్రరావుకు అప్పగించారు అని అంటున్నారు.