అంగ వంగ కళింగ ...మోడీ టార్గెట్ పక్కా ?
పశ్చిమ బెంగాల్ లో ప్రచారం చివరలో మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. అంగ వంగ కళింగ ప్రాంతాలు బీజేపీ ఖాతాలోనే అన్నారు.
By: Satya P | 27 April 2026 11:00 PM ISTమన రాష్ట్రాలను పాంతాలను ప్రాచీన కాలంలో అంగ వంగ ద్రవిడ ఇలా పిలుస్తూ ఉంటారు. ఆయా ప్రాంతాలలో సంస్కృతి భాషను బట్టి ఆ పేరు వచ్చింది. ఇక బీజేపీది అతి పెద్ద టార్గెట్ గా ఉంది. ఈ దేశంలో ఉన్న 28 రాష్ట్రాలతో పాటు ఎనిమిది కేంద్ర పాలిత ప్రాంతాలలో బీజేపీ జెండా ఎగరాలన్నది పార్టీ బృహత్ లక్ష్యం. అందులో ఇప్పటికి అయితే చాలా మటుకు సాధించింది. సొంతంగా బీజేపీకి ఈ రోజున దేశంలో సగం పైగా రాష్ట్రాలు ఉన్నాయి. మిత్రులతో కలసి ఎన్డీయే ఏలుబడిలో ఉన్న రాష్ట్రాలను కలుపుకుంటే మూడింట రెండు వంతుల రాష్ట్రాలు బీజేపీ పరం అయినట్లే. ఇక మిగిలిన వాటి మీద బీజేపీ ఫోకస్ గట్టిగా ఉంది.
అంగ కళింగ స్వాధీనం :
పశ్చిమ బెంగాల్ లో ప్రచారం చివరలో మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. అంగ వంగ కళింగ ప్రాంతాలు బీజేపీ ఖాతాలోనే అన్నారు. ఇందులో అంగ అంటే బీహార్ బీజేపీ సీఎం తో ఈ మధ్యనే వశం అయింది. కళింగ రాజ్యం అంటే ఒడిషా రెండేళ్ళ క్రితమే బీజేపీ దక్కించుకుంది. ఇపుడు వంగ దేశం అంటే పశ్చిమ బెంగాల్ మీద బీజేపీ ఆశలు బలంగా ఉన్నాయి దాంతో వంగను కూడా తామే పాలిస్తామంటూ మోడీ ధీమా వ్యక్తం చేశారు. అలా చూస్తే కనుక మమతా బెనర్జీని మాజీని చేయడం ద్వారా ఈసారి బెంగాల్ ని ఏలాలని బీజేపీ దృఢంగా నిర్ణయించుకుంది. దాంతో బీజేపీ బెంగాల్ ని గెలిచి తీరుతుందని మోడీ విశ్వాసాన్ని ప్రకటిస్తున్నారు.
బీజేపీ సీఎం ప్రమాణం :
తాను మళ్ళీ బెంగాల్ వచ్చేది ఎపుడో కూడా మోడీ చెప్పేశారు. తాను బీజేపీ సీఎం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసే కార్యక్రమానికే మళ్ళీ వస్తాను అని ఎన్నికల సభలో మోడీ చెప్పడం హైలెట్. దీనిని బట్టి బెంగాల్ ఫలితాల మీద బీజేపీ ఆశలు ఏ రేంజిలో ఉన్నాయో ఆలోచించాల్సిందే అని అంటున్నారు. మొదటి విడతలో ఈ నెల 23న జరిగిన ఎన్నికల్లో భారీ ఎత్తున పోలింగ్ జరిగింది. ఏకంగా 92 శాతం పోలింగ్ జరగడంతో బీజేపీకి ఆశలు పెరిగాయని అంటున్నారు. అదే తీరులో రెండవ విడతలో సైతం జనాలు పెద్ద ఎత్తున పోలింగ్ బూత్ లకు వచ్చి బీజేపీకి అనుకూలంగా ఓటు చేస్తారని కమల నాధులు అంచనా పెట్టుకుంటున్నారు అని అంటున్నారు. అందుకే మోడీ నోట అంగ వంగ కళింగ అన్న మాటలు వచ్చాయని చెబుతున్నారు.
నిజంగా జరిగితే :
అంగ వంగ కళింగ రాజ్యాలు 1977 దాకా కాంగ్రెస్ ఏలుబడిలో ఉండేవి. ఇందులో వంగ రాజ్యం 1977లో కాంగ్రెస్ చేజారి కమ్యూనిస్టుల పరం అయింది. ఆ తరువాత 2011లో చూస్తే మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ రాజ్యంలోకి వచ్చింది. ఇపుడు ఇక అంగ రాజ్యం అనబడే బీహార్ 1990 నుంచి కాంగ్రెస్ చేజారింది. ఒడిషాలో చూస్తే 2000 నుంచి కాంగ్రెస్ అధికారం కోల్పోయింది. ఇక బీజేపీ విషయం తీసుకుంటే మూడు రాష్ట్రాలను గెలుచుకుని కాంగ్రెస్ ఒకనాటి వైభోగం సాధించాలని ఆరాటపడుతోంది. చూడాలి మరి పశ్చిమ బెంగాల్ ఓటర్ల తీర్పు ఏ విధంగా ఉండబోతోందో.
