బీజేపీలో లోకల్ - నాన్‌లోకల్ రగడ ..!
పార్టీ రాష్ట్ర చీఫ్ పురందేశ్వరి.. ఒక తరహాలో ఉంటే.. నాయకులు మరో తరహాలో ఉన్నారన్నది సుస్పష్టం గా తెలుస్తోందని పార్టీ అంతర్గత వ్యవహారాలు చూసే నాయకుడు ఒకరు చెప్పారు.
By: Tupaki Desk | 30 April 2025 10:01 PM ISTఏపీలో బీజేపీ పుంజుకునే దశలో ఉందని కేంద్రంలోని బీజేపీ పెద్దలు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఏపీకి అవసరమైన నిధులు.. పనులు.. పథకాలు కూడా కేటాయిస్తున్నామని పదే పదే వెల్లడిస్తున్నారు. ఫలితం గా ఏపీలో బీజేపీ పుంజుకుని.. పార్టీ వచ్చే ఎన్నికల నాటికి బలోపేతం కావాలని కూడా ఆకాంక్షిస్తున్నారు. మరి పెద్దలు చెప్పినట్టుగా.. పార్టీ నాయకులు వ్యవహరిస్తున్నారా? పార్టీని బలోపేతం చేసే దిశగా ముందుకు సాగుతున్నారా? అంటే.. కాదనే సమాధానమే వస్తోంది.
పార్టీ రాష్ట్ర చీఫ్ పురందేశ్వరి.. ఒక తరహాలో ఉంటే.. నాయకులు మరో తరహాలో ఉన్నారన్నది సుస్పష్టం గా తెలుస్తోందని పార్టీ అంతర్గత వ్యవహారాలు చూసే నాయకుడు ఒకరు చెప్పారు. ఉత్తరాంధ్రలో లోకల్ నాన్ లోకల్ నాయకుల మధ్య వివాదాలు జరుగుతున్నాయని.. ఒకరంటే ఒకరికి పడడం లేదని చెబుతు న్నారు. అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్.. లోకల్ నాయకులను పట్టించుకోవడం లేదని.. ఆయనను ఇక్కడివారు కూడా దూరం పెట్టారని అంటున్నారు.
ముఖ్యంగా ఏ ఒక్క విషయంలోనూ కలివిడిగా నాయకులు ముందుకు సాగడం లేదన్న వాదన బలంగా వినిపిస్తుండడం గమనార్హం. అంతేకాదు.. ఎవరికి వారు రాజకీయాలు చేసుకుంటూ.. ముందుకు సాగుతు న్నారని.. దీనివల్ల ఎలాంటి ఫలితమూ లభించడం లేదని అంటున్నారు. మరోవైపు రాయలసీమలో లోకల్ నాయకులు.. పెత్తనం దిశగా అడుగులు వేస్తున్నారని.. ఆర్థికంగా పుంజుకునే కార్యక్రమాలకు పెద్దపీట వేస్తున్నారని చెబుతున్నారు. ఇక్కడ జరగుతున్న రాజకీయాలు.. పార్టీని నష్టపరిచేలా ఉన్నాయని అంటున్నారు.
ఇక, కోస్తాలో ఎవరికి వారే అన్నట్టుగా వ్యవహరిస్తున్నవైనం కళ్లకు కడుతోందని చెబుతున్నారు. వివాదాలు, విభేదాలు.. ఈ జిల్లాల్లో కనిపించకపోయినా.. నాయకులు మాత్రం ఎవరికివారుగా పనులు చేస్తున్నారని.. ప్రజల్లోకి వెళ్లేందుకు.. పార్టీ చేపడుతున్న కార్యక్రమాలను వివరించేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని కూడా అంటున్నారు. మొత్తంగా రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి డోలాయమానంలో పడిందన్నది సీనియర్ నాయకుడు, పార్టీ అంతర్గత వ్యవహారాలు చూసే నేత చెబుతుండడం గమనార్హం.
