బీజేపీకి ఎప్పటికీ అర్థం కాని దక్షిణ భారతం !
దక్షిణాది రాష్ట్రాలు ప్రత్యేకంగా చూడాల్సి ఉంది. మొదటి నుంచి ఇక్కడ రాజకీయ చైతన్యం ఎక్కువ. అంతే కాదు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ప్రత్యేకమైన భావజాలాన్ని కలిగి ఉన్నాయి.
By: Satya P | 6 Jun 2026 9:09 AM ISTభారతీయ జనతా పార్టీని ఉత్తరాది పార్టీ అని అంటారు. ఇపుడు కనిపిస్తున్న రాజకీయ సన్నివేశం చూస్తే కనుక అదే నిజం అనిపిస్తుంది. దక్షిణ భారత దేశంలో ఈ రోజున బీజేపీ ఎక్కడ ఉంది అన్నది కూడా పెద్ద ప్రశ్న. ఏపీలో బీజేపీ పొత్తుల బలంతోనే నెట్టుకుని వస్తోంది. తెలంగాణాలో 2024 లో కనిపించిన బలం కాస్తా ఉప ఎన్నికల్లో స్థానిక ఎన్నికల్లో తేలిపోయింది. కేరళలో పాతిక శాతం ఓటు షేర్ కనీసంగా ఎన్నో కొన్ని సీట్లు వస్తాయని అనుకుంటే ఆశించినది జరగలేదు. తమిళనాడులో 2021లో వచ్చిన నాలుగు సీట్లు కూడా ఈసారి మూడు తగ్గి ఒక్కటిగా నంబర్ చేరింది. కర్ణాటకలో చూస్తే విపక్షంలో ఉంది. ఇలా బీజేపీకి సౌత్ స్టేట్స్ అన్నీ ఫేస్ టర్నింగ్ ఇచ్చేసుకుంటున్నాయని అంటున్నారు.
సెంటిమెంట్స్ పట్టవా :
దక్షిణాది రాష్ట్రాలు ప్రత్యేకంగా చూడాల్సి ఉంది. మొదటి నుంచి ఇక్కడ రాజకీయ చైతన్యం ఎక్కువ. అంతే కాదు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ప్రత్యేకమైన భావజాలాన్ని కలిగి ఉన్నాయి. ఇవన్నీ వారి ఆశలు ఆకాంక్షలుగా కూడా చెప్పుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ తరహా ప్రాంతీయతను వారి సెంటిమెంట్స్ ని వారి మనోభావాలను అర్ధం చేసుకోవడంలో బీజేపీ విఫలం అవుతోంది అని అంటున్నారు. పైగా బీజేపీ తన ఉత్తరాది భావాలనే దక్షిణాదినా అమలు చేయాలని చూడడం వల్ల రాజకీయంగా సక్సెస్ కాలేకపోతోంది అని అంటున్నారు.
ద్రవిడ వాదంతోనే :
తమిళనాడులో తాజాగా బీజేపీకి రాజీనామా చేసిన అన్నామలై బీజేపీ మీద నిశితమైన విమర్శలు చేశారు. తమిళనాడులోని వాదాన్ని సెంటిమెంట్స్ ని బీజేపీ పట్టించుకోలేకపోయిందని ఆయన అన్నారు. తాను మాత్రం తమిళనాడు ఫస్ట్ అన్నట్లుగానే ముందుకు సాగుతాను అని చెప్పారు. బీజేపీని తమిళనాడు సెంటిమెంట్స్ ని జోడించి ముందుకు తీసుకుని పోవడంతో తాను శాయశక్తులా ప్రయత్నం చేశాను కానీ సాధించలేకపోయాను అని కూడా అన్నామలై అన్నారు. ఆయన మాటలను బట్టి చూస్తే బీజేపీకి స్థానిక అంశాల మీద సెంటిమెంట్ల మీద పట్టింపు లేదా లేక తమ భావజాలమే అక్కడ కూడా విస్తరించాలని ఆలోచించి అందులో ఫెయిల్ అవుతోందా అన్న చర్చ సాగుతోంది.
తెలంగాణా అస్తిత్వం :
అదే విధంగా చూస్తే తెలంగాణాలో అక్కడ తెలంగాణా అస్తిత్వం బలమైన నినాదంగా ఉంటుంది. బీజేపీ ఇక్కడ కూడా తన భావజాలం వ్యాప్తికే చూస్తోంది తప్పించి లోకల్ గా ఉన్న నినాదాలను విధానాలను గమనంలోకి తీసుకోవడంలేదని అంటున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ మాత్రం ప్రాంతీయ సెంటిమెంట్లను గౌరవిస్తూ వాటికి అనుగుణంగా తమ రాష్ట్రాల యూనిట్లతో కలిసి పనిచేస్తోంది అని అంటున్నారు. బీజేపీ ఒకే దేశం ఒకే పార్టీ ఒకే భావజాలం నినాదమే అన్ని విధాలుగా దక్షిణాదిన ఇబ్బంది పెడుతోంది అని అంటున్నారు.
ఏపీ సెంటిమెంట్స్ అవే :
ఇక ఏపీలో చూస్తే పొత్తులతో బీజేపీ గెలిచింది కానీ ఆ పార్టీ ప్రత్యేక హోదా విషయంలో జనాల సెంటిమెంట్ ని దెబ్బ కొట్టింది అన్న ఆవేదన అయితే ఆంధ్రులలో ఉంది. అలాగే ఢిల్లీ కంటే పెద్ద రాజధాని నిర్మిస్తామని నిధులిస్తామని చెప్పినా అమలు కాలేదు. విభజన హామీల సంగతి సరే సరిగా ఉంది. జాతీయ ప్రాజెక్టు పోలవరం పుష్కర కాలం అయినా పూర్తి కాలేదు. ఇక ఏపీ ప్రజల ఆకాంక్షలు అయితే నెరవేరడం లేదు అన్న అసంతృప్తి ఉందని చెబుతున్నారు.
ప్రాంతీయ భాషలోనే :
ప్రాంతీయ భాషను భావాన్ని అర్థం చేసుకుంటేనే తప్ప విజయాలు సమకూరవు. తమిళనాడులో తాజా ఫలితాలు బీజేపీకి అక్కడ చోటు లేదని తెలియచెప్పాయని అంటున్నారు. దానిని గ్రహించిన మీదటనే అన్నామలై పార్టీకి దూరం జరిగారు అని చెబుతున్నారు. మరో వైపు చూస్తే తెలంగాణాలో బీజేపీ ఏమంత గొప్పగా లేదు. ఇక కర్ణాటకలో జేడీఎస్ తో పొత్తులో బీజేపీ ఉంది. డీకే శివ కుమార్ సీఎం అయ్యారు. దాంతో అక్కడ కత్తి మీద సాముగానే రాజకీయం ఉండబోతోంది అని అంటున్నారు.
