Begin typing your search above and press return to search.

ఆ రెండు రాష్ట్రాలు బీజేపీ కల...లక్ష్యం పెద్దది !

రాజకీయ పార్టీ అన్నాక పాలించాలని ఉంటుంది. అధికారం హస్తగతం చేసుకోవాలని ఉబలాటంగా ఉంటుంది.

By:  Tupaki Desk   |   9 Jun 2025 12:00 PM IST
ఆ రెండు రాష్ట్రాలు బీజేపీ కల...లక్ష్యం పెద్దది !
X

రాజకీయ పార్టీ అన్నాక పాలించాలని ఉంటుంది. అధికారం హస్తగతం చేసుకోవాలని ఉబలాటంగా ఉంటుంది. అంతే కాదు దేశమంతా తమ పార్టీ పతాకం ఎగరేయాలని కూడా ఉంటుంది. అయితే సాధ్యాసాధ్యాలు సమీకరణలు సవాళ్ళూ ఇలా ఎన్నో ఉంటాయి. దేశంలో బీజేపీ ఆ రెండు రాష్ట్రాల మీద గురి పెట్టింది. కల కూడా సుదీర్ఘమైనది. నిజం చెప్పాలీ అంటే 2021లో బీజేపీ ఈ రెండు రాష్ట్రాలలో పాగా వేయాలని చూసింది. అయితే ఆ చాన్స్ మిస్ అయింది. అవే తమిళనాడు, పశ్చిమ బెంగాల్.

తమిళనాడులో దిగ్గజ నేత కరుణానిధి మరణం ఒక వైపు మరో వైపు అన్నాడీఎంకే నేత జయలలిత అంతకు ముందే మృతి చెందడంతో ద్రవిడ పార్టీలలో నాయకత్వ సంక్షోభం ఉందని దాంతో తాము అన్నా డీఎంకేతో పొత్తుతో అధికారంలోకి రావచ్చు అని బీజేపీ కలలు కన్నది. కానీ కరుణానిధి అసలు సిసలు వారసుడిగా స్టాలిన్ నిలిచి బీజేపీకి గట్టి సవాల్ విసిరారు.

దాంతో బీజేపీ అన్న డీఎంకే కూటమి ఎన్నికల్లో ఓటమి చెందింది. అలా తమిళ సీమలో బీజేపీ కలను మరో అయిదేళ్ళు వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ఇక పశ్చిమ బెంగాల్ లో చూస్తే 2021 నాటికి రెండు సార్లు అధికారంలోకి వచ్చిన మమతా బెనర్జీ మీద తీవ్రమైన ప్రజా వ్యతిరేకత ఉంటుందని బీజేపీ ఊహించి బోర్లా పడింది అయితే మూడు సీట్ల నుంచి 78 సీట్ల దాకా ఎగబాకడం బీజేపీకి భారీ ఊరటను ఇచ్చింది.

ఇక 2021లో ఈ రెండు రాష్ట్రాలలో ఎన్నికలు జరగనున్నాయి. దాంతో ఈసారి అయిన తమ కల నెరవేరక పోతుందా అన్నది బీజేపీ పెద్దల ఆరాటంగా ఉంది. అందుకే తరచూ అయితే పశ్చిమ బెంగాల్ లేకపోతే తమిళనాడులో వరస పర్యటనలు చేస్తున్నారు.

తాజాగా తమిళనాడు పర్యటనలో ఉన్న బీజేపీ పెద్ద హోం మంత్రి అయిన అమిత్ షా ఈసారి తమిళనాడు పశ్చిమ బెంగాల్ రెండూ ఎన్డీయే ఖాతాలోకి వస్తాయని ధీమా వ్యక్తం చేశారు 2026లో అటు మమత ఇటు స్టాలిన్ మాజీలు కావడం ఖాయమని కూడా ఆయన స్పష్టంగా చెబుతున్నారు. దాదాపుగా 6.80 లక్షల కోట్లు ఇచ్చినప్పటికీ కేంద్రం ఏమీ ఇవ్వలేదని చెప్పడం స్టాలిన్ కి అలవాటు అయిందని ఆయన విమర్శించారు.

అయిదేళ్ల స్టాలిన్ పాలన పూర్తిగా ఫెయిల్ అయింది అని ఆయన విమర్శించారు. లా అండ్ ఆర్డర్ తమిళనాడులో గతి తప్పిందని ఆయన తీవ్ర విమర్శలు చేశారు. పశ్చిమ కొంగు ప్రాంతం పరిధిలోని పలు గ్రామాల్లో వృద్ధుల టార్గెటెడ్ హత్యలను పోలీసులు ఆపలేకపోతున్నారని ఆయన ఆరోపించారు. ఈసారి డీఎంకేని గద్దె దించాలన్నదే బీజేపీ శ్రీణుల శపధం అని ఆయన అన్నారు. స్టాలిన్ ని దించే జోడీగా బీజేపీ అన్నా డీఎంకే ఉన్నాయని ఆయన దృఢ విశ్వాసం వ్యక్తం చేశారు. మొత్తానికి చూస్తే బీజేపీకి ఆ రాష్ట్రాలలో అధికారం ఒక కలగా ఉంది. లక్ష్యం చూస్తే భారీగా ఉంది. దాన్ని సాధించేందుకు బీజేపీ ఏ వ్యూహాలను అనుసరిస్తుంది అన్నదే ఇపుడు అందరికీ ఆసక్తిగా మారింది.