సక్సెస్ కి బ్రాండ్ అంబాసిడర్ బీజేపీనా ?
బీజేపీకి రాజకీయ దశ బాగానే ఉంటుంది. ఆ పార్టీ లక్ ఏంటి అంటే తనతో కలిసిన పార్టీలను సైతం విజయం అంచులకు చేర్చడం.
By: Tupaki Desk | 20 May 2025 4:00 PM ISTబీజేపీకి రాజకీయ దశ బాగానే ఉంటుంది. ఆ పార్టీ లక్ ఏంటి అంటే తనతో కలిసిన పార్టీలను సైతం విజయం అంచులకు చేర్చడం. ఇక బీజేపీ వ్యూహాలు అయితే పక్కాగా ఉంటాయి. అవి ప్రత్యర్ధుల అంచనాలకు అందవు. లేకపోతే 1984లో కేవలం రెండు సీట్లకే పరిమితం అయిన బీజేపీ 1989 నాటికి 85 సీట్లను సాధించడం అంటే ఆషామాషీ వ్యవహారం కానే కాదు.
ఇక బీజేపీకి బలం లేని చోట ఏ మాత్రం మొహమాటపడకుండా పొత్తులను ఆశ్రయిస్తుంది. అలా కలసి వచ్చిన మిత్రులతో కలసి తానూ లాభపడుతుంది. దక్షిణాదిన బీజేపీకి బలం చాలా తక్కువ అయినా బలమైన తెలుగుదేశంతో జతకట్టి ఆ పార్టీ విజయాలను దక్కించుకుంటోంది. టీడీపీకి సక్సెస్ ఇస్తూ వస్తోంది.
ఉమ్మడి ఏపీలో 1999లో బీజేపీ టీడీపీ కలసి సక్సెస్ కొట్టాయి. అలా బాబు రెండోసారి సీఎం అయ్యారు. ఇక 2014లో మరోసారి అదే మ్యాజిక్ రిపీట్ అయింది. కేంద్రంలో మోడీ ఏపీలో బాబు విజయం సాధించారు. 2024లో కూడా సేమ్ సీన్ అందరికీ ఆశ్చర్యపరుస్తూ కొనసాగింది.
ఇలా చూసుకుంటే కనుక బీజేపీకి ఏపీలో బలం ఏముంది అన్నది ప్రశ్న కాదు. ఆ పార్టీ అందించే నైతిక మద్దతు అలాగే ఆ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న బలమైన పార్టీగా అందించే సహకారం ఇవన్నీ కూడా కొలమానంగా తీసుకోవాలని అంటున్నారు.
బీజేపీ ఏపీ రాజకీయాల్లో కృష్ణుడు పాత్ర పోషిస్తోంది అన్న మాట. 2019 ఎన్నికల్లో తమను కాదని వెళ్ళిన టీడీపీని ఓడించాలని కసిగా బీజేపీ పనిచేసింది అని అంటారు. ఫలితంగా ఏపీలో అప్పటికే జనంలో పాజిటివిటీ ఉన్న వైసీపీ అత్యద్భుతమైన రాజకీయ ప్రదర్శన చేసి ఏకంగా 151 సీట్లను సాధించి అధికారంలోకి వచ్చింది.
అయితే వైసీపీ ఒంటరిగానే పోరాడిన వెనక బేజీపీ మోరల్ సపోర్టు ఉందని ప్రచారం సాగింది 2024 ఎన్నికల్లో అన్ని విషయాలను ఆకళింపు చేసుకున్న మీదటనే చాలా విషయాలకు తలొగ్గి మరీ తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకుంది. కలసి ఉంటే కలదు సుఖం అన్న సూత్రాన్ని నమ్మి ఈ రోజున అధికారం అందుకుంది.
ఇక 2014లో మొదట బీజేపీ పొత్తు కోసం చూసింది వైసీపీ వైపే అని ఒక ప్రచారంలో ఉన్న మాట. వైసీపీ కాదంటేనే టీడీపీ వైపు వెళ్ళారు అట అని భోగట్టాలుగా ప్రచారంలో ఉన్న మాట. ఇక 2024లోనూ అదే జరిగింది అని అంటారు. వైసీపీ తనకు ఉన్న మైనారిటీ ఓటు బ్యాంక్ ని చూసుకుని పొత్తులకు దూరం అయిందని చెబుతారు.
బీజేపీకి అయితే పొత్తులు కావాలి. తాము బలపడాలి అని ఉంది. అందుకే ఆ పార్టీ చేసిన దాంట్లో తప్పు లేదని అంటారు. ఇదంతా ఎందుకు అంటే మూడున్నర దశాబ్దాల సుదీర్ఘమైన రాజకీయ అనుభవం కలిగిన నాయకుడుగా ఉన్న నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి బీజేపీ వైసీపీ పొత్తుల విషయంలో తాజాగా చేసిన వ్యాఖ్యలు అని అంటున్నారు.
బీజేపీతో పొత్తు పెట్టుకోకుండా వైసీపీ తప్పు చేసింది అని ఆయన మాట్లాడారు. మరోసారి అలాంటి అవకాశం వస్తే పొత్తు పెట్టుకోవాలని తాము చెబుతామని ఆయన అంటున్నారు. అంటే బీజేపీతో పొత్తు అంటే సూపర్ హిట్టే అన్నది ఆయన మాటల ద్వారా వ్యక్తం అవుతోంది.
మొత్తానికి చారిత్రాత్మక తప్పిదాలుగా వైసీపీ బీజేపీతో పొత్తు కలపకపోవడాన్ని ఆ పార్టీ నేతలు చూస్తున్నారు అని అంటున్నారు. అయితే 2004లో ఉమ్మడి ఏపీలో బీజేపీ టీడీపీ పొత్తు పెట్టుకున్నా కేంద్రంలో వాజ్ పేయి ప్రధాని కాలేదు, ఏపీలో బాబు మాజీ సీఎం అయిపోయారు.
సో అన్ని వేళలా పొత్తులు కలసిరావు. కానీ కేంద్రంలో ఈ రోజుకీ బలంగా ఉన్న బీజేపీ దాని వెనక ఉన్న ఆరెస్సెస్ ఒక సంఘటిత శక్తిగా పనిచేస్తున్న వైనం. బలమైన ప్రచార మాధ్యమాలు కార్పోరేట్ శక్తుల వెన్ను దన్ను మద్దతు ఇవ్వన్నీ ఉన్న కమలం పార్టీతో దోస్తీ చేయడం ఏ రాజకీయ పార్టీకి అయినా మేలు చేస్తుంది అన్నదే ఎక్కువ సార్లు రుజువు అయిన సత్యం. ఆ విషయాల మీద రీసెర్చ్ చేశారు కాబట్టే బాబు కమలంతో తన దోస్తీ అని గట్టిగా చెబుతున్నారు. వైసీపీ అధినాయకత్వం మాత్రం ఇంకా రొటీన్ పాలిటిక్స్ నే నమ్ముకుంటోంది. మరి పార్టీలో హితైషులు చేస్తున్న సూచనలు అధినాయకత్వంలో మార్పుని తెస్తాయా అన్నదే చూడాల్సి ఉంది.
