Begin typing your search above and press return to search.

బీజేపీ 'రాజ‌కీయం' ఇలా కూడా ఉంటుందా?!

రాజకీయాలు చాలా మంది.. చాలా పార్టీలు కూడా చేస్తాయి. కానీ, బీజేపీ చేసే రాజ‌కీయం ముందు.. అవ‌న్నీ దిగ‌దుడుపేన‌ని అంటున్నారు విశ్లేష‌కులు.

By:  Garuda Media   |   16 Jun 2026 5:00 AM IST
బీజేపీ రాజ‌కీయం ఇలా కూడా ఉంటుందా?!
X

రాజకీయాలు చాలా మంది.. చాలా పార్టీలు కూడా చేస్తాయి. కానీ, బీజేపీ చేసే రాజ‌కీయం ముందు.. అవ‌న్నీ దిగ‌దుడుపేన‌ని అంటున్నారు విశ్లేష‌కులు. గ‌తంలో మ‌హారాష్ట్ర‌, త‌మిళ‌నాడు, అస్సాం.. తాజాగా బెంగాల్ రాజ‌కీయాల‌ను ప‌రిశీలిస్తున్న వారు.. బీజేపీ రాజ‌కీయం అంటే ఇలానే ఉంటుంద‌ని వ్యాఖ్యానిస్తున్నారు. గ‌తంలో శివ‌సేన‌ను రెండుగా చీల్చి.. ఏక్‌నాథ్ షిండేకు పార్టీని క‌ట్ట‌బెట్టేలా చ‌క్రం తిప్పారు. ఈ విష‌యాన్ని ఏక్‌నాథ్ షిండేనే చెప్పారు. నా వెనుక అమిత‌షా ఉన్నారు.. అని ఆయ‌న బ‌హిరంగ వేదిక‌పై ప్ర‌క‌టించారు.

ఇక‌, త‌మిళ‌నాడులో జ‌య ల‌లిత మ‌ర‌ణం త‌ర్వాత‌.. అన్నాడీఎంకేలో చీలిక తీసుకువ‌చ్చి.. ప‌ళ‌ని స్వామి వ‌ర్గానికి అస‌లు పార్టీగా గుర్తింపు ఇచ్చి.. తెర‌వెనుక ఆయ‌న బీజేపీతో క‌లిసి ముందుకుసాగేలా వ్య‌వ‌హ‌రించారు. త‌ద్వారా త‌మిళ‌నాడులో క‌మ‌ల వికాసం కోసం ప్ర‌య‌త్నించార‌న్న‌ది జ‌గమెరిగిన స‌త్యం. అస్సాంలోనూ త‌మ‌కు ఆస‌రా ఇచ్చిన పార్టీని అస్సాం గ‌ణ ప‌రిష‌త్‌ను అండ‌గా పెట్టుకుని క‌మ‌ల నాథులు రాష్ట్రంలో విస్త‌రించారు. త‌ర్వాత‌.. త‌ర్వాత‌.. ఆ పార్టీని చీల్చి చెండాడి.. నేడు తృతీయ ప‌క్షానికి చేర్చారు. నేడు గ‌ణ ప‌రిష‌త్ మాటే వినిపించ‌ని ప‌రిస్థితివ‌చ్చింది.

ఇక తాజాగా..

తాజాగా బెంగాల్‌లో కొలువు దీరిన బీజేపీ.. అక్క‌డి ప్ర‌ధాన ప‌క్షంగా మారిన తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీలో చీలిక తెచ్చి.. ఎంపీలు , ఎమ్మెల్యేల‌ను కూడా విడ‌దీసింద‌న్న వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. 80 మంది ఎమ్మెల్యేల్లో 64 మంది రితిబ్ర‌త బెన‌ర్జీ నేతృత్వం లో, 28 మంది ఎంపీల్లో 20 మంది క‌కోలీ ఘోష్ నేతృత్వంలో విడిపోయారు. వీరి ల‌క్ష్యం.. బీజేపీకి అనుకూలంగా మారి.. ఆ పార్టీలో విలీనం కావ‌డం. అయితే.. ఇక్క‌డి వ‌ర‌కు క‌థ బాగానే జ‌రిగిపోయినా.. తొలి ద‌శ ప‌ర్వం బాగానే సాగింది. కానీ, రెండో ద‌శ అంటే.. బీజేపీలో విలీనం ప్ర‌తిపాద‌న‌కు వ‌చ్చే స‌రికి యూట‌ర్న్ తీసుకున్నారు. ఇదే అస‌లు సిస‌లు రాజకీయం అంటున్నారు ప‌రిశీల‌కులు.

నిన్న‌టి ఎన్నిక‌ల‌కు ముందు వ‌ర‌కు టీఎంసీ ఎంపీల‌ను దొంగ‌ల‌ని, ఎమ్మెల్యేల‌ను అక్ర‌మార్కుల‌ని బీజేపీ ప్ర‌చారం చేసింది. అలాంటివారిని హ‌ఠాత్తుగా త‌మ పార్టీలో చేర్చుకుంటే ఇబ్బందితోపాటు విమ‌ర్శ‌లు కూడా వ‌స్తాయ‌ని గుర్తించిన క‌మ‌ల నాథులు వ్యూహాత్మ‌కంగా చ‌క్రం తిప్పారు. త‌మ రాజ‌కీయ చాతుర్యానికి ప‌దును పెట్టారు. ఈ క్ర‌మంలోనే అనూహ్య‌మైన ఘ‌ట‌న‌.. దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ చేయ‌ని ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఇలా కూడా జ‌రుగుతుందా? అని అనిపించేలా ఈ ప‌రిణామం చోటు చేసుకోవ‌డం గ‌మ‌నార్హం.

ఏం జ‌రిగింది?

టీఎంసీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన 20 మంది ఎంపీలు.. ఏమాత్రం గుర్తింపు లేని.. అస‌లు ప్ర‌జ‌ల్లో ఉనికి కూడా లేని పార్టీలో చేరిపోయారు. వాస్త‌వానికి ఇంత మంది ఎంపీలు.. ఒక పార్టీలో విలీనం అయ్యారంటే.. ఆపార్టీకి గుర్తింపు ఉంటుంద‌ని అంద‌రూ అనుకుంటారు. కానీ, ఎన్నిక‌ల సంఘంలో కానీ.. ఇటు ప్ర‌జ‌ల్లో కానీ. ఎలాంటి గుర్తింపులేని 'నేషనల్‌ సిటిజన్స్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా'లో విలీనం అయ్యారు. ఈ పార్టీని ఎన్నిక‌ల సంఘం ఇప్ప‌టికీ గుర్తించ‌లేదు. క‌నీసం జెండా అజెండాల‌ను కూడా గుర్తించ‌లేదు. అయినా.. ఈ 20 మంది ఎంపీలు.. ఈపార్టీలో విలీనం అయిపోయి.. స్పీక‌ర్‌ను క‌లిసి.. త‌మ‌కు లోక్‌స‌భ‌లో ప్ర‌త్యేక సీట్లు ఏర్పాటుచేయాల‌ని.. ప్ర‌ధాని మోడీ నేతృత్వంలో దేశానికి సేవ చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. దీంతో స్పీక‌ర్‌.. త‌గు నిర్ణ‌యం తీసుకుంటామ‌ని ప్ర‌క‌టించారు.

త‌ర్వాత ఏం జ‌రుగుతుంది?

అయితే.. ఎలాంటి గుర్తింపు లేని పార్టీలో చేరేందుకు ఆ 20 మంది ఎంపీలు ఏమైనా అమాయ‌కులా? అంటే.. కాదు!. ఇదంతా తెర‌వెనుక‌.. వ్యూహాత్మ‌క రాజ‌కీయాల‌ను న‌డిపిస్తున్న 'పెద్ద‌ల‌' సూచ‌న‌ల మేర‌కు జ‌రిగిందేన‌ని జాతీయ మీడియా పేర్కొంది. ఈ నేషనల్‌ సిటిజన్స్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా పార్టీ.. తురుపు ముక్క‌. ఎక్క‌డ ఎన్నిక‌లు ఉంటే.. అక్క‌డ కాంగ్రెస్‌ను దెబ్బ‌తీసేందుకు మైనారిటీ ఓట్ల‌ను దూసుకునేందుకు ప్ర‌య‌త్నిస్తుంది. ఈ క్ర‌మంలో ఆ పార్టీలో చేర్చ‌డం ద్వారా.. త‌మ‌పై వ‌చ్చే విమ‌ర్శ‌ల‌ను బీజేపీ తెలివిగా త‌ప్పించుకుంది. అంతేకాదు.. త‌మ్ముడు త‌నోడైతే.. ఎక్క‌డ కూర్చున్నా.. అన్న‌ట్టుగా ఈ 20 మంది ఎక్క‌డున్నా.. త‌మ‌కు మ‌ద్ద‌తు ఇస్తార‌న్న‌ది బీజేపీ న‌మ్మ‌కం. ఇక‌, త‌త్వ‌ర‌లోనే ఈ నేషనల్‌ సిటిజన్స్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా పార్టీకి గుర్తింపు ఇస్తారా? అంటే.. ఇప్పించి.. త‌న‌లోనే విలీనం చేసుకునేందుకు బీజేపీ ప్లాన్ చేసింద‌ని అంటున్నారు. సో.. ఇదీ.. బీజేపీ రాజ‌కీయం!!.