Begin typing your search above and press return to search.

మళ్ళీ చిన్నమ్మేనా ?

దేశంలో ఏకంగా 14 రాష్ట్రాలకు బీజేపీ కొత్త అధ్యక్షులను ఎన్నుకునేందుకు రంగం సిద్ధం అయింది.

By:  Tupaki Desk   |   28 Jun 2025 11:56 AM IST
మళ్ళీ చిన్నమ్మేనా ?
X

దేశంలో ఏకంగా 14 రాష్ట్రాలకు బీజేపీ కొత్త అధ్యక్షులను ఎన్నుకునేందుకు రంగం సిద్ధం అయింది. జూలై 1న ఎన్నికతో మొత్తానికి మొత్తం 14 రాష్ట్రాలలో కొత్త అధ్యక్షులు వస్తారు దానికి సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ ని కేంద్ర బీజేపీ నాయకత్వం తాజాగా విడుదల చేసింది. దీని ప్రకారం చూస్తే కనుక ఈ నెల 29న ఆయా రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులను ఎన్నిక కోసం నోటిఫికేషన్ ని విడుదల చేస్తారు. ఈ నెల 30న అధ్యక్ష పదవి కోసం పోటీ పడే వారి నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు.

ఎన్నికను జూలై 1న నిర్వహిస్తారు. ఈ ఎన్నికల్లో పోటీ పడే వారి విషయంలో చూస్తే ఏకాభిప్రాయానికే ఎక్కువగా అవకాశం ఉంటుంది అని అంటున్నారు. ప్రత్యేకించి బీజేపీ జాతీయ అధినాయకత్వం సీల్డ్ కవర్ కల్చర్ ని ప్రవేశపెట్టదు కానీ ఆయా రాష్ట్రాలకు ఎవరు అధ్యక్షులుగా ఉంటే బాగుంటుందో సూచిస్తుంది అని అంటున్నారు.

అలా హైకమాండ్ పెద్దలు చెప్పిన పేరుకు భిన్నంగా ఎవరూ వ్యవహరించే అవకాశాలు అయితే అసలు ఉండవు. దాంతో మొత్తానికి ఏకాభిప్రాయానికే అంతా రావాల్సి ఉంటుంది అని అంటున్నారు. ఇక ఏపీ విషయానికి వస్తే ప్రస్తుత అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరినే తిరిగి కొనసాగిస్తారు అని అంటున్నారు. ఆమె 2023 జూలైలో బాధ్యతలు స్వీకరించారు. బీజేపీ నియమావళి ప్రకారం రెండేళ్ల పాటు అధ్యక్ష పదవిలో ఉంటారు. అయితే మరో రెండేళ్ళ పాటు కూడా వారికి చాన్స్ వరసగా ఇవ్వవచ్చు. అలా పురందేశ్వరినే మళ్ళీ ప్రెసిడెంట్ చేయాలని ఆ పార్టీ కేంద్ర నాయకత్వం ఆసక్తిగా ఉందని అంటున్నారు.

పురంధేశ్వరి 2023లో బాధ్యతలు స్వీకరించాక గతంలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా ఎనిమిది మంది ఎమ్మెల్యేలు గెలిచారు. ఇక ఎన్డీయే ప్రభుత్వం ఏపీలో వచ్చింది. దాంతో ఇద్దరు ఏపీ నుంచి రాజ్యసభకు వెళ్ళారు. ఆమె బలమైన సామాజిక వర్గానికి చెందిన వారు.

వివాదాలకు దూరంగా ఉంటారు. ఏపీలో కూటమి పార్టీల మధ్య మంచి సయోధ్య ఉంది. దానిని అలా కొనసాగించేలా ఆమె చూస్తున్నారు. ఇపుడున్న పరిస్థితుల్లో ఆమె కంటే మంచి అభ్యర్ధి ఎవరున్నారు అన్న చర్చ కూడా ఉంది. వచ్చే ఏడాది స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. దాంతో పొత్తుల వంటి వాటి విషయంలో టీడీపీతో కో ఆర్డినేట్ చేసుకోవాలంటే ఆమె అధ్యక్షురాలిగా ఉండడమే బెటర్ అని ఆలోచిస్తున్నారు.

ఆమెను కాదని ఎవరిని తెచ్చినా మళ్లీ కొత్తగా ఉంటుందని పైగా టీడీపీతో కలసి పనిచేసే విషయంలో ఎలా ఉంటుందో అన్న చర్చ కూడా ఉంది. ఇక కేంద్ర మంత్రిగా పనిచేసిన పురందేశ్వరి ఎన్టీఆర్ కుమార్తె. ఆ ఇమేజ్ కూడా ఆమెకు ఉంది. ఇక ఏపీలోని కూటమి పార్టీలు కూడా ఆమె అధ్యక్షురాలిగా ఉండడం పట్ల సంతృప్తిగానే ఉన్నారు. ఇలా అనేక రకాలైన కారణాలతో ఆమెకే మళ్లీ చాన్స్ అని అంటున్నారు.

తెలంగాణాలో చూస్తే ఈటెల రాజెందర్ అలాగే రఘునందనరావు వంటి వారు అక్కడ బీజేపీ అధ్యక్ష పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంకా ఎమ్మెల్యేల నుంచి కూడా పోటీ పడే వారు ఉన్నారు. సామాజిక వర్గాల సమీకరణలు కూడా సరిపోల్చుకుని ఎవరికి ప్రెసిడెంట్ పదవి ఇస్తారో చూడాల్సి ఉంది అని అంటున్నారు. తెలంగాణాతో పోలిస్తే ఏపీలో పోటీ తక్కువ అని కూడా అంటున్నారు.