బీజేపీ సౌత్ ఫోకస్ : చీల్చి చెండాడడమేనా ?
భారతీయ జనతా పార్టీకి దక్షిణ భారతం మీద బెంగ ఎక్కువ అయిపోతోంది. తమ పార్టీ పేరులో భారతీయ ఉంది కానీ ఉత్తరాదిగానే చెబుతూ ఒక పక్కనే తమకు పెట్టేస్తున్నారు అన్న చింత ఇంతకాలం అంతర్గతంగా ఉంటూ వచ్చింది.
By: Satya P | 20 April 2026 1:00 AM ISTభారతీయ జనతా పార్టీకి దక్షిణ భారతం మీద బెంగ ఎక్కువ అయిపోతోంది. తమ పార్టీ పేరులో భారతీయ ఉంది కానీ ఉత్తరాదిగానే చెబుతూ ఒక పక్కనే తమకు పెట్టేస్తున్నారు అన్న చింత ఇంతకాలం అంతర్గతంగా ఉంటూ వచ్చింది. అయితే తాజాగా లోక్ సభలో మహిళా బిల్లు రిజర్వేషన్ల కోటా అమలు విషయంలో ప్రవేశపెట్టిన 131 రాజ్యాంగ సవరణకు విపక్షాలు అన్నీ కలసి ఝలక్ ఇచ్చేశాయి. దాంతో బిల్లు వీగిపోయింది. పైగా ఈ బిల్లు వీగిపోవడం కంటే కూడా అతి పెద్ద బాధ మరొకటి ఉంది. అదే తమకు ఉత్తరాది గాటకు కట్టేస్తున్నారు అన్నదే బీజేపీకి పట్టుకున్న మనో వేదన అని అంటున్నారు.
కాంగ్రెస్ మాదిరిగా :
దేశంలో కాంగ్రెస్ కి అన్ని ప్రాంతాలు అన్ని వర్గాలలో మద్దతు ఉంది. ఆ పార్టీ ఆసేతు హిమాచలం తెలుసు. ఈ రోజుకీ క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్ పేరు చెబితే కొద్దో గొప్పో ఓట్లు పడతాయి. ఆ పార్టీ దేశ రాజకీయాల మీద వేసిన బలమైన ముద్ర అది. అయితే ఆ పరిస్థితి మాత్రం బీజేపీకి లేకుండా పోతోంది. అటల్ బిహారీ వాజ్ పేయి అద్వానీ వంటి ఉద్ధండుల నుంచి నరేంద్ర మోడీ, అమిత్ షా వంటి అపర చాణక్యుల దాకా ఎంత ప్రయత్నం చేసినా దక్షిణాదిన కమలం పూవుని వికసించలేకపోయారు. ఎంతో కష్టం మీద కర్ణాటకలో బీజేపీకి వెలుగు రేఖలు విచ్చుకున్నాయి కానీ మిగిలిన చోట మాత్రం ఏ మాత్రం ఎదగని పరిస్థితి ఈ రోజుకీ ఉంది.
పెను సవాల్ గానే :
ఇదిలా ఉంటే బీజేపీకి 2029 ఎన్నికలు చాలా కీలకమైనవి. దానికోసమే డీలిమిటేషన్ చేయాలనుకుంది ప్రస్తుతం ఉన్న సీట్లకు అదనంగా మరో 50 శాతం పెంచితే దక్షిణాది నిష్పత్తి అలాగే ఉంటుదని ఆ మేరకు ఉత్తరాదిన తాము బలపడవచ్చు అని అలాగే మహిళా రిజర్వేషన్ల అస్త్రం కూడా ఉంటుంది కాబట్టి మరోసారి నిర్పూచీగా అధికారం భారీ ఆధిక్యంతో అందుకోవచ్చు అన్నది బీజేపీ ఆలోచనగా ఉంది. కానీ విషయం మొత్తం పసిగట్టిన విపక్షం అసలుకే ఎసరు పెట్టేసింది. బీజేపీ ఆశలకు గండి కొట్టేసింది. దాంతో ఇపుడు బీజేపీకి 2029 ఎన్నికలు పెను సవాల్ గా మారబోతున్నాయని అంటున్నారు.
వంద సీట్ల ఫోకస్ :
బీజేపీకి ఈసారి దక్షిణాది కలిసి రావాలసి ఉంది. ఇక్కడ ఉన్న 129 సీట్లలో 2024 ఎన్నికల్లో 57 సీట్లు బీజేపీకి దక్కాయి. నిజం చెప్పాలీ అంటే ఇది పెద్ద నంబరే. కానీ ఇక్కడే కాంగ్రెస్ ఇండియా కూటమి మిత్రులకు కూడా బలం ఉంది. దాంతో మూడు ఎన్నికల తరువాత మోడీ ప్రాభవం తగ్గితే దక్షిణాదిలో 2029 నాటికి మరింతగా విపక్షాలు పుంజుకునే అవకాశాలు ఉంటాయని బీజేపీ పెద్దలు ఊహిస్తున్నారు. దాంతో మరో మూడేళ్లలో జరిగే సార్వత్రిక ఎన్నికలకు ఇప్పటి నుంచే తగిన యాక్షన్ ప్లాన్ తో రంగంలోకి దిగబోతున్నారు అని అంటున్నారు. దక్షిణాదిన ఈసారి వంద సీట్ల టార్గెట్ పెట్టుకుని బరిలోకి దిగాలని చూస్తున్నారు అని అంటున్నారు.
ఆపరేషన్ ఆకర్ష్ :
రానున్న రోజులలో ఏపీ తెలంగాణాలో బీజేపీ బలపడడానికి అన్ని రకాలైన సామ దాన భేద దండోపాయాలను వాడుతుందని అంటున్నారు. తెలంగాణాలో చూస్తే బీఆర్ఎస్ నుంచి పెద్ద ఎత్తున నేతలను ఆకట్టుకోవాలని ఆలోచనలు ఉన్నాయని అంటున్నారు. అలాగే కాంగ్రెస్ సహా ఇతర పార్టీల మీద వల వేయబోతున్నారు అని అంటున్నారు. ఏపీలో చూస్తే ప్రధాన ప్రతిపక్షం వైసీపీని కూడా గట్టిగా టార్గెట్ చేసే వ్యూహం ఉందని అంటున్నారు. అలాగే కాంగ్రెస్ నుంచి మిగిలిన నేతలను తమ వైపు తిప్పుకోవాలని చూస్తున్నారు అని అంటున్నారు. తమిళనాడులో రేపటి ఎన్నికల తరువాత బీజేపీ తన రాజకీయ విస్తరణకు వేగంగా పావులు కదుపుతుంది అని అంటున్నారు. అన్నా డీఎంకే మిత్ర పక్షంగా ఉంది. ఇతర పార్టీల మీద గేలం వేసి మరీ కమలం ఎదిగేందుకు రంగం సిద్ధం చేసుకోవచ్చు అని అంటున్నారు. కేరళలో ఈసారి కాంగ్రెస్ కనుక అధికారంలోకి వస్తే బీజేపీ దూకుడు పెంచుతుందని ఎందుకంటే అక్కడ వామపక్షాలు దెబ్బ తింటాయని దాంతో పశ్చిమ బెంగాల్ స్ట్రాటజీని ప్రయోగించాలని కూడా ఆలోచిస్తోంది అంటున్నారు. మొత్తం మీద చూస్తే బీజేపీ ఇక ఏ మాత్రం తగ్గేది లేదు అన్నట్లుగానే దక్షిణాది వైపు ఫోకస్ పెడుతుందని అంటున్నారు.
