Begin typing your search above and press return to search.

తమిళనాడు కేరళ కూడానట...బీజేపీది అత్యాశేనా ?

ఈ సందర్భంగా కేరళలో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని అంటున్నారు. బీజేపీకి 2024 ఎన్నికల్లో కేరళలో ఒక ఎంపీ సీటు దక్కింది.

By:  Tupaki Desk   |   14 July 2025 9:35 AM IST
తమిళనాడు కేరళ కూడానట...బీజేపీది అత్యాశేనా ?
X

దక్షిణాదిన బీజేపీ ఒక రాష్ట్రంలో గెలిచింది. అక్కడే అధికారం కూడా చేపట్టింది. అదే కర్ణాటక. ఇక్కడ కూడా పూర్తిగా బలపడడం లేదు. ఒకసారి 2018లో గెలిస్తే మరోసారి 2023లో ఓటమి పాలు అయింది. ఇక 2018లో కూడా బీజేపీకి పూర్తి మెజారిటీ దక్కలేదు. ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలను ఆకట్టుకుని వారి చేత తరువాత రాజీనామాలు చేయించి వారి మద్దతుతో సంఖ్యాబలం పెంచుకుంది.

ఇక 2023లో బీజేపీ గట్టిగానే దెబ్బతింది. కానీ ఎంపీ ఎన్నికల్లో మాత్రం బీజేపీ గెలుస్తోంది. ఆ విధంగా బీజేపీకి కర్ణాటక ఊరటను ఇస్తోంది. తెలంగాణాలో చూస్తే కనీసంగా పాతిక నుంచి ముప్పయి ఎమ్మెల్యేలు గెలుస్తారని అనుకున్నా కేవలం ఎనిమిది మంది మాత్రమే గెలిచారు. అలా బీజేపీ 60 మందితో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న మ్యాజిక్ ఫిగర్ కి ఎక్కడో ఉంది. అయితే 2024లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో గెలవడం భారీ ఉపశమనంగానే చూడాల్సి ఉంది.

ఏపీలో పొత్తు లేకపోతే బీజేపీ సొంత బలం ఒక్క శాతమే ఉంటోంది. 2024లో పొత్తులు కట్టబట్టి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ముగ్గురు ఎంపీలు ఆ పార్టీకి లభించారు. ఇలా మూడు రాష్ట్రాలలో పరిస్థితి ఉంది. ఇపుడు తమిళనాడు కేరళలలో కూడా తమ ప్రభుత్వాలే వస్తాయని కేంద్ర హోంమంత్రి బీజేపీ పెద్ద అమిత్ షా నమ్మకంగా చెబుతున్నారు.

తాజాగా ఆయన కేరళలో పర్యటిస్తూ అక్కడ నిర్వహించిన ఒక సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా కేరళలో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని అంటున్నారు. బీజేపీకి 2024 ఎన్నికల్లో కేరళలో ఒక ఎంపీ సీటు దక్కింది. దాంతో బీజేపీకి ఆశలు పెరిగినట్లుగా ఉన్నాయని అంటున్నారు.

అయితే మొత్తం 20 ఎంపీ సీట్లు ఉంటే బీజేపీకి వచ్చింది ఒకే ఒక్క సీటు అని గుర్తు చేస్తున్నారు. గెలుపు కోసం చాలా దూరం ప్రయాణించాల్సిందే అని అంటున్నారు. అయితే అమిత్ షా ఒక పోలిక తెస్తున్నారు. ఈశాన్య రాష్ట్రాలలో తమకు పెద్దగా బలం లేకపోయినా తరువాత ఎన్నికల్లో అధికారంలోకి నేరుగా వచ్చామని అంటున్నారు. అలా కేరళలో కూడా తాము ఆశించిన ఫలితాలు వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఇక చూస్తే కనుక 2027లో కేరళ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయి అంటే ఇంకా రెండేళ్ళ సమయం ఉంది అన్న మాట. ఈ రెండేళ్ళలో తాము గట్టిగా ప్రజలలో ఉంటే అధికారం వైపుగా ఆశలు పెంచుకోవచ్చునని బీజేపీ పెద్దలు భావిస్తున్నారులా ఉంది అంటున్నారు అయితే ఒకసారి వామపక్షాల నాయకత్వంలోని ఎల్డీఎఫ్ మరోసారి కాంగ్రెస్ నాయకత్వంలోని యూడీఎఫ్ లను ప్రజలు గెలిపిస్తూ వస్తున్నారు.

అక్కడ మూడవ పార్టీకి చాన్స్ అయితే కనిపించడం లేదు అని అంటున్నారు బీజేపీ మాత్రం కేరళలో అడుగుపెట్టి తీరుతామని అంటోంది ఇక తమిళనాడులో చూస్తే అన్నాడీఎంకేతో జత కట్టింది. పొత్తులు కుదుర్చుకుంది. కొంత వరకూ అయితే బలం సమకూరింది. అయితే తమిళనాడులో ఇది సరిపోదనే అంటున్నారు.

అక్కడ డీఎంకే బలంగా ఉంది అని చెబుతున్నారు. పైగా దళపతి ప్రముఖ సినీ నటుడు విజయ్ నాయకత్వంలో కొత్త పార్టీ ఏర్పాటు అయింది. ఆ పార్టీ ఒంటరిగా పోటీకి దిగుతోంది. ఈ ముక్కోణపు పోటీలో కచ్చితంగా మరోసారి డీఎంకే అధికారంలోకి రావడానికే ఎక్కువ చాన్స్ ఉందని అంటున్నారు. బీజేపీ మాత్రం 2026లో తమిళనాడు, 2027లో కేరళలలో అధికారాలను అందుకుంటామని చెబుతోంది. మరి బీజేపీది అత్యాశా లేక ఈ ధీమా వెనక కొత్త వ్యూహాలు ఏమైనా ఉన్నాయా అన్నది చూడాల్సి ఉంది.