దక్షిణాన బీజేపీ పువ్వు పూస్తుందా ?
ఇక అవి కూడా చాలవు, ఈసారి కచ్చితంగా సగానికి పైగా సాధిస్తేనే మళ్ళీ బీజేపీకి పీఠం దక్కుతుంది. దాంతో దక్షిణాదిన బీజేపీ పువ్వు పూయించాలని బీజేపీ తెగ తపన పడుతోంది.
By: Tupaki Desk | 8 July 2025 4:00 AM ISTబీజేపీకి ఇపుడు దక్షిణాది కావాలి. ఆ పార్టీని మొదటి నుంచి ఉత్తరాది ఆదరిస్తోంది. దాంతో సౌత్ స్టేట్స్ లో పెద్దగా బలం లేకపోయినా అధికారం సొంతం అవుతోంది. మొత్తం మీద పడుతూ లేస్తూ కర్ణాటకలో కాస్త ఉనికిని చాటుకుంది. తెలంగాణాలో ఇపుడిపుడే నేను ఉన్నాను అంటోంది. తమిళనాడు కేరళలలో అయితే బీజేపీ చిరునామా కోసం పెద్ద పోరు చేయాల్సి వస్తోంది. ఏపీ లాంటి చోట్ల పొత్తులు లేకపోతే నోటాతోనే పోటీ పడే సన్నివేశం ఉంది.
ఈ నేపథ్యంలో బీజేపీకి ఉత్తరాదిన ఆదరణ నెమ్మదిగా తగ్గుముఖం పడుతోంది. అది 2024 ఎన్నికల్లో సంకేతంగా రుజువు అయింది. అతి పెద్ద స్టేట్ గా ఉన్న యూపీలో మెజారిటీ ఎంపెలను అఖిలేష్ యాదవ్ నాయకత్వంలోని ఎస్పీ తన్నుకుని పోయింది. ఇక బీహార్ లో ఈ రోజుకీ సీఎం పీఠం దక్కడంలేదు. నితీష్ కుమార్ పార్టీ జేడీయూతో పొత్తు లేకపోతే అక్కడ కమల వికాసం జరగడం లేదు. పంజాబ్ లో ఆప్ గెలిచింది. ఢిల్లీలో ఈసారి ఓడినా బలంగానే ఉంది. గుజరాత్ లో సవాల్ చేస్తోంది.
మహారాష్ట్రలో కూడా ఎన్డీయే అధికారంలోకి వచ్చినా కూడా బలంగా సరద్ పవార్ శివసేన, ఉద్ధవ్ ఠాక్రే శివసేన కాంగ్రెస్ ఉన్నాయి. పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీని గద్దె నుంచి దించడం శక్తికి మించిన పని అవుతోంది. హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. మిగిలిన చోట్లా ప్రయత్నాలు చేస్తోంది. ఇలా రాజకీయ దృశ్యం ఉంటే ఏకంగా 139 ఎంపీ సీట్లు ఉన్న సౌత్ స్టేట్స్ లో 39 సీట్లు అయినా బీజేపీ సాధించకపోతే ఎలా అన్న చర్చ సాగుతోంది.
ఇక అవి కూడా చాలవు, ఈసారి కచ్చితంగా సగానికి పైగా సాధిస్తేనే మళ్ళీ బీజేపీకి పీఠం దక్కుతుంది. దాంతో దక్షిణాదిన బీజేపీ పువ్వు పూయించాలని బీజేపీ తెగ తపన పడుతోంది. అందులో భాగంగానే చాలా ప్రయోగాలే చేస్తోంది. బీజేపీ అధ్యక్ష పీఠాలను వరసబెట్టి ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న వారికే బీజేపీ అప్పగించడం చూస్తూంటే భారీ ప్లాన్ తో ఆ పార్టీ ఉందని అంటున్నారు
ఈసారి దక్షిణాదిన కలసి వచ్చే పార్టీలతో పొత్తులు లేదా తెర వెనక పొత్తులు ఎవైనా పెట్టుకుని 2029 ఎన్నికల్లో మరోసారి అధికారం చేపట్టాలని బీజేపీ చూస్తోంది. అందులో భాగనే అధ్యక్షుల ఎంపికలో ఈ జాగ్రత్తలు అని అంటున్నారు. అంతే కాదు గతానికి భిన్నంగా దక్షిణాదిన రాష్ట్రాలకు అధిక నిధులను ఇస్తోంది. అలాగే కీలక ప్రాజెక్టులను మంజూరు చేస్తోంది. ఇదంతా తనకు సానుకూలం అవుతుందని ఆ పార్టీ నమ్ముతోంది.
దక్షిణాదిన అయిదు రాష్ట్రాలు ఉంటే కేరళ మినహాయించి మిగిలిన చోట్ల గట్టిగా పాతుకుని పోవాలని బీజేపీ చూస్తోంది. తమిళనాడులో బలంగా ఉన్న అన్నాడీఎంకేతో చెలిమి చేయడం అందులో భాగమే అని అంటున్నారు. కర్ణాటకలో జేడీఎస్ తో పొత్తు పెట్టుకుని బీజేపీ తెలివిగా వ్యవహరించింది అన్నది ఎంపీ ఎన్నికల ఫలితాలు నిరూపించాయి. ఏపీలో చూస్తే టీడీపీ జనసేన బీజేపీకి కొండంత అండగా ఉన్నారు. తెలంగాణాలో కూడా ఎన్నికల వేళకు త్రిముఖ పోటీని ద్విముఖ పోటీగా మార్చాలని బీజేపీ చూస్తోంది. దానికి ఆ పార్టీ వేసే ఎత్తులు వేరే లెవెల్ లో ఉంటాయని అంటున్నారు.
ఈసారి బీజేపీకి కేంద్రంలో అధికారం దక్కడానికి దక్షిణాది రాష్ట్రాలే కారణం అని చెప్పాలి. ఏపీలో టీడీపీ జనసేన ఎంపీల బలం ఆ పార్టీకి శ్రీరామ రక్షగా ఉంది. దాంతో ఇదే ఫార్ములాను 2029 నాటికి కూడా అమలు చేసి మరోసారి కేంద్రంలో అధికారంలోకి రావాలని బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయన్నది చూడాల్సిందే
ఏపీలో కానీ తెలంగాణాలో కానీ జాతీయ స్థాయికి వచ్చేటప్పటికి కాంగ్రెస్ కమ్యూనిస్టులు తప్ప మిగిలిన పార్టీలను తన వైపే ఉంచుకోవాలని బీజేపీ జాగ్రత్తగా వేస్తున్న అడుగులకు దర్పణమే ఈ అధ్యక్షుల ఎంపిక అని అంటున్నారు. సో రానున్న రోజుల్లో మొత్తం 139 ఎంపీ సీట్లలో బీజేపీ దాని మిత్రులు ఎన్ని సీట్లు గెలుచుకుంటారు, కొత్త మిత్రులు పరోక్షంగా బీజేపీఎకి ఏ విధంగా సాయపడతారు అనేది చూడాల్సి ఉంది.
