Begin typing your search above and press return to search.

జగన్ అరెస్ట్ కి బీజేపీకి లింక్ ఏంటి?

నిజానికి జగన్ తప్పు చేశారు అంటే సాక్ష్యాధారాలు ఉంటే ఏ పూచీ పేచీ లేకుండా ఏపీ ప్రభుత్వమే అరెస్ట్ చేయవచ్చు కదా అన్న చర్చ వస్తోంది.

By:  Tupaki Desk   |   22 May 2025 6:00 AM IST
జగన్ అరెస్ట్ కి బీజేపీకి లింక్ ఏంటి?
X

ఏపీ మాజీ సీఎం జగన్ అరెస్ట్ కి బీజేపీకి లింక్ ఏంటి అన్నదే ఇపుడు జరుగుతున్న చర్చ. నిజానికి జగన్ తప్పు చేశారు అంటే సాక్ష్యాధారాలు ఉంటే ఏ పూచీ పేచీ లేకుండా ఏపీ ప్రభుత్వమే అరెస్ట్ చేయవచ్చు కదా అన్న చర్చ వస్తోంది. ఎందుకంటే ఏపీ ప్రభుత్వం చేతిలో సర్వాధికారాలు ఉన్నాయి. పైగా సిట్ ద్వారా లిక్కర్ స్కాం అని జగన్ హయాంలో జరిగిన దాని మీద గత కొన్ని నెలలుగా విచారణ చేయిస్తున్నారు.

మరో వైపు చూస్తే జగన్ ప్రభుత్వం అధికారంలో ఉన్నపుడు చంద్రబాబుని 2023 సెప్టెంబర్ 9న అరెస్ట్ చేసి ఏకంగా యాభై మూడు రోజుల పాటు జైలు గోడల మధ్యన ఉంచారు అన్నది టీడీపీలో ఉంది. దానికి ఇది ప్రతీకార రాజకీయంగా వైసీపీ నేతలు అంటున్నారు. అయితే అదేమీ లేదు అంతా చట్ట ప్రకారమే జరుగుతోంది అని కూటమి నుంచి జవాబు వస్తోంది.

ఇక జగన్ అరెస్ట్ చేస్తే దాని తరువాత ఎదురయ్యే విపరిణామాలను కూడా కూటమి ప్రభుత్వం పరిశీలిస్తోంది అని అంటున్నారు. జగన్ మాస్ లీడర్ గా ఉన్నారు. పైగా ఆయన అయిదేళ్ళ పాటు సీఎం గా చేశారు. ఇక ఎంత కాదనుకున్నా వైసీపీకి 40 శాతం ఓటు బ్యాంక్ ఉంది. దాంతో జగన్ అరెస్ట్ వల్ల ఎదురయ్యే పరిణామాలను కూడా పరిగణనలోకి తప్పకుండా తీసుకుంటారు అని అంటున్నారు.

జగన్ హయాంలో బాబుని అరెస్ట్ చేసినపుడు ఇలాంటివి ఏవీ తీసుకోకపోవడం వల్లనే అది బూమరాంగ్ అయింది అన్న చర్చ ఉంది దాంతో అన్ని రకాలుగా జాగ్రత్తలు వహిస్తూనే కూటమి ప్రభుత్వం జగన్ అరెస్ట్ విషయంలో అడుగులు ముందుకు వేస్తుందని అంటున్నారు.

అయితే ఇక్కడ మరో ప్రశ్న ముందుకు వస్తోంది. చంద్రబాబుని అరెస్ట్ చేసినపుడు జగన్ ప్రభుత్వం ఆనాడు కేంద్ర పెద్దలకు ఆ విషయం చెప్పిందా లేక వారికి ఆ కేసు విషయం వివరించి అరెస్ట్ కి సిద్ధపడిందా అన్న చర్చ వస్తోంది. అదే కనుక జరిగితే ఇపుడు కూడా కేంద్ర పెద్దలకు జగన్ అరెస్ట్ విషయం వివరించవచ్చు అని అంటున్నారు.

ఇక నాడు జరిగిన చర్చ ఏమిటి అంటే కేంద్రానికి చంద్రబాబు అరెస్ట్ విషయం ముందుగా చెప్పి చేయలేదు అని అంటారు అరెస్ట్ తరువాతనే వివరించారు అని అంటారు అంటే డేరింగ్ గానే నాడు బాబు లాంటి బిగ్ షాట్ ని అరెస్ట్ చేశారు అని అంటారు. అయితే అలా చేయడం వల్లనే వైసీపీ చేతికే కాదు ఒంటినిండా మరక అంటించుకుందని దాని ఫలితాన్ని 2024 ఎన్నికల్లో నిండారా అనుభవించింది అని కూడా అంటారు.

చంద్రబాబు రాజకీయంగా పూర్తి అనుభవం కలిగిన వారు. అందుకే ఆయన అలా చేయరని అంటారు. జగన్ విషయంలో బహుముఖీయమైన వ్యూహాన్ని రూపొందిస్తున్నారు అని అంటున్నారు. జగన్ అరెస్ట్ కావాలి కానీ సానుభూతి రాకూడదు, అదే సమయంలో ఏపీ ప్రభుత్వం మీద ఆ నింద పడకూడదు అందుకే ఈ విషయంలో కేంద్ర పెద్దలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు అని అంటున్నారు

వీలైతే అన్నీ కుదిరితే సిట్ ద్వారా కాకుండా ఏకంగా ఈడీ ద్వారానే జగన్ అరెస్ట్ ని చేయించే విధంగా కూడా తెర వెనక స్కెచ్ ని గీస్తున్నారు అని అంటున్నారు. ఈడీ అంటే కేంద్ర ప్రభుత్వ సంస్థ. దాంతో బీజేపీ వారే చేయించారు అన్న చర్చ మొదలవుతుంది. పైగా కేంద్రమే చేయించింది అంటే మ్యాటర్ వెరీ సీరియస్ అన్న లెక్క కూడా ఉంటుంది. పైగా ఏపీ ప్రభుత్వం మీద కూడా ఈ నింద పడదు అని అంటున్నారు. ఇక సానుభూతి వంటివి కూడా పెద్దగా రావు అని ఆలోచిస్తున్నారు.

అయితే బీజేపీ కేంద్రంలో బలమైన పార్టీగా ఉంది. అధికారంలో మూడు విడతలుగా ఉంటోంది. మరి ఆ పార్టీ ఒక రాష్ట్రంలో జరిగే వ్యవహారంలో నేరుగా రంగ ప్రవేశం చేసి ఎంతవరకూ దూకుడు చేస్తుంది అన్నదే చర్చగా ఉంది. ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ విషయం వేరు. అక్కడ బీజేపీ ప్రత్యర్థిగా ఉంది. ఆ అరెస్ట్ తరువాత బీజేపీ ఢిల్లీలో అధికారంలోకి వచ్చింది.

ఏపీలో సీన్ వేరు. బీజేపీ జగన్ కి నేరుగా ప్రత్యర్ధి కాదు అని అంటున్నారు. టీడీపీ కూటమిలో బీజేపీ జూనియర్ పార్టనర్ గా ఉంది అని అంటున్నారు పైగా బీజేపీకి ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రాజకీయ ఈక్వేషన్స్ ఉంటాయి. ఏ కారణం లేకుండా బీజేపీ ఎవరితోనూ చెలిమి చేయదు, అలాగే శతృత్వం పెట్టుకోదు అని అంటారు.

అందుకే బీజేపీకి జగన్ అరెస్ట్ విషయంలో ఎంతవరకూ ఆసక్తి ఉంది, ఏ మేరకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది అన్నదే చర్చగా ఉంది. అయితే ఈ రోజున కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం నిలిచి ఉండడానికి కారణం తెలుగుదేశం పార్టీ ఎంపీలు. ఆ విధంగా చూస్తే ఏపీకి సంబంధించి నిధులు దండీగా ఇచ్చినా ఇవ్వకపోయినా ఇలాంటి విషయాల్లో పైసా ఖర్చు లేని వ్యవహారాల్లో సహకరిస్తే పోయేది ఏమి ఉంటుంది అన్నదే మరో చర్చగా ఉంది.

అయితే బీజేపీ గ్రీన్ సిగ్నల్ జగన్ అరెస్ట్ కి ఇచ్చింది అంటే జగన్ కి కాంగ్రెస్ తో పాటు బీజేపీ కూడా జీవిత కాలం శత్రువే అవుతుంది అని అంటున్నారు ఆ విషయం అందరి కంటే బీజేపీ పెద్దలకే ఎక్కువగా తెలుసు అని అంటున్నారు. ఈ కూటములు పొత్తులు మిత్రులు ఏవీ శాశ్వతం కాని వేళ జగన్ ని శాశ్వత శత్రువుగా చేసుకోవడానికి బీజేపీ పెద్దలు అందులో వ్యూహకర్తలు ఎంతవరకూ సిద్ధపడతారు అన్న దాని మీదనే జగన్ అరెస్ట్ విషయం ఆధారపడి ఉంటుంది అని అంటున్నారు.