Begin typing your search above and press return to search.

చిన్నమ్మకు జాతీయ పదవి.. బీజేపీ స్పష్టమైన సంకేతాలు!

కేంద్ర మంత్రివర్గ పునర్వ్యస్థీకరణ ముందు బీజేపీ జాతీయ కార్యవర్గాన్ని ప్రక్షాళించారు. కొత్తగా 13 మందికి జాతీయ ఉపాధ్యక్షులుగా నియమించారు.

By:  Tupaki Desk   |   17 Aug 2026 9:00 PM IST
చిన్నమ్మకు జాతీయ పదవి.. బీజేపీ స్పష్టమైన సంకేతాలు!
X

కేంద్ర మంత్రివర్గ పునర్వ్యస్థీకరణ ముందు బీజేపీ జాతీయ కార్యవర్గాన్ని ప్రక్షాళించారు. కొత్తగా 13 మందికి జాతీయ ఉపాధ్యక్షులుగా నియమించారు. ఇందులో ఏపీ నుంచి రాజమండ్రి ఎంపీ పురందేశ్వరి స్థానం సంపాదించారు. అదేవిధంగా పార్టీ సీనియర్ నేత, ఆర్ఎస్ఎస్ ప్రముఖుడు రాంమాధవ్ సైతం ఉపాధ్యక్షుడిగా ఎంపికయ్యారు. ఇదేసమయంలో బీజేపీ జాయింట్ కోఆర్డినేటర్ గా విష్ణువర్ధన్ రెడ్డిని నియమించారు. ఇలా ఏపీ నుంచి మొత్తం ముగ్గురిని బీజేపీ జాతీయ కార్యవర్గంలోకి తీసుకోగా, తెలంగాణకు చెందిన పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్ ను పదవుల నుంచి తప్పించారు. అంతేకాకుండా కొత్త జట్టులో తెలంగాణ నుంచి ఏ ఒక్కరికి అవకాశం కల్పించలేదు. దీంతో తెలంగాణ విషయంలో బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందని అంటున్నారు.

బీజేపీ జాతీయ కార్యవర్గాన్ని అధ్యక్షుడు నితిన్ నబీన్ సోమవారం ప్రకటించారు. కొత్త కార్యవర్గంలో మొత్తం 13 మంది ఉపాధ్యక్షులను నియమించారు. ఇందులో రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజేతోపాటు కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి, సీనియర్ నేత రాంమాధవ్ ఉన్నాు. ఇక బీజేపీ ప్రధాన కార్యదర్శిగా మరో మాజీ మంత్రి స్మృతి ఇరానీకి బాధ్యతలు అప్పగించారు. పార్టీ కోశాధికారిగా పీయూష్‌ గోయల్, బీజేపీ ఆర్గనైజేషన్‌ జనరల్‌ సెక్రటరీగా బీఎల్‌ సంతోష్ నియమితులయ్యారు. ఈయనను పార్టీ బాధ్యతల నుంచి విముక్తి కల్పిస్తారని ప్రచారం జరిగినా, అధిష్టానం మాత్రం ఆయనపై నమ్మకాన్ని కోల్పోలేదని తాజా నియామకంతో స్పష్టం చేసిందని చెబుతున్నారు.

తెలంగాణకు దక్కని చోటు

బీజేపీ జాతీయ కార్యకర్గంలో తెలంగాణ నేతలకు పదవులు దక్కకపోవడంపై విస్తృత చర్చ జరుగుతోంది. ఏపీ నుంచి ముగ్గురికి పదవులిచ్చిన పార్టీ అధిష్టానం తెలంగాణ నుంచి ఒక్కరికి అవకాశం ఇవ్వకపోవడం, అదే సమయంలో ఇద్దరు కీలక నేతలను పదవుల నుంచి తప్పించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలో తేల్చుకోలేకపోతున్నట్లు పార్టీ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. అయితే పార్టీ పెద్దలు పక్కా ప్రణాళికతోనే జాతీయ కార్యవర్గాన్ని విస్తరించారని తెలంగాణ నేతలకు పదవులు ఇవ్వకపోవడం వెనుక ఇంకో కారణం ఉందని వ్యాఖ్యానిస్తున్నారు. పార్టీ పదవులు ఇవ్వలేదంటే ప్రభుత్వంలోకి తీసుకోబోతున్నట్లు సంకేతాలు ఇవ్వడమేనని అంటున్నారు.

మంత్రివర్గంలోకి టీబీజేపీ నేతలు?

త్వరలో విస్తరించనున్న కేంద్ర మంత్రివర్గంలో తెలంగాణ బీజేపీ నేతలకు అవకాశం ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. తాజాగా చేపట్టిన జాతీయ కార్యవర్గం విస్తరణలో ఈ మేరకు సంకేతాలు అందుతున్నాయని అంటున్నారు. కేంద్ర మంత్రివర్గ విస్తరణలో ఏపీ నుంచి మరొకరికి బెర్తు దక్కుతుందని చాలాకాలంగా ప్రచారం జరుగుతుండగా, తెలంగాణలో ఆ చాన్స్ లేదన్న అభిప్రాయం వ్యక్తమైందని చెబుతున్నారు. అయితే తాజా నియామకాలతో ఈ పరిస్థితి మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పార్టీ పదవుల నుంచి విముక్తి చేశారంటే ప్రభుత్వంలో అవకాశం కల్పించే ఆలోచన ఉండొచ్చని చెబుతున్నారు.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కచ్చితంగా గెలవాలని భావిస్తున్న బీజేపీ పెద్దలు రాష్ట్రానికి చెందిన నేతలకు ప్రజల్లో చొచ్చుకెళ్లేలా వాడుకోవాలని భావిస్తోందని అంటున్నారు. ప్రభుత్వంలో పదవులు ఉంటే ప్రజలతో మమేకయ్యే పరిస్థితి ఉంటుందనే ఆలోచనతోనే పార్టీ పదవుల నుంచి విముక్తి కల్పించినట్లు భావిస్తున్నారు. ఇక ఏపీలో మంత్రి పదవికి హాట్ ఫేవరెట్ గా భావించిన పురందేశ్వరికి జాతీయ ఉపాధ్యక్షురాలిగా నియమించడంతో ఆమెకు మంత్రి అవకాశం లేనట్లు స్పష్టం చేసినట్లే అంటున్నారు. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా సమర్థవంతంగా పనిచేసిన పురందేశ్వరికి మంత్రి పదవి ఇస్తారని ప్రచారం జరిగింది. అయితే సంఘ్ నేపథ్యం లేకపోవడం వల్ల అప్పట్లో ఆమెకు అవకాశం ఇవ్వలేకపోయారని చెబుతున్నారు. ఆ తర్వాత లోక్ సభ డిప్యూటీ స్పీకర్ పదవి ఇస్తారని జరిగిన ప్రచారం ఇప్పటివరకు వాస్తవరూపం దాల్చలేదని అంటున్నారు. మరోవైపు పురందేశ్వరిని తప్పించడంతో ఏపీ నుంచి ఇంకెవరికైనా కేంద్ర మంత్రివర్గంలో అవకాశం ఉంటుందా? లేదా? అన్నదే ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది.