Begin typing your search above and press return to search.

బీజేపీతో ఇక ముందూ అంతేనా ?

బీజేపీకి ఎంపీలు కావాలి. పైగా రాజ్యసభలో ఆ అవసరం ఎక్కువగా ఉంది. దాంతో బీజేపీ కోరుతోంది.

By:  Tupaki Desk   |   2 May 2025 9:53 AM IST
బీజేపీతో ఇక ముందూ అంతేనా ?
X

ఏపీ బీజేపీకి ఎంత బలం ఉంది అన్నది రాజకీయాల పట్ల ఆసక్తి ఉన్న ఎవరిని అడిగినా ఇట్టే చెబుతారు. 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన బీజేపీ పెద్ద ఎత్తున డిపాజిట్లు గల్లంతు చేసుకుంది. ఒక్క సీటూ గెలవలేదు. 2024లో మాత్రం పొత్తులతో ఎత్తులతో ఏకంగా ఎనిమిది అసెంబ్లీ సీట్లు గెలిచింది, మూడు లోక్ సభ సీట్లూ గెలుచుకుంది.

ఇక చూస్తే వైసీపీ నుంచి బయటకు వచ్చి రాజీనామా చేసిన నలుగురు ఎంపీ సీట్లతో ఏర్పడిన ఖాళీలలో టీడీపీతో సమానంగా బీజేపీ సీట్లు దక్కించుకుంది. ఈ రెండు పార్టీలకు చెరో రెండు సీట్లు రాజ్యసభలో ఏపీ నుంచి ఉన్నాయి. జనసేనకు మాత్రం అసలు ప్రాతినిధ్యం లేదు.

ఇక చూస్తే బీజేపీ ఎంపిక చేసిన రాజ్యసభ సీట్లలో ఒకరు తెలంగాణాకు చెందిన ఆర్ క్రిష్ణయ్య అయితే మరొకరు ఏపీకి చెందిన పాకా వెంకట సత్యనారాయణ. ఇలా బీజేపీ తన అవసరాలు ప్రాంతాలు పరిస్థితులు సామాజిక నేపధ్యం అన్నీ చూసుకుని అభ్యర్ధులను చట్ట సభలకు పంపుతోది.

అయితే ఏపీలో ఉన్న కేవలం ఎనిమిది మంది ఎమ్మెల్యేలతో బీజేపీకి ఈ రెండు సీట్లు దక్కుతాయా అంటే అది సందేహమే. టీడీపీ వంటి పెద్ద పార్టీ దన్ను ఉంది కాబట్టే అది సాధ్యమైంది. మరి ఇది ఇక్కడితో ఆగుతుందా లేక ఇక మీదట కూడా కొనసాగుతుందా sఅన్నదే తమ్ముళ్లకు పట్టుకున్న ధర్మ సందేహం.

ఏపీలో 2025లో మరి కొన్ని రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతున్నాయి. అలాగే 2027లో కూడా మరిన్ని సీట్లు ఖాళీ అవుతాయి. 2029 ఎన్నికలకు ముందు కూడా ఖాళీ అవుతాయి. ఇలా మూడు విడతలతో పెద్ద ఎత్తున రాజ్యసభ సీట్లు ఖాళీ అయితే అందులో కూడా బీజేపీ వాటా పెద్దదిగానే ఉంటుందని అనుమానిస్తున్నారు.

బీజేపీకి ఎంపీలు కావాలి. పైగా రాజ్యసభలో ఆ అవసరం ఎక్కువగా ఉంది. దాంతో బీజేపీ కోరుతోంది. మిత్రపక్షంగా ఉన్న టీడీపీ ఇస్తోంది ఇదే తరహాలో సాగుతూ ఉంటే కనుక ఏపీ నుంచి బీజేపీకే ఎక్కువ మంది రాజ్యసభ సభ్యులు వస్తారని అంటున్నారు. అలా చేసుకోవడమే బీజేపీ మార్క్ పాలిటిక్స్ అని అంటున్నారు.

మరి ఉన్న సీట్లలో సగానికి సగం బీజేపీకి ఇచ్చేస్తే తమ సంగతి ఏమిటని తమ్ముళ్ళు అడుగుతున్నారు. బీజేపీతో కేంద్రంతో రాజకీయ అవసరాల కోసం టీడీపీ రాజ్యసభ అవకాశాలను వదులుకుంటోంది. ఏపీలో పోలవరం అమరావతి ప్రాజెక్టులు పూర్తి కావాలంటే కేంద్రం సహకారం తప్పనిసరి అని భావిస్తోంది.

అయితే బీజేపీకే ఈ పొత్తు వల్ల ఎక్కువ ఎంపీ సీట్లు దక్కుతున్నాయని టీడీపీ ఆశావహులకు మొండి చేయి మిగులుతోందని పసుపు పార్టీలో చర్చ సాగుతోంది. ఇక మీదట అయినా పార్టీ కోసం కష్టపడిన టీడీపీ తమ్ముళ్ళకు గుర్తించాలని ఎంపీ సీట్ల విషయంలో ఫస్ట్ ప్రయారిటీ టీడీపీకే దక్కాలని అంతా కోరుతున్నారు. మరి అధినాయకత్వం ఏ విధంగా ఆలోచిస్తుందో చూడాలి. ఏది ఏమైనా 2014 నుంచి 2018 మధ్యలో టీడీపీతో బీజేపీ పొత్తు ఉన్నా ఇంత గరిష్టంగా లాభపడలేదని ఈసారి కేంద్రంలో బీజేపీకి టీడీపీ అవసరం ఎక్కువగా ఉన్నా కూడా ఏపీ పాలిటిక్స్ లో తన హవాను చాటుకుంటోంది అని అంటున్నారు. ఈ రాజకీయ మర్మం అర్ధం కాక తమ్ముళ్ళు తమ పదవుల విషయంలో అయోమయంలో పడుతున్నారుఇ.