ఏపీ నుంచి స్మృతి ఇరానీ ?
ఏపీలో ఒకే ఒక రాజ్యసభ సీటుకు ఖాళీ ఏర్పడింది. ఆ ఖాళీని ఎవరితో భర్తీ చేస్తారు అన్న దాని మీద రకరకాలైన పేర్లు రాజకీయ తెర మీద వినిపిస్తున్నాయి
By: Tupaki Desk | 22 April 2025 11:00 PM ISTఏపీలో ఒకే ఒక రాజ్యసభ సీటుకు ఖాళీ ఏర్పడింది. ఆ ఖాళీని ఎవరితో భర్తీ చేస్తారు అన్న దాని మీద రకరకాలైన పేర్లు రాజకీయ తెర మీద వినిపిస్తున్నాయి. అనేక రకాలుగా ప్రచారం సాగుతోంది. ఇక ఈ ఒక్క సీటు ఎవరికి వెళ్తుంది అన్నది కూడా మరో చర్చగా ఉంది.
అయితే ఢిల్లీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు చూస్తే కనుక ఈ సీటు కచ్చితంగా బీజేపీకే వెళ్తుంది అని అంటున్నారు. ఇదిలా ఉండగా ఈ సీటు బీజేపీలో ఎవరికి అన్నది మరో చర్చ. విజయసాయిరెడ్డి ప్లేస్ ని తమిళనాడు బీజేపీకి చెందిన మాజీ ప్రెసిడెంట్ అన్నామలై భర్తీ చేస్తారు అన్నది కూడా ఇప్పటిదాకా వస్తున్న ప్రచారంగా ఉంది.
అయితే ఇపుడు మరో ప్రచారం ఏమిటి అంటే కేంద్రంలో గత అయిదేళ్ళలో మంత్రిగా పనిచేసి బీజేపీ మహిళా నాయకురాలిగా ఎంతో కీలకంగా ఉన్న స్మృతి ఇరానీకి ఈ సీటు ఇస్తారని. ఆమెని ఈ సీటు నుంచి పోటీ చేయించి రాజ్యసభకు తెస్తారని అంటున్నారు. ఇక ఆమెకి ఏపీ కోటాలో కేంద్ర మంత్రి పదవి కూడా ఇస్తారని అంటున్నారు.
దాంతో ఇదేమి కొత్త ట్విస్ట్ అని అంతా ఆలోచిస్తున్నారు. ఢిల్లీకి చెందిన స్మృతి ఇరానీని ఏపీ నుంచి రాజ్యసభకు పంపించడం ద్వారా ఏ రకమైన రాజకీయ సందేశం ఇస్తారు అన్నది కూడా చర్చగా ఉంది. అయితే ఏపీలో బీజేపీని బలోపేతం చేసేందుకు స్మృతి ఇరానీ సేవలు ఉపయోగపడతాయన్న కోణంలో ఆమెను ఎంపిక చేయవచ్చు అని అంటున్నారు.
మరో వైపు చూస్తే ఉత్తరప్రదేశ్ లో అమేధీ లోక్ సభ నియోజకవర్గం నుంచి 2024 ఎన్నికల్లో పోటీ చేసి స్మృతి ఇరానీ ఓటమి పాలు అయ్యారు. ఆమె ఆ సీటుకు సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు 2019లో అదే సీటు నుంచి పోటీ పడిన రాహుల్ గాంధీని ఆమె ఓడించి జెయింట్ కిల్లర్ అయ్యారు.
ఇక గత అయిదేళ్ళూ కేంద్రంలో ఆమె హవా ఒక లెక్కన సాగింది. అయితే ఆమె ఓటమి పాలు అయ్యాక వాయిస్ తగ్గింది. ఆమె పేరు ఢిల్లీ సీఎం రేసులో కూడా ఒక దశలో వినిపించింది. ఇపుడు చూస్తే ఆమెని ఏపీకి తెచ్చి పెద్దల సభలో కూర్చోబెడతారు అని అంటున్నారు.
ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయి ఇరవై నిముషాల పాటు అనేక అంశాల మీద చర్చించారు. అందులో రాజ్యసభ అభ్యర్థి ఎవరు అన్న దాని మీద కూడా ఉందని అంటున్నారు. ఈ నెల 29తో రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేసే గడువు ముగిసిపోతుంది. అయితే ఒకటి రెండు రోజులలోనే రాజ్యసభ అభ్యర్ధి పేరు కూటమి ప్రకటిస్తుంది అని అంటున్నారు.
ఇంకో వైపు చూస్తే చంద్రబాబు కేంద్ర మంత్రులతో భేటీలు వేస్తూ బిజీగా ఉన్న వేళ అమిత్ షాతో ఆయన బీజేపీ అభ్యర్థి గురించి చర్చిస్తున్న వేళ వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డి కూడా కాకతాళీయంగా ఢిల్లీలోనే ఉన్నారని ప్రచారం సాగుతోంది.
మరి ఆయన ఢిల్లీలో ఎందుకు ఉన్నారో ఏమో తెలియదు అంటున్నారు. ఒకవేళ వారూ వీరూ కాకుండా విజయసాయిరెడ్డే బీజేపీ తరఫున తిరిగి ఎంపీ అభ్యర్ధి అవుతారా అన్న ప్రచారం కూడా సాగుతోందిట. సో ఈ సస్పెన్స్ కి ఒకటి రెండు రోజులలో ముగింపు ఉండే చాన్స్ ఉంది అని అంటున్నారు.
