రాజా సింగ్ 'ఫైర్'.. సొంతింటికి నిప్పు పేడుతోందా?
అయితే.. ఆయన ఫైర్ ఇప్పుడు సొంత పా ర్టీకే ఇబ్బంది కలిగించేలా మారుతోందన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది
By: Tupaki Desk | 4 Jun 2025 9:45 AM ISTరాజాసింగ్. ఫైర్ బ్రాండ్ నాయకుడు. ఘోషా మహల్ ఎమ్మెల్యే. అయితే.. ఆయన ఫైర్ ఇప్పుడు సొంత పా ర్టీకే ఇబ్బంది కలిగించేలా మారుతోందన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. నిజానికి ఒక పార్టీలో ఫైర్ బ్రాండ్ ఉంటే.. ఆ పార్టీకి మేలు జరగాలి. ఆయన/ ఆమె వల్ల.. ప్రత్యర్థిపార్టీలు టెన్షన్‌లో పడాలి. ఇది సహజంగానే ఫైర్ బ్రాండ్ నాయకుల వల్ల పార్టీలకు జరిగే మేలు. అయితే.. కొన్నాళ్లు రాజా సింగ్ కూడా ఇలానే వ్యవహరించారు.
కానీ.. తర్వాత తర్వాత.. ఆయన తీరు మారిపోయింది. ఓ కీలక నాయకుడి అండ చూసుకుని.. ఆయన ప్రత్యర్థులను తన ప్రత్యర్థులుగా మార్చుకుని.. వారిని కార్నర్ చేస్తూ.. సొంత పార్టీకే ఎసరు పెడుతున్నార న్న వాదన బలంగా వినిపిస్తుండడం గమనార్హం. తాజాగా తనను సస్పెండ్ చేస్తే.. అంటే చేసిన సవాల్ మరింతగా సెగ పెంచింది. వాస్తవానికి గత ఎన్నికలకు ముందు కూడా.. రాజా సింగ్ సస్పెండ్ అయ్యారు. తీవ్ర విమర్శలు, కేసుల నేపథ్యంలో ఆయనపై వేటు వేశారు.
కానీ, భారీ లాబీయింగ్ కారణంగా.. అప్పట్లో రాజా బతికిపోయారు. సస్పెన్షన్ ఎత్తేయించుకుని ఎమ్మెల్యే టికెట్‌ను కూడా పొందేశారు. అయితే.. తాజాగా మరోసారి ఆయన రెచ్చిపోవడం.. ఓ కీలక నాయకుడిని టార్గెట్ చేసుకోవడం బీజేపీలో నేతల మధ్య చర్చగా మారింది. నిజానికి.. పార్టీలో బలమైన గళం కోసం.. నాయకులు వెతుకుతున్నారు. వచ్చే ఎన్నికల్లో బలమైన సంఖ్యా బలం దక్కించుకుని ముందుకు సాగాలని కూడా నిర్ణయించుకున్నారు.
కానీ, రాజాసింగ్ ఉన్నారని అనుకున్నా.. ఆయన ప్రత్యర్థులపై చేయాల్సిన రాజకీయాలను సొంత నాయ కులపైనా.. సొంత పార్టీపైనా చేయడం గమనార్హం. గతంలో సస్పెండ్‌కు గురైనప్పుడు.. అరెస్టు జరిగినప్పు డు.. ఎంతగా బాధపడ్డారో.. ఆయన సతీమణి మీడియా ముందుకు వచ్చి.. ఎంత రొద పెట్టుకున్నారో.. అవ న్నీ రాజా మరిచిపోయినట్టుగా ఉన్నారు. సంతృప్తి, అసంతృప్తి అనేవి అన్ని పార్టీల్లోనూ ఉంటాయి. కానీ.. వాటిని తట్టుకుని నిలబడకుండా.. కుప్పి గంతులు వేస్తే.. కోరి కష్టాలు తెచ్చుకున్నట్టేనని అంటున్నారు పరిశీలకులు. మరి రాజాగారు ఇప్పటికైనా మారతారో.. తన ప్రతాపం చూపుతారో చూడాలి.
