Begin typing your search above and press return to search.

జమిలికి పచ్చ జెండా...పార్లమెంట్ లో బిల్లు!

అయితే కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీ మిత్రులు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో మాత్రం జమిలిని తీవ్రంగా వ్యతిరేకించారు.

By:  Tupaki Desk   |   7 July 2025 9:45 PM IST
జమిలికి పచ్చ జెండా...పార్లమెంట్ లో బిల్లు!
X

దేశంలో జమిలి ఎన్నికలకు వాతావరణం అనుకూలంగా మారుతోంది. జమిలి ఎన్నికల కోరికను కేంద్రంలో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ముచ్చటగా మూడోసారి ఎన్నికైన సందర్భంగా తీర్చుకోబోతోంది. 2014లో తొలిసారి మోడీ నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ఇన్నాళ్ళుగా చేస్తున్న జమిలి జ్వరం ఇప్పటికి తీరనుంది అని అంటున్నారు.

జమిలికి అన్ని అవాంతరాలు తొలగిపోయిన నేపథ్యంలో కేంద్రం పచ్చ జెండా ఊపేందుకు పూర్వ రంగాన్ని సిద్ధం చేసింది. జమిలి ఎన్నికల మీద కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 2022 ప్రాంతంలో మాజీ రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ నాయకత్వంలోని ఏర్పాటు చేసిన కమిటీకి పూర్తి అధ్యయనం చేసి నివేదికను ఇచ్చే బాధ్యతను అప్పగించింది. ఆ కమిటీ అన్ని రాష్ట్రాలలోని రాజకీయ పార్టీలతో చర్చలు జరిపింది.

అయితే కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీ మిత్రులు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో మాత్రం జమిలిని తీవ్రంగా వ్యతిరేకించారు. ఇక బీజేపీ మిత్రులు ఉన్న రాష్ట్రాలలో జమిలి ఎన్నికలకు ఓకే చెప్పారు. కొన్ని రాజకీయ పార్టీలు జమిలికి ఎస్ అని కానీ నో అని కానీ చెప్పకుండా పెండింగులో పెట్టాయి. అయితే దేశంలో మెజారిటీ రాష్ట్రాలు ఎన్డీయే ఏలుబడిలో ఉండడంతో జమిలికి అనుకూలంగా ఉన్నాయని తేలిన నేపథ్యంలో మరో అడ్డంకి కేంద్రానికి ఏర్పడింది.

న్యాయవాదులు కొంతమంది జమిలి మీద సందేహాలు వ్యక్తం చేశారు. ఖర్చు తగ్గుతుందని ఒకేసారి ఎన్నికలు అంటున్నా అవినీతి పెరిగిపోతుందని అలాగే కేంద్ర ఎన్నికల సంఘం ఒకేసారి ఎన్నికలను ఎలా నిర్వహిస్తుంది అన్న ప్రశ్నలను సంధించారు. ఆ మీదట ఢిల్లీ బార్ అసోసియేషన్ తో పాటు న్యాయవాదులు దేశంలో అనేకమంది ఇదే అంశం మీద సుప్రీంకోర్టులో పిటిషన్లు పెద్ద ఎత్తున వేశారు.

ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం కూడా సుప్రీం కోర్టుకు మాజీ రాష్ట్రపతి అధ్యయనంతో కూడిన నివేదికను పంపించింది. అంతే కాదు ఈ నివేదికను అనుసరించి తాము జమిలి ఎన్నికల మీద ఆలోచిస్తున్నామని కేంద్రం సుప్రీం కోర్టుకు విన్నవించింది అదే విధంగా జమిలికి వ్యతిరేకంగా పడిన పిటిషన్లను క్వాష్ చేయాలని కూడా కోరింది.

ఈ చూస్తే కనుక తాజాగా సుప్రీంకోర్టు ఈ నివేదికను పరిశీలించి జమిలి ఎన్నికలకు సానుకూలంగా నిర్ణయం తీసుకుంది అని అంటున్నారు. ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే ఖర్చు తగ్గడంతో పాటు పాలనకు కూడా ఆటంకం ఏర్పడదన్న కేంద్రం వాదనలతో ఏకీభవించింది. పదే పదే దేశంలో ఎక్కడో ఒక చోట ఎన్నికల వల్ల అభివృద్ధి కూడా సాఫీగా సాగదు అన్న కేంద్రం ఆలోచనలకు సైతం మద్దతుగా సుప్రీంకోర్టు నిలిచింది అని అంటున్నారు.

ఈ మొత్తం వ్యవహారంలో సుప్రీం కోర్టు కూడా జమిలి ఎన్నికలకు సరేనని చెప్పింది అని అంటున్నారు. ఇక దేశంలో చూస్తే రాజకీయ లెక్కల విషయంలో బీజేపీ ఎపుడూ పక్కాగా ఉంటుందని అంటారు. ప్రస్తుతం వాతావరణం అనుకూలంగా ఉంది. దాంతో జమిలి ఎన్నికలను జరిపించాలని బీజేపీ చూస్తోంది. ఇక ఆలస్యం ఎందుకు అన్నట్లుగా ఈ నెల 21 నుంచి ఆగస్ట్ 21 దాకా సాగే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలలో జమిలి ఎన్నికల బిల్లుని ఆమోదించడం ద్వారా పచ్చ జెండా ఊపాలని కీలక నిర్ణయం తీసుకుంది అని అంటున్నారు అదే కనుక జెరిగితే మాత్రం దేశంలో జమిలి ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైనట్లే అని అంటున్నారు.