Begin typing your search above and press return to search.

మిత్రులు చేతులు కలుపుతారా ?

By:  Tupaki Desk   |   15 July 2023 9:04 AM GMT
మిత్రులు చేతులు కలుపుతారా ?
X

రాబోయే ఎన్నికల్లో సొంతంగానే అవసరమైన బలం సంపాదించి అధికారంలోకి రావాలన్నది బీజేపీ అగ్రనేతల ఆలోచన. బీజేపీ టార్గెట్ 350 పార్లమెంటు సీట్లుగా సీనియర్ నేతలు చెబుతున్నారు. మరి ఇదెంతవరకు వాస్తవంలోకి వస్తుందో ఎవరు చెప్పలేకపోతున్నారు. ఉత్తరాధిలో బీజేపీపైన వ్యతిరేకత మొదలైందని ఒక ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో దక్షిణాదిలో అసలు బలమే లేకుండా పోయింది. అధికారంలో ఉన్న ఒక్క కర్నాటక కూడా చేజారిపోయింది. ఈ నేపధ్యంలోనే రెండు పాయింట్ల మీద నరేంద్రమోడీ సమావేశం ఏర్పాటుచేశారు.

ఎన్డీయేని బలోపేతం చేయటం మొదటి అజెండా అయితే కొత్తమిత్రలను కలుపుకోవటం రెండో పాయింట్. అందుకనే ఈనెల 18వ తేదీన ఢిల్లీలోనే మోడీ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటుచేశారు. అయితే పార్టీవర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం కొత్తమిత్రులు బీజేపీతో చేతులు కలపటానికి వెనకాడుతున్నారట. ఎందుకంటే నరేంద్రమోడీపైన జనాల్లో వ్యతిరేకత పెరుగుతోందని ఆయా రాష్ట్రాల్లో పార్టీలకు సమాచారం అందటమే కారణమంటున్నారు.

అందుకనే ఎన్డీయేలో చేరటం కన్నా ఎన్నికల తర్వాత భాగస్వాములు అవటంపైనే ఎక్కువగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు ఏపీలో చంద్రబాబునాయుడు వైఖరినే ఉదాహరణగా ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. ఒకపుడు బీజేపీతో పొత్తుపెట్టుకోవాలని చంద్రబాబు బాగా ప్రయత్నాలు చేశారు. అయితే ఇపుడు మాత్రం అంత తొందరపడటంలేదు. కారణం ఏమిటంటే బీజేపీ మీద జనాల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుండటమేనట. బీజేపీతో పొత్తుపెట్టుకుంటే దాని ప్రభావం టీడీపీ మీద ఎక్కడ పడుతుందో అనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లు పార్టీవర్గాలే చెబుతున్నాయి.

ఇపుడే ఎన్డీయేలో చేరటం కన్నా ఎన్నికల తర్వాత పరిస్ధితుల ప్రకారం చేతులు కలిపితే బాగుంటందని ఆలోచిస్తున్నారట. ఇలాంటి ఆలోచనలోనే చాలా ప్రాంతీయపార్టీలున్నట్లు బీజేపీ వర్గాలే చెబుతున్నాయి. ఇదే జరిగితే మోడీ ప్రయత్నాలు పెద్దగా వర్కవుటయ్యే అవకాశాలు లేవనే చెప్పాలి. మోడీ ఎంతో ప్రతిష్టాత్మకంగా పార్లమెంటులో ప్రవేశపెట్టబోతున్న కామన్ సివిల్ కోడ్ బిల్లుపైన ఇప్పటికే భాగస్వామ్య పార్టీల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయట. ప్రధానంగా ఉత్తరాధి రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీల్లో మిశ్రమస్పందన కనబడుతోందని సమాచారం. మరి 18వ తేదీ సమావేశంలో ఏమి జరుగుతుందో చూడాలి.