పాక్ తో యుద్ధం..మోదీ మీ కోరిక తీరుస్తారు..రాజ్ నాథ్ సంచలన కామెంట్స్
సైన్యానికి ఇప్పటికే భారత ప్రధాని మోదీ స్వేచ్ఛ ఇచ్చారు. త్రివిధ దళాధిపతులతోనూ భేటీ అయ్యారు.
By: Tupaki Desk | 5 May 2025 9:29 AM ISTవచ్చే ఎన్నికల్లో గెలిస్తే వెయ్యేళ్లు గుర్తుండేలా పాలన zపాక్ ఆక్రమిత కశ్మీర్ ను స్వాధీనం చేసుకుంటాం..
ఇవీ గత ఏడాది ఎన్నికలకు ముందు బీజేపీ నాయకుల వ్యాఖ్యలు.. సహజంగానే కశ్మీర్ అంశాన్ని చూపించి బీజేపీ నాయకులు రాజకీయ లబ్ధి పొందాలని అనుకుంటారు. ప్రజలు కూడా కశ్మీర్ విషయంలో ఏదైనా గట్టి చర్య తీసుకోవాలంటే అది బీజేపీకే సాధ్యం అని నమ్ముతుంటారు.
కశ్మీర్ కు ప్రత్యేకత కల్పించే ఆర్టికల్ 370ని పట్టుబట్టి 2019లో రద్దు చేయడంతో బీజేపీపై ప్రజలకు మరింత నమ్మకం ఏర్పడింది. ఇక గత ఎన్నికలలో చెప్పినట్లుగా పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)ను తిరిగి స్వాధీనం చేసుకోవడం ఎప్పుడు?
పీవోకే విషయంలో బీజేపీ రాజకీయ ప్రకటనలు చేసినా ప్రజలు ఎవరూ పెద్దగా నమ్మలేదు. కారణం.. అది కొంత సంక్లిష్టతలతో కూడిన వ్యవహారం కావడమే.
అయితే, పీవోకే స్వాధీనం మాట అటుంచితే..పెహల్గాంలో ఉగ్రవాదులు అత్యంత దారుణంగా పర్యటకులపై దాడికి దిగడం.. వారికి పాకిస్థాన్ మద్దతు ఉందని తేలడంతో భారత్ తన ప్రతీకారానికి సిద్ధం అవుతోంది.
సైన్యానికి ఇప్పటికే భారత ప్రధాని మోదీ స్వేచ్ఛ ఇచ్చారు. త్రివిధ దళాధిపతులతోనూ భేటీ అయ్యారు. సైన్యం, నేవీ సన్నద్ధత కూడా ప్రకటించాయి. ఇక మిగిలింది ప్రతీకారం ఎప్పుడా? అనేదే. ఈ నేపథ్యంలోనే భారత రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ ఉద్రిక్తతల సమయంలో రక్షణ మంత్రి వ్యాఖ్యలకు ఎలాంటి విలువ ఉంటుందో అందరికీ తెలిసిందే. సాక్షాత్తు అలాంటి రక్షణ మంత్రి అయిన రాజ్ నాథ్ మాట్లాడుతూ.. భారత్ పై దాడులకు తగిన రీతిలో సమాధానం ఉంటుందని అన్నారు.
మోదీ పట్టుదల, పనితీరు గురించి ప్రజలకు తెలుసని.. ప్రజలు కోరుకున్నది ఆయన కచ్చితంగా నెరవేరుస్తారని కూడా రాజ్ నాథ్ వ్యాఖ్యానించారు. సరిహద్దుల భద్రత, సైనికుల ప్రాణాలను కాపాడాడం రక్షణ మంత్రిగా తన బాధ్యత అని పేర్కొన్నారు.
