Begin typing your search above and press return to search.

రాజా సింగ్ మిస్డ్ కాల్ ఇస్తే చాలా...బీజేపీలో ఇంతేనా ?

ఏంటో తేడా పార్టీ అని బీజేపీ గురించి ఆ పార్టీ నేతలు గొప్పలు చెప్పుకునేవారు. తేడా అంటే అన్ని పార్టీల కంటే విభిన్నం అని.

By:  Tupaki Desk   |   24 July 2025 2:00 PM IST
రాజా సింగ్ మిస్డ్ కాల్ ఇస్తే చాలా...బీజేపీలో ఇంతేనా ?
X

ఏంటో తేడా పార్టీ అని బీజేపీ గురించి ఆ పార్టీ నేతలు గొప్పలు చెప్పుకునేవారు. తేడా అంటే అన్ని పార్టీల కంటే విభిన్నం అని. బీజేపీ అత్యంత క్రమశిక్షణ కలిగిన పార్టీ అని కూడా చెప్పుకునేవారు. బీజేపీ అంటే అవినీతికి ఆశ్రియ పక్షపాతానికి వారసత్వానికి కుటుంబ పాలనకు దూరం అని కూడా ప్రవచించేవారు. అంతే కాదు ఇతర పార్టీల నుంచి నాయకుల కంటే సంఘ్ లో శిక్షణ పొందిన వారినే తీసుకోవడం ద్వారా తమ భావజాలాన్ని ఎక్కువగా ప్రచారం చేయవచ్చునని కూడా ఆశించేవారు.

కానీ బీజేపీ తీరు గతానికి పోలిస్తే చాలా మారిపోయింది అని అంటారు. ఇతర పార్టీలో ఉన్నపుడు అవినీతి కేసులు ఎదుర్కొనేవారు బీజేపీలోకి చేరితే చాలు ఆ ఊసే ఉండదని విమర్శలు ఉన్నాయి. వారు సేఫ్ జోన్ లోకి వెళ్ళినట్లే అని చెబుతారు. అలాగే తమకు రాజకీయ అవసరం ఉన్న ప్రాంతీయ పార్టీలు కానీ ఇతర పార్టీ నేతలు కానీ వారి విషయంలో అవినీతి ఆరోపణలు ఉన్నా కేసులు ఉన్నా నెమ్మదిస్తాయని కూడా ప్రచారంలో ఉన్న మాటే.

ఇక బీజేపీని ఎవరైనా ధిక్కరిస్తే చాలు వారికి జీవిత కాలం బహిష్కరణే. ఎప్పటికీ చేర్చుకునేవారు కాదు. తెలంగాణాలో బీజేపీ సీనియర్ నేతగా ఉన్న ఆలె నరేంద్ర పార్టీని వీడిపోయాక మళ్ళీ చేర్చుకోలేదు. ఆయన తెలంగాణా బీజేపీకి టైగర్ అని పేరు. అలాంటి నాయకుడు తరువాత కాలంలో టీఆర్ఎస్ లో చేరారు. రెండు సార్లు ఎంపీగా కూడా అయి కేంద్ర మంత్రి కూడా అయ్యారు.

ఇక అవినీతి ఆరోపణలు వస్తే వారిని పార్టీ నుంచి ఏకంగా బయటకు పంపించేసేవారు. వారు ఎంతటి బలమైన నేతలు అయినా ఇదే విధానం. ఇపుడు చూస్తే ఇతర పార్టీల మాదిరిగా బీజేపీలనూ బాహాటంగా మాటల యుద్ధాలు జరుగుతున్నాయి. ఒకరిని ఒకరు నిందించుకుంటున్నారు. అయినా బీజేపీ నేతలు అన్ని పార్టీలలో ఉన్నాయి కదా మా పార్టీలో అలగే ఉంటుందని సర్దిచెబుతున్నారు.

ఇక రాజా సింగ్ అనే ఘోషామహల్ ఎమ్మెల్యే బీజేపీని విమర్శిస్తూ గత నెలలో రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను పార్టీ ఆమోదించింది. అయితే ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయలేదు. పార్టీ చెబితే చేస్తాను అంటున్నారు తాను మోడీ అమిత్ షాలకు విధేయుడిని అని చెబుతున్నారు.

ఇక నిజామాబాద్ బీజేపీ ఎంపీ అయిన ధర్మపురి అరవింద్ అయితే ఆయన పార్టీ నుంచి సస్పెండ్ కాలేదు కదా రాజీనామా మాత్రమే చేశారు మిస్డ్ కాల్ ఇస్తే తిరిగి పార్టీలోకి వస్తారు అని సింపుల్ గా చెప్పేశారు. బీజేపీలో అలాంటి వెసులుబాటు ఉందా అన్నదే చర్చగా ఉంది. బీజేపీని పలు మార్లు ఎన్నో రకాలుగా రాజా సింగ్ ఇబ్బంది పెట్టారని ఆ పార్టీ వారే చెబుతూ వచ్చారు.

అందుకే ఆయనను పార్టీ నుంచి బయటకు పంపించాలని కూడా నిర్ణయం తీసుకుని పార్టీ పెద్దలకు లేఖ రాశారని ప్రచారం సాగింది. ఇపుడు మళ్ళీ ఆయన వస్తారు అని అంటున్నారు. రాజా సింగ్ కూడా బీజేపీలో చేరేందుకు రెడీ అవుతున్నారు. ఇలా అధినాయకత్వాన్ని ఎవరైనా ధిక్కరించి తిరిగి మిస్డ్ కాల్ ఇచ్చి చేరిపోయే సదుపాయం ఉంటే బీజేపీకి తక్కిన పార్టీలకు తేడా ఏముంది అని అంటున్నారు. మొత్తం మీద బీజేపీ కూడా ఇతర రాజకీయ పార్టీల మాదిరిగా ఉంటోందా అన్నదే చర్చ. బీజేపీ విషయంలో అయితే అలా జరగకూడదని అభిమానులు మాత్రం కోరుకుంటున్నారు.