జమిలి ఎన్నికలు...ఎంపీల సీట్ల పెంపు...బీజేపీ మాస్టర్ ప్లాన్ !
దేశంలో గత మూడు దఫాలుగా గెలిచి అధికారం చేపట్టిన బీజేపీ వరసగా నాలుగోసారి కూడా గెలవాలని చూస్తోంది.
By: Satya P | 21 Feb 2026 3:00 PM ISTదేశంలో గత మూడు దఫాలుగా గెలిచి అధికారం చేపట్టిన బీజేపీ వరసగా నాలుగోసారి కూడా గెలవాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచే దానికి సంబంధించిన కసరత్తును చేస్తూ వస్తోంది. ఈ రోజుకు ఎన్డీయేలో మిత్రులు బాగానే ఉన్నారు. అలాగే మొత్తం 28 రాష్ట్రాలలో 22 దాకా బీజేపీ దాని మిత్ర పక్షాల ఏలుబడిలోనే ఉన్నాయి. లోక్ సభలో మూడు వందలకు పైగా సీట్ల బలం ఉంది. రాజ్యసభలో తాజా ఎన్నికల తరువాత ఎన్డీయే బలం పూర్తిగా పెరగనుంది. ఇలాంటి తరుణంలో బీజేపీ తన అమ్ముల పొదిలోని అస్త్రాలను బయటకు తీస్తోంది.
జమిలికి సిద్ధం :
బీజేపీ జమిలి ఎన్నికల గురించి ఎపుడూ మాట్లాడుతూనే ఉంది. అది అమలు చేయాలని కృత నిశ్చయంతో కూడా ఉంది. జమిలి ఎన్నికలు దేశానికి అభివృద్ధికి ఎంతో క్షేమ కరం అని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు. అదే విధంగా జమిలి ఎన్నికలతో ఖర్చు ఆదా అవుతుందని అయిదేళ్ళూ పూర్తిగా అభివృద్ధి పైనే ప్రభుత్వాలు దృష్టి నిలిపేందుకు వీలు అవుతుందని చెబుతోంది. అయితే జమిలి ఎన్నికల వెనక బీజేపీ వ్యూహాలు పక్కాగా ఉన్నాయని అంటున్నారు. అవేంటి అంటే ఒకేసారి రాష్ట్రాలకు కేంద్రానికి ఎన్నికలు పెడితే జాతీయ పార్టీల ప్రభావం గట్టిగా ఉంటుంది. అంతే కాదు జాతీయ అంశాలే చర్చకు వస్తాయి. దాంతో మోడీ ఇమేజ్ తో ఎంపీలతో పాటు అసెంబ్లీలను కూడా సులువుగా గెలుచుకోవచ్చు అన్నది అసలైన స్ట్రాటజీ అని అంటున్నారు.
రెండో విడతలోనే బిల్లు :
ఇక పార్లమెంట్ తొలి సెషన్ అన్నది ఈ నెల 13తో పూర్తి అయింది. బడ్జెట్ ని ప్రవేశ పెట్టడం దాని మీద చర్చతో తొలి విడతలో అయ్యాయి. ఇక రెండవ విడత సెషన్ ఈ నెలాఖరు నుంచి మొదలవుతుంది అని అంటున్నారు ఏప్రిల్ 2వ తేదీ వరకూ ఇది కొనసాగుతుంది అని అంటున్నారు. ఈ సెషన్ లోనే కీలక బిల్లులు అన్నీ పార్లమెంట్ ముందుకు రాబోతున్నాయని అంటున్నారు. అందులో జమిలి ఎన్నికలు ప్రదానమైనవిగా ఉన్నాయి. ఇప్పటికే మాజీ ఉప రాష్ట్రపతి రాం నాధ్ కోవింద్ నాయకత్వంలో కమిటీని వేసి జమిలి ఎన్నికల మీద దేశంలోని అన్ని రాజకీయ పార్టీల నుంచి అభిప్రాయాలను సేకరించారు. ఆ నివేదిక కూడా కేంద్రం వద్ద ఉంది. ఇపుడు బిల్లుని లోక్ సభలో ముందుగా ప్రవేశపెట్టి అక్కడ ఆమోదించి రాజ్యసభలోకి తీసుకుని రావాలని చూస్తున్నారు అని అంటున్నారు.
ఎంపీ సీట్ల విషయంలోనూ :
అంతే కాకుండా పార్లమెంట్ సీట్ల పునర్ విభజనకు కూడా కేంద్రం వడివడిగా అడుగులు వేస్తోంది. ఈ బిల్లుని కూడా పార్లమెంట్ లో ప్రవేశపెట్టి ఆమోదించుకోవాలని చూస్తోంది. 2029 ఎన్నికలకు గట్టిగా మూడేళ్ళ సమయం మాత్రమే ఉంది. ఈ లోగా బిల్లుని ఆమోదిస్తే జన గణన వచ్చే ఏడాది తొలి నెలలలో పూర్తి అవుతూనే ఎంపీ సీట్ల పెంపునకు కూడా వేగంగా పావులు కదుపుతారు అని అంటున్నారు. అంటే సీట్ల పెంపు అలాగే జమిలి ఎన్నికలు అదే విధంగా మహిళా రిజర్వేషన్ బిల్లుని 2029 ఎన్నికల్లో అమలు చేయడం ఈ విధంగా బీజేపీ త్రిముఖ వ్య్హూహంతో వచ్చే ఎన్నికల్లో పక్కాగా గెలిచేందుకు తన వ్యూహాన్ని సిద్ధం చేసుకుందని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో. .
