బీహార్ లో ఫిఫ్టీ ఫిఫ్టీ అంటున్న బీజేపీ
ఇటీవల కాలంలో నితీష్ కుమార్ వింత వింతగా ప్రవర్తిస్తున్నారు అని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. మోడీ అమిత్ షా సభలలో కూడా వారి పక్కన ఉంటూ నితీష్ కుమార్ తడబాట్లూ పొరపాట్లు చేయడాన్ని కళ్ళారా చూశారు.
By: Tupaki Desk | 10 Jun 2025 9:20 AM ISTబీజేపీ రాజకీయ చాతుర్యం ఏమిటి అంటే ఎక్కడా తగ్గాలో తెలుసుకోవడం. తన బలాన్ని పూర్తిగా అంచనా వేసుకోవడం. ఇక బీహార్ సీఎం గా దాదాపుగా రెండున్నర దశాబ్దాల పాటు కొనసాగుతున్న నితీష్ కుమార్ తోనే మళ్ళీ తమకు అధికార పీఠం దక్కుతుందని బీజేపీ కచ్చితంగా అంచనాలు వేసుకుంటోంది.
ఇటీవల కాలంలో నితీష్ కుమార్ వింత వింతగా ప్రవర్తిస్తున్నారు అని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. మోడీ అమిత్ షా సభలలో కూడా వారి పక్కన ఉంటూ నితీష్ కుమార్ తడబాట్లూ పొరపాట్లు చేయడాన్ని కళ్ళారా చూశారు. అయినా కూడా నితీష్ చేయి వదలడానికి బీజేపీ ఇష్టపడడం లేదు.
పైగా నితీష్ నాయకత్వంలోని జేడీయూకి సరిసమాన సీట్లను ఇస్తూ ఫిఫ్టీ ఫిఫ్టీ విధానంలో షేర్ చేసుకుంటోంది. బీహార్ అసెంబ్లీలో మొత్తం 243 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. అక్కడ ఎన్డీయే కూటమిలో అయిదు పార్టీలు ఉన్నాయి. బీజేపీ జేడీయూ తర్వాత కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ లోక్ జనశక్తి పార్టీ మూడవ పెద్ద పార్టీ. మరో రెండు చిన్న పార్టీలు కూటమిలో ఉన్నాయి.
ఇక ఈ ఏడాది అక్టోబర్ లో జరిగే బీహార్ ఎన్నికల్లో మొత్తం 243లో 203 సీట్లను బేజేపీ జేడీయూ పంచుకోనున్నాయి. ఇందులో కూడా జేడీయూకే 103 సీట్లు ఇచ్చి బీజేపీ వంద సీట్లకు పోటీ పడాలని చూస్తోందట. ఇక మిగిలిన నలభై సీట్లలో చిరాగ్ పాశ్వాన్ పార్టీకి 30 సీట్లు, మరో రెండు చిన్న పార్టీలకు చెరి అయిదు సీట్లు కేటాయిస్తారు అని అంటున్నారు.
బీహార్ లో నితీష్ కి మంచి ఇమేజ్ ఉంది. పైగా ఆయన సామాజిక వర్గం అండ ఉంది. దాంతోనే నితీష్ ని ముందు పెట్టి ఈ ఎన్నికలను ఎదుర్కోవాలని బీజేపీ చూస్తోంది అంటున్నారు. ఒకవేళ నితీష్ కుమార్ పార్టీకి తక్కువ సీట్లు ఇస్తే ఆయన ఎక్కడ ఇండియా కూటమిలోకి వెళ్తారో అన్న కలవరం కూడా ఉంది అని అంటున్నారు.
అందుకే ఆయనకే సీట్ల ఒప్పందంలో అగ్ర తాంబూలం ఇవ్వాలని కమలనాధుకు వ్యూహ రచన చేశారు అని అంటున్నారు. సరిగ్గా 2020లోనూ ఇదే విధంగా వ్యవహరించారు. అయితే అప్పట్లో మొత్తం సీట్లను బీజేపీ 121, జేడీయూ 122గా తీసుకున్నాయి.
ఈసారి బీజేపీ కొత్త వ్యూహం అనుసరిస్తోంది. ఇద్దరి సీట్లు తగ్గించుకుని మిత్రులకు 40 సీట్లు వదిలేసింది. అందులో కూడా చిరాగ్ పాశ్వాన్ కి ఎక్కువ సీట్లు దక్కేలా చూస్తోంది. ఒకవేళ జేడీయూ కనుక రివర్స్ అయితే చిరాగ్ తో మైత్రిని కొనసాగిస్తూ అధికారం దక్కించుకోవాలన్న వ్యూహమేదో ఉందని అంటున్నారు. ఏది ఏమైనా నితీష్ నే సీఎం అభ్యర్ధిగా బీజేపీ ప్రచారం చేస్తుందా అన్నది చూడాల్సి ఉంది అని అంటున్నారు.