నితీష్ కి ఉప రాష్ట్రపతి...బీహార్ సీఎం కోసమేనా ?
బీహార్ లో బీసీలు ఎక్కువ. ముస్లిం మైనారిటీల డామినేషన్ ఎక్కువ. పైగా బలమైన ప్రాంతీయ పార్టీగా ఆర్జేడీ ఉంది.
By: Tupaki Desk | 24 July 2025 1:04 AM ISTబీహార్ సీఎం పదవి బీజేపీకి ఎపుడూ అందని పండుగానే ఉంది. దేశంలో రెండు పెద్ద రాష్ట్రాలలో ఒకటి అయిన యూపీని బీజేపీ ఏనాడో గెలుచుకుంది. ఇప్పటికి మూడున్నర దశాబ్దాల క్రితమే కళ్యాణ్ సింగ్ ముఖ్యమంత్రిగా బీజేపీ పాలన మొదటిసారి ఆరంభించింది. అయితే బీహార్ మాత్రం బీజేపీకి అసలు దక్కడం లేదు.
బీహార్ లో బీసీలు ఎక్కువ. ముస్లిం మైనారిటీల డామినేషన్ ఎక్కువ. పైగా బలమైన ప్రాంతీయ పార్టీగా ఆర్జేడీ ఉంది. ఇక జనతాదళ్ లో చీలిక రావడంతో ఒక ముక్కతో నితీష్ కుమార్ జేడీయూని ఏర్పాటు చేసి దశాబ్దాలుగా తన రాజకీయాన్ని కాపాడుకుంటున్నారు.
జేడీయూకి ఎపుడూ పూర్తి మెజారిటీ రాలేదు. కానీ ఆర్జేడీ, కాంగ్రెస్ బీజేపీ వంటి పార్టీల అండతో బీహార్ పీఠం మీద అత్యధిక కాలం పాలించిన నేతగా నితీష్ కుమార్ గుర్తింపు పొందారు. ఇక ఏడున్నర పదుల వయసుకు చేరువ అవుతున్న నితీష్ కుమార్ ని ఈసారి బీహార్ పీఠం నుంచి తప్పించి తాము ఎక్కాలని బీజేపీ చూస్తోంది.
అందులో భాగంగా ఆయనను ఉప రాష్ట్రపతిగా చేయాలని భావిస్తోంది అని అంటున్నారు. మరికొద్ది నెలలలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఈ నేపధ్యంలో నితీష్ కి దేశంలో అత్యున్నత పదవిని ఇవ్వడం ద్వారా జేడీయూ పూర్తి మద్దతుతో పాటు జనంలో మద్దతు అందుకుని తొలిసారి బీహార్ సీఎం పదవి చేపట్టాలని చూస్తోంది అని అంటున్నారు.
ఇక నితీష్ కుమార్ రాజకీయ వారసుడిగా ముందుకు వచ్చిన నిశాంత్ కుమార్ ని బీహార్ సీఎం గా చేయాలని జేడీయూ పట్టుబట్టే అవకాశం ఉంది అని అంటున్నారు. అయితే దానికి కూడా బీజేపీ ఒక పదునైన వ్యూహం రచించిందని అంటున్నారు. నిశాంత్ కుమార్ ని ఉప ముఖ్యమంత్రిగా చేస్తామని హామీ ఇవ్వబోతోంది. హాభై ఏళ్ల నిశాంత్ కుమార్ రాజకీయాలకు కొత్తవారు ఈ ఎన్నికలతోనే తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
దాంతో ఆయనకు నేరుగా సీఎం పదవి ఇవ్వడం కుదరదని బీజేపీ నేతలు అంటున్నారు. అలా నితీష్ ని పోటీ నుంచి తప్పించి నిషాంత్ ని ఉప ముఖ్యమంత్రిని చేసి బీహార్ గద్దెని ఎక్కాలని బీజేపీ పక్కాగా ప్లాన్ చేస్తోంది అని అంటున్నారు. అయితే నితీష్ కుమార్ తో బీజేపీకి ఎపుడూ అనుకున్న వ్యూహాలు అమలు కావని గతాన్ని గుర్తు చేసే వారు ఉన్నారు.
ఆయన ఒకసారి ఉప రాష్ట్రపతి అయ్యాక కుమారుడికి సీఎం పదవి కోసం పట్టుబడితే అపుడు బీజేపీ కధ అడ్డం తిరుగుతుందని అంటున్నారు. అంతే కాదు బీజేపీ వదిలేసే నిషాంత్ ని తమ వైపు తిప్పుకోవడానికి ఇండియా కూటమి సిద్ధంగా ఉంది అని అంటున్నారు. రాజ్యసభ డిప్యూటీ చైర్ మన్ జేడీయూ నేత అయిన హరివంశ రాయ్ కి ఉప రాష్ట్రపతి ఇవ్వాలని జేడీయూ కోరుతోంది. కానీ బీజేపీ చూపు మాత్రం నితీష్ కుమార్ మీద ఉందిట. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అని ఆ పార్టీ గట్టి వ్యూహమే రచిస్తోంది.
